అబూజ్ మడ్ లో భారీ ఎన్ కౌంటర్.. 29 మంది మావోయిస్టుల మృతి.. ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తూ మీడియా అంతటా కనిపిస్తున్న వార్త ఇది. దట్టమైన ఈ అటవీ క్షేత్రం ఇప్పుడు నిత్య సమర క్షేత్రం… కురుక్షేత్రం… కాల్పులు, పేలుళ్లు కొత్త కాదు… కానీ ఈసారి నక్సలైట్ల వైపు జరిగిన నష్టం అపారం…
కేవలం నెల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో 54 మంది చనిపోతే… మూణ్నెల్ల కాలంలో 80 మంది చనిపోవడమంటే.. కచ్చితంగా ఈ అబూజ్ మడ్ పైనే సర్కార్ సీరియస్ గా దృష్టి సారించినట్టు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే.. ఇంకెక్కడా నక్సలైట్స్ కు ఇంత రహస్యమైన స్థావరం లభించడం లేదు. ఇంకెక్కడా వారి ఉనికి కూడా ఈ స్థాయిలో కనిపించడం లేదు కాబట్టే.. సర్కార్ ఈ ఫోకల్ పాయింట్ పై ఫోకస్ చేసింది.
అసలేంటీ ఈ బస్తర్ కథ… అబూజ్ మడ్ అటవీ రహస్యం..?
Ads
బాహ్య ప్రపంచానికి ఆవల.. ఎక్కడో విసిరివేయబడ్డట్టుంటుంది. అంతేకాదు.. కాకులు కూడా దూరని కారడవి.. చీమలు దూరని చిట్టడవి.. మొత్తంగా పర్వత ప్రాంతం… దట్టమైన చెట్లతో అడుగు తీసి అడుగేయడమే కష్టం.. కొత్తవారైతే తాము వెళ్లిన దారేదో.. తిరిగి రావాలంటే కూడా కష్టం. మొత్తంగా 15 వందల చదరపు మైల్స్… అంటే 4 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది అబూజ్ మడ్ అటవీప్రాంతం. గతంలో ఈ విస్తీర్ణం దాదాపు రెట్టింపుకంటే ఎక్కువుండేదనీ నివేదికలు చెప్పే మాట. అయితే, ఈ అటవీ ప్రాంతంలోకి వెళ్లడం అంత సులభమైంది కాదని.. ఒక దశలో అసాధ్యంగా కూడా కనిపిస్తుందని భద్రతాదళాల డీజీ స్థాయి అధికారులే చెబుతున్న మాటలు.
చత్తీస్ గడ్ రాష్ట్రంలో ఉన్న ఈ అటవీ ప్రాంతం… నారాయణపూర్, బీజాపూర్, దంతేవాడ జిల్లాలతో పాటు.. ఇటు తెలంగాణా రాష్ట్రంలోని జయశంకర్ భూపాల జిల్లా.. అటు మహారాష్ట్రలోని గడ్చిరోలితో పాటు.. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా బార్డర్స్ లో విస్తరించి ఉండటంతో.. ఇది ఇప్పుడు నక్సల్స్ కు ఒక ప్రధాన ఆవాసంగా మారింది. కాదు కాదు… తమను తాము కాపాడుకునే గూడైంది. అందుకే జనబాహుళ్యం నుంచి దూరంగా విసిరేయబడ్డ ఓ ఒంటరి క్షేత్రంగా అబూజ్ మడ్ ఆపరేషన్ అంటే మామూలు విషయమేం కాదు.
భౌగోళికంగా చూస్తే.. అబూడ్ మడ్ కీకారణ్యంలోకి వెళ్లాలంటే… నారాయణపూర్, బీజాపూర్, బస్రూర్ వంటి అటవీ ప్రాంతాల నుంచి ప్రయాణం తప్పనిసరి. బస్తర్ రీజియన్ లో ఉన్న ఇంద్రావతీ నది… ఈ ప్రాంత అస్తిత్వాన్ని ఒంటరి చేసే విధంగా చుట్టూ పారుతుండటం కూడా.. నక్సల్స్ ఈ అబూజ్ మడ్ ను సేఫెస్ట్ ప్లేస్ గా ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం.
బ్రిటీష్ రూల్ నడుస్తున్న కాలం 1873 నుంచే ల్యాండ్ సర్వేలు చేస్తే.. అబూజ్ మడ్ ను అంచనా వేయడం కష్టతరమైంది. అందుకే ఈ ప్రాంతాన్ని అలాగే ఐసోలేట్ గా వదిలిపెట్టడంతో… బాహ్య ప్రపంచంతో సంబంధాల్లేని ప్రాంతంగా ఈ అడవి కొనసాగుతోంది. భారతదేశానికి స్వతంత్ర్యం వచ్చాక కూడా ఇంకా అబూజ్ మడ్ అలాంటి ఒంటరి అటవీ క్షేత్రంగా కొనసాగుతుండటం వల్లే నక్సల్స్ ఈ ప్రాంతాన్ని తమ సురక్షిత ప్రాంతంగా ఎంచుకున్నారు.
1910లో జరిగిన భూంకాల్ పోరాటం..
ప్రపంచ ఆదీవాసీ పోరాటల్లో ఒక్కటిగా గుర్తింపు పొందింది. బస్తర్ ప్రాంతంలోని అడవులను రిజర్వ్ ఫారెస్ట్ గా చేసేందుకు నాటి బ్రిటీష్ పాలకులు చేసిన ఆలోచలు సహించని ఇక్కడి ఆదీవాసీలు.. పెద్దఎత్తున పోరాటం చేశారు. గుండాధర్ అనే ఓ ఆదీవాసీ నాయకుడి నేతృత్వంలో జరిగిన ఈ పోరాటంలో… నాటి సర్కార్ 250 పోలీస్ బృందాలను ఆదీవాసీలపైకి ఉసిగొల్పింది. అయితే, తమ అటవీ వనరులను కాపాడుకోవడానికి, తమ అస్తిత్వ పోరాటంలో భాగంగా నాడు చేసిన భూంకాల్ ఉద్యమం చరిత్రలో నిల్చిపోయింది. అదే పద్ధతులు.. రిజర్వ్ ఫారెస్ట్ కల్చర్ ను ఆ తర్వాత స్వాతంత్ర్యమనంతరం ఇండియన్ గవర్నమెంట్ కూడా కొనసాగించడంతో.. తెలియకుండానే ఈ ప్రాంత ఆదీవాసీల్లో రాజ్యంపై కొంత తిరుగుబాటు విధానాలకు తెరలేపింది. పైగా సాయుధులైన ఉన్నవాళ్లే తమ రాజులని భావించిన ఇక్కడి ఆదివాసీలు.. అలా చేతుల్లో తుపాకులు, జబ్బలకు తూటాబ్యాగుల వంటివి వేసుకొచ్చిన మావోయిస్టులతో కలిసిపోయారు.
రాముడి కాలం నుంచీ…
వాస్తవానికి రామాయణ కాలం నుంచే ఈ బస్తర్ ప్రాంతం ఉనికిలో ఉందంటారు. రామాయణంలో పేర్కొన్న పది ప్రధానమైన అటవీ ప్రాంతాల్లో.. మన దక్కన్ పీఠభూమిలో విస్తరించి ఉన్న బస్తర్ దండకారణ్యంలో అడుగుపెట్టడమంటే మాటలు కాదు. ఆకును ముట్టుకున్నా.. ఈటెను ముట్టుకున్నా ఏది విషమో తెలియని భయంకరమైన అడవి. ఇలాంటి ప్రాంతంలో నాడు శ్రీరామచంద్రుణ్ని తీసుకెళ్లడంపై.. విశ్వామిత్రుడికి కూడా నిందలు తప్పలేదట. కానీ, శ్రీరాముడంతటి ఆజానుబాహుడే ఈ ప్రాంతంలో అడుగు పెట్టకపోతే.. రాబోయే రోజుల్లో నరమానవుడు కూడా ఇక్కడికి వచ్చే వీలుండదని వాదించి మరీ విశ్వామిత్రుడు ఈ ప్రాంతంలో రాముడి సంచరించడానికి కారణమయ్యాడంటారు.
ఈ ప్రాంతంలో నివశించే గిరిజన తెగ అత్యంత వెనుకబడటం కూడా.. నక్సల్స్ కు అనుకూలంగా మారింది. పైగా రాజ్యంపైన.. అప్పటివరకూ కొనసాగిన భూస్వామ్య వ్యవస్థపైన ఇక్కడి గిరిజనంలో కనిపించే తిరుగుబాటు వైఖరిని కూడా నక్సల్స్ తమ సురక్షిత ప్రాంత ఎంపికలో ఉపయోగించుకున్నారు. ఏవో కొన్ని మిషనరీస్, స్వచ్ఛంద సంస్థలు ఈ ప్రాంత వెనుకబాటుపై స్పందించి నిర్వహించే చిన్నాచితకా స్కూల్స్ మినహా.. ఇప్పటికీ ఇక్కడ విద్య అందని ద్రాక్షే.
అందుకే కేంద్రం సీరియస్
అబూజ్ మడ్ నక్సల్స్ కు.. రాజ్యంపై తిరుగుబాటు చేసేవారి కంచుకోట.. కేరాఫ్ అడ్రస్. ఎప్పుడో ఎన్నికల వేల అపసోపాలు పడీ అధికారగణం పోలింగ్ బాక్సులు పట్టుకుని వెళ్లడం తప్ప.. ఇంకెప్పుడూ ఇక్కడ నరమానవుడూ కనిపించడు. అందుకే, ఈ ప్రాంతాన్ని తమ డెన్ గా ఎంచుకున్న మావోయిస్టులు… ఏకంగా ఓ సమాంతర ప్రభుత్వాన్నే నడిపిస్తున్నారు.
అందుకే కేంద్ర సర్కార్ ఇక్కడ ఫోకస్ చేసింది. తరచూ కూంబింగ్ నిర్వహిస్తూ.. ఈ డెన్ ను కనుక నిర్వీర్యం చేస్తే… ఇక మావోయిస్టులు, ఇతర తిరుగుబాటు దళాల ఉనికే లేకుండా చేయొచ్చనే ఉద్ధేశ్యంతో జరుపుతున్న ఎన్ కౌంటర్స్ లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగులుతోంది. కాకులు దూరని కారడవి కాబట్టే.. మావోయిస్టుల డెన్ గా మారిందన్న ఉద్దేశ్యంతో.. సరిహద్దు భద్రతా దళాలతో పాటు.. జిల్లా రిజర్వ్ గార్డ్ దళాలతో కలిసి ఈ ఆపరేషన్స్ చేస్తున్నాయి. సుశిక్షితులైన దళాలను రంగంలోకి దింపి మొత్తంగా అబూజ్ మడ్ అటవీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటే.. నక్సల్స్ ఏరివేత సులభమవుతుందనేదే సర్కార్ యోచనలా కనిపిస్తోంది.
మరిలాంటి సురక్షితమైన డెన్ దొరకాలంటే కూడా ప్రస్తుతం భారత్ వంటి దేశంలో ఇంకెక్కడా కనిపించని పరిస్థితి ఓవైపుంటే.. మరోవైపు అబూడ్ మడ్ గనుక సర్కార్ హస్తగతమై.. మావోయిస్టుల చేజారితే… ఇక ఉనికికే ప్రమాదమన్నది మాత్రం కచ్చితం…. (Article By… రమణ కొంటికర్ల )
Share this Article