Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒకరిద్దరు సరిపోవడం లేదు… ఏకంగా కథలోకి ముగ్గురి ఎంట్రీ…

June 16, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …….. ఇది 1+3 సినిమా … సీతామాలక్ష్మి , త్రిశూలం , గోరింటాకు వంటి జనరంజక సినిమాలను తీసిన యువచిత్ర బేనరుపై మురారి , నాయుడు నిర్మించిన చిత్రం 1984 సెప్టెంబరులో రిలీజయిన ఈ అభిమన్యుడు సినిమా …

కధను కొమ్మనాపల్లి గణపతిరావు వ్రాయగా దాసరి నారాయణరావు మురారితో కలిసి స్క్రీన్ ప్లేని తయారు చేసుకున్నారు . సంభాషణల రచనను , దర్శకత్వాన్ని దాసరి నిర్వహించారు . సినిమాలో దాసరి మార్క్ పెద్దగా కనిపించదు , అనిపించదు …

Ads

Child is father of the man , said Wordsworth . చిన్నప్పడు జరిగే సంఘటనలు చాలామంది జీవితాలను ప్రభావితం చేస్తాయి . అవే మనిషిని తయారుచేస్తాయి . ఎన్ని కష్టాలు ఎదురయినా సత్య హరిశ్చంద్రుడు వలె సత్యాన్నే పలకాలి అని ఊరందరికీ ప్రవచించడమే కాకుండా తాను తూచా తప్పకుండా పాటిస్తాడు హీరో తండ్రి అర్చకుని పాత్రలో జె వి సోమయాజులు .

కానీ , ఆ సత్యవ్రతం వలనే ఊళ్ళో కామందు ఆ అర్చకునిని నేరస్తుడిని చేసి జైలు శిక్ష పడేలా చేస్తాడు . ఆ షాకుకు , అవమానానికి గురయిన అర్చకుడు కోర్టు బోనులోనే ప్రాణాలను విడుస్తాడు . ఈ ఘటనతో నిజం చెప్పనేకూడదు , అబధ్ధాలను చెప్పటం తప్పేమీ కాదని అభిమన్యుడు అబధ్ధాల పుట్ట , అసత్యవీరుడు అయిపోతాడు . అతని కధే ఈ సినిమా .

ప్రాణ మాన విత్త భంగములందు బొంకవచ్చు అని అంటారు కొందరు . అయితే ఆ అబధ్ధాలను చెప్పటమే వృత్తిగా బిజినెస్ మేన్ సినిమాలో హీరోలాగా ఈ అభిమన్యుడు ఓ ఆఫీసే పెట్టుకుంటాడు . Professional lier .
నాన్నా పులి కధ మనందరికీ చిన్నప్పుడే పుస్తకాలలో ఉండేది . మరిప్పుడు ఉంటుందో లేదో !!

అలా అబధ్ధాలను చెప్పడమే బతుకు అయిపోయిన అభిమన్యుడు ఆ అబధ్ధాల వలయంలో చిక్కుకునిపోయి కష్టాలపాలయి క్లైమాక్సులో తన మాజీ ప్రియురాలి భర్తను రక్షిస్తానికి జైలు పాలవుతాడు . ఇదీ ఈ అభిమన్యుడి స్టోరీ . ఈ టైటిల్ సూటిగా సూట్ కాదు . జీవితమనే కురుక్షేత్రంలో ఎక్కువ మంది అభిమన్యులే . బహుశా అందుకని ఆ టైటిల్ని పెట్టుకుని ఉండవచ్చు . వచ్చు .

అభిమన్యుడిగా శోభన్ బాబు నటించాడు . వేర్వేరు కోర్టుల్లో వేర్వేరు వేషాల్లో , అవతారాల్లో దొంగ సాక్ష్యాలు చెపుతూ జీవించే పాత్రలో , ముగ్గురు పడతుల మనసుని దోచుకునే హీరోగా , ముగ్గురితో యుగళ గీతాలను పాడుకునే కధానాయకుడుగా అందంగా కనిపిస్తాడు . సినిమాలో హీరోయిన్లుగా రాధిక , విజయశాంతి ; కధను నడిపించే అసంతృప్త భార్యగా సిల్క్ స్మిత పోటాపోటీగా నటించారు .

అయితే ప్రేక్షకుడు సిల్క్ స్మిత పాత్రనే గుర్తుంచుకుంటాడు . స్మిత , విజయశాంతి అక్కాచెల్లెళ్ళుగా నటించారు . చిన్నప్పుడు చిన్నపిల్లలను దొంగిలించి ట్రాఫికింగ్ చేసే వారి చేతిలో పడి విడిపోతారు . అక్క స్మితను రక్షించిన పోలీస్ ఆఫీసర్ సి యస్ రావు ఆ పిల్లనే బలవంతంగా పెళ్ళి చేసుకుంటాడు . ఇద్దరి పాత్రలు అయ్యో పాపం అని ప్రేక్షకుల సానుభూతిని పొందుతాయి . సిల్క్ స్మిత పాత్ర ఫుల్ లెంగ్త్ పాత్ర . మంచి పాత్ర .

ఇతర ప్రధాన పాత్రల్లో అన్నపూర్ణ , మురళీమోహన్ , సి యస్ రావు , అల్లు రామలింగయ్య , నూతన నటుడు రాజేంద్ర (తర్వాత ఎప్పుడూ కనిపించినట్లు లేదు) , కల్పనారాయ్ , త్యాగరాజు , మిక్కిలినేని , కాకరాల , పి జె శర్మ , ప్రభృతులు నటించారు . కల్పనారాయికి కూడా చాలాసేపు ఉండే పాత్ర లభించింది ఈ సినిమాలో .

అన్ని పాటల్నీ ఆత్రేయే వ్రాసారు . కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద ఈ సినిమాకు ఐకానిక్ సాంగ్ అయిపోయింది . సినిమాలో రెండు మూడు సార్లు వస్తుంది . సిల్క్ స్మితతో శోభన్ బాబు రెండు డ్యూయెట్లూ హుషారుగా ఉంటాయి . శృంగార సీమంతిని , తడిసిన కోరిక తాళం తడుతుంటే ముసిరే వయసుకు మువ్వలు కడుతుంటే అంటూ సాగే రెండు పాటలూ చాలా బాగా చిత్రీకరించబడ్డాయి .

ఒకే గొడుగు ఒకే అడుగు ఒకే నడకగా ఒకే ఒకరుగా అంటూ సాగే వాన- గొడుగు పాట శోభన్ బాబు , విజయశాంతి మీద ఉంటుంది . సూర్యుడు చూస్తున్నాడు చంద్రుడు వింటున్నాడు డ్యూయెట్ శోభన్ బాబు , రాధిక మీద ఉంటుంది . రెండు డ్యూయెట్లూ బాగుంటాయి .

సినిమా , పాటల వీడియోలూ యూట్యూబులో ఉన్నాయి . ఇంతకుముందు చూడని శోభన్ బాబు , సిల్క్ స్మిత అభిమానులు చూడవచ్చు . ఈ సినిమా వీరిద్దరిదే . It’s a romantic entertainer with a mixed ending . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రానున్న 48 గంటలు అత్యంత కీలకం – మధ్యప్రాచ్యం మండిపోతోంది
  • టాక్సిస్ పారడాక్స్..! ఓ అశ్లీల వ్యతిరేకి దాన్నే ఆశ్రయించడం..!!
  • యాదాద్రి, భద్రాద్రి… తెలంగాణ నెత్తిన రెండు తెల్ల ఏనుగులు…
  • సుహాసిని సరే… యాంగ్రీ రాజశేఖర్ శాకాహార సినిమాలూ చేయగలడు…
  • మర్యాద రేవంతన్న..! గౌరవనీయ కేసీయార్..! ప్రొటోకాల్ పాలిటిక్స్..!!
  • ది రాజా సాబ్..! ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్‌కూ మారుతి బలమైన దెబ్బ..!!
  • స్టార్ హీరో ఇమేజ్, డాన్సులు, ఫైట్లు, ఎలివేషన్లు ఉండగానే సరిపోదు..!!
  • కాంగ్రెస్‌తోపాటు బీజేపీ కూడా..! తెలంగాణకు కేసీయార్ జలద్రోహం- నిజాలు..!!
  • ‘ట్రంపరితనం’… ప్రపంచానికే వినాశకరం… ఏదో ముంచుకొస్తోంది…
  • వ్యాపిస్తున్న దుర్గంధం… తిట్ల పర్వంలో జాతీయ నేతలనూ వదలడం లేదు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions