.
Subramanyam Dogiparthi …….. చిరంజీవి విజయయాత్రలో ఓ మైలురాయి ఈ అభిలాష సినిమా . యండమూరి వీరేంద్రనాధ్- చిరంజీవి- కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ . ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్ గానే సంచలనం సృష్టించిన ఈ నవల సినిమాగా ఇంకా ఎక్కువ సంచలనమే సృష్టించిందని చెప్పవచ్చు .
కధాంశంలో ఉన్న పట్టు , సస్పెన్స్ , సినిమా స్క్రీన్ ప్లేలో ఉన్న బిర్రు , ఇళయరాజా సంగీతం , ఆత్రేయ-వేటూరిల సాహిత్యం , బాలసుబ్రమణ్యం- యస్ జానకిల గాత్రం , అన్నింటినీ అద్భుతంగా స్టీర్ చేసిన కోదండరామిరెడ్డి దర్శకత్వం . అందరూ అభినందనీయులే .
Ads
ఉరిశిక్ష రద్దు అంశంపై దశాబ్దాలుగా చర్చ నడుస్తూనే ఉంది . శిక్షలు కఠినంగా ఉంటే నేరాలు తగ్గుతాయనేది ఒక థియరీ . ఇస్లామిక్ దేశాలలో శిక్షలు కఠినంగా ఉండటం వలనే నేరం చేయటానికి పౌరులు సాహసించరని కొందరి వాదన . శిక్షల ద్వారా నేరస్తులను రిపేర్ చేసి మళ్ళా సమాజంలోకి తేవాలనేది సంస్కరణవాదుల వాదన .
ఉరిశిక్ష ఉండాలా అక్కరలేదా అనే రోజులు పోయాయి . కాలం మారింది . కల్కి కాలం వచ్చింది . చట్టవిరుధ్ధంగా , న్యాయ విచారణే లేకుండా ఎన్కౌంటర్ చేసినా తప్పేంటి ? బుల్డోజర్లతో ఇళ్ళను ఆస్తులను ధ్వంసం చేస్తే తప్పేంటి రోజులకు వచ్చేసాం . Instant Justice or Instant Injustice ?! భారతదేశంలో ఇప్పుడు ఈ చర్చే ఎక్కువ జరుగుతుంది సుప్రీంకోర్టులో సహా .
నటనాపరంగా చిరంజీవిని ఇక్కడ మెచ్చుకోవాలి . CKP అంటే చెట్టు కింద ప్లీడరుగా , కోటు టై అద్దెకు తెచ్చుకునే బీద లాయరుగా , తాను నమ్మిన ఉరిశిక్ష రద్దు సిధ్ధాంతాన్ని లోకానికి విశదీకరించాలనే తపన కల వ్యక్తిగా , ప్రేమికుడిగా , క్లైమాక్సు కోర్ట్ సీన్లో తన ఆవేదనా పూరితమైన వాదనలను వినిపించే యంగ్ లాయరుగా బాగా నటించాడు .
రాధిక పెద్ద అందగత్తె ఏమీ కాదు . ఫక్తు తమిళ , ద్రవిడ అమ్మాయి . అయినా తన హుషారయిన నటనతో హీరోయినుగా రాణించింది . ముఖ్యంగా చిరంజీవి పక్కన మరింత చలాకీగా , ఇష్టంగా నటిస్తుందేమో అని అనిపిస్తుంది . ఆ కెమిస్ట్రీ ఈ సినిమాలో కూడా కనిపిస్తుంది . సాఫ్ట్ & కన్నింగ్ మంచి విలనాసురుడిగా రావు గోపాలరావు కరెక్టుగా సెట్ అయ్యాడు . బాగా నటించాడు .
ప్రేక్షకులు మరచిపోలేని పాత్ర రాళ్ళపల్లి నటించిన విష్ణుశర్మ పాత్ర . నవలలో కూడా చాలామందికి నచ్చిన పాత్ర . చిరంజీవిని ఉరి నుండి రక్షించాలని పడే తపనను బాగా చూపాడు . మరో మరచిపోలేని పాత్ర ఓబులేసు . బామ్మరిది అనే ఊతపదంతో , ఇరిటేటింగ్ ఏక్షనుతో గొల్లపూడి మారుతీరావు బాగా నటించాడు . ఇతర ప్రధాన పాత్రల్లో భీమరాజు , సి యస్ రావు , రాజ్యలక్ష్మి , మాడా , ప్రభృతులు నటించారు .
వేటూరి వ్రాసిన సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది , బంతీ చామంతి , నవ్వింది మల్లె చెండు పాటలు ఇరగతీసాయి . ఆత్రేయ వ్రాసిన యురేకా , వేళాపాళ లేదు కుర్రాళ్ళాటకి , ఉరకలై గోదారి పాటలు ఈరోజుకీ పాపులరే . ఈ పాటల్లో చిరంజీవి- రాధిక డాన్స్ స్టెప్పులకు థియేటర్లలో కర్రాభిమానులూ స్టెప్పులు వేసారు .
కోదండరామిరెడ్డి పాటల చిత్రీకరణలో రాఘవేంద్రరావు స్టైల్ కనిపిస్తుంది . చాలా అందంగా చిత్రీకరించారు .
సత్యానంద్ , యండమూరి సంయుక్తంగా సంభాషణలను రొమాంటిగ్గా , పదునుగా వ్రాసారు . తెలుగులో సక్సెస్ అయిన ఈ సినిమా తమిళంలోకి Sattathai Thiruthungal టైటిలుతో రీమేక్ చేయబడింది .
మోహన్ , నళిని నటించారు . యండమూరి సీరియల్ రాకముందే ఇంగ్లీషులో ఈ కధాంశంతో The Man who dared (1946) , Beyond a reasonable doubt (1956) సినిమాలు వచ్చాయి .
సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడండి . చిరంజీవి అభిమానులు అయితే మరోసారి చూడొచ్చు . Undoubtedly a watchable romantic , feel good , suspense , musical and entertaining movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
అప్పటికే హీరోగా పాపులర్ అయ్యడు కదా, సీరియస్ నవలాంశాన్ని సినిమాకరించే క్రమంలో ఫైట్లు, స్టెప్పులు అద్దారు… అవి లేకపోతే జనం చూడరు అన్నట్టు… తెలుగు సినిమా అన్నాక అవి లేకపోతే ఎలా అన్నట్టు…
కాకపోతే ఇళయరాజాను మెచ్చుకోవచ్చు… ఉరకలై గోదావరి అనే మెలొడీతోపాటు ఉర్రూతలూగించే యురేకా తకమిక పాటనూ ఇచ్చాడు… బంతీ చామంతి, సందె పొద్దుల కాడ పాటలు అప్పట్లో సూపర్ హిట్… అప్పటికే ముసలివాళ్లయిన ఇతర అగ్రహీరోలతో పోలిస్తే చిరంజీవి చిందులు, స్టెప్పులు, హుషారు యువతను చిరంజీవి వైపు మళ్లేలా చేశాయి……… ముచ్చట
Share this Article