Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాబును ఏమీ అనలేడు- పవన్‌ తప్పనలేడు- జగన్‌ను అనకుండా ఉండలేడు…

June 7, 2026 by M S R

.

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎంత పాతవిషయాల్ని తన కొత్త పలుకులో రాసుకొచ్చినా సరే… ప్రపంచంలోని ఏ విషయాన్నయినా సరే తీసుకొచ్చి జగన్ మెడకు చుట్టే ప్రయత్నం చేస్తుంటాడు… అఫ్‌కోర్స్, సాక్షిలో వర్దెల్లి మురళి కూడా ప్రతి దాన్నీ చంద్రబాబు దగ్గరకు తీసుకొస్తుంటాడు… సరే, ఇద్దరివీ రాజకీయ ప్రేరిత వ్యాసాలే కదా… నిష్పాక్షికతను ఆశించలేం, చూడలేం, ఉండవు కూడా…

ఈరోజు రాధాకృష్ణ ఇటీవల నాగేశ్వర్- పవన్ కల్యాణ్ వివాదంలోకి జగన్‌ను తీసుకొచ్చాడు… నిజానికి పవన్ కల్యాణ్‌, చంద్రబాబు తెలంగాణ వనరుల్ని దోచుకోలేదనీ, అలా దోచుకున్న వైఎస్‌ను, జగన్‌ను మాత్రం తెలంగాణవాదులు ఏమీ అనడం లేదని బాధపడిపోయాడు పాపం…

Ads

ఇక్కడ తనకు ఓ క్లారిటీ కావాలి, ఉంది, ఈ వ్యాసంలోనూ అది కనిపించింది, కానీ మళ్లీ ఏదోరకంగా జగన్ మీద వ్యతిరేకతను, తన కూటమే కాబట్టి చంద్రబాబును, పవన్ కల్యాణ్‌ను ఏమీ అనడు… పవన్ కల్యాణ్ భాష ‘ఎవడబ్బ జాగీరు’ ప్రస్తావన ఏది వ్యాసంలో..? తెలంగాణవాదం ఆది నుంచీ ఆంధ్రుల దోపిడీ మీద మాత్రమే కాదు… స్వరాష్ట్ర సాధన, స్వపరిపాలన కోసం…

ఎవరు హైదరాబాదు, తెలంగాణల్లో బతికినా తెలంగాణ భూమిపుత్రులకు వ్యతిరేకత లేదు, ఆహ్వానిస్తారు, అక్కున చేర్చుకుంటారు… ఎటొచ్చీ ఒక చంద్రబాబు, ఒక పవన్ కల్యాణ్ రాష్ట్రం విడిపోయి పుష్కరమైనా ఇంకా ఇక్కడ రాజకీయాలు చేయాలి, పోటీచేయాలి, గెలవాలి, మళ్లీ తెలంగాణ మీద పెత్తనం రావాలని కోరుకోవడంతోనే వస్తోంది సమస్య…

రాధాకృష్ణకు అది తెలుసు… అందుకే తెలంగాణ రాజకీయాలకు దూరంగా ఉండండి అని హితవు పలికాడు… కానీ ఇటీవల వివాదంలో తప్పు ఎక్కడ జరిగిందో మాత్రం విశ్లేషించలేకపోయాడు… ఎందుకంటే, ఇందులో క్రెడిబులిటీ కోల్పోయి, తీవ్ర విమర్శల పాలైన నాగేశ్వర్‌ది ఎంత తప్పుందో పవన్ కల్యాణ్‌ది అంతకన్నా ఎక్కువ తప్పుంది…

ఆయనేదో రాశాడు, ఏపీలో కేసులు పడ్డయ్, నాగేశ్వర్‌కు అనుకూలంగా తెలంగాణవాదులు కొందరు నిలబడ్డారు… దాంతో పవన్ కల్యాణ్‌కు కోపమొచ్చింది… సరిగ్గా రాష్ట్ర అవతరణ దినంరోజే మీటింగు తలపెట్టాడు, తప్పు… ప్రభుత్వం, పోలీసులు, చివరకు కోర్టు కూడా వద్దంది… కానీ ఎలాగోలా గోకాలని ప్రెస్ మీట్ పెట్టాడు…

ఎవడబ్బ జాగీరు, వస్తా, ఎన్నికల్లో పోటీచేస్తా, తిరుగుతా అని ఏదేదో మాట్లాడాడు… అక్కడొచ్చింది సమస్య… మళ్లీ ఈ ఆంధ్రుడి రాజకీయం, పెత్తనం ఏమిటనే ఏవగింపు, వ్యతిరేకత తెలంగాణలో ప్రబలింది… పైగా పవన్ కల్యాణ్ గతంలో కూడా పోటీచేశాడు, భంగపడ్డాడు, ఐనా ఏదో సాధిస్తాడట, ఉద్దరిస్తాడట… అందుకే ఈ వ్యతిరేకత…

ఇవేమీ రాధాకృష్ణ రాయడు, రాయలేదు… కారణం, చంద్రబాబు- పవన్ కల్యాణ్ కూటమి కాబట్టి..! పైగా ఈ వివాదంతో సంబంధం లేని ‘ప్రత్యక్ష’ సంబంధం లేని జగన్‌ను ఇందులోకి లాక్కొచ్చాడు… ఎవరెవరో ఏవేవో వ్యాఖ్యానిస్తున్నట్టు పవన్ కల్యాణ్ కూతల వెనుక వ్యూహాల్లేవు, ఎవరూ లేరు… అది తన మూర్ఖ వ్యవహారమే… అది తనకూ తెలిసొచ్చింది తరువాత…

తెలంగాణ సెంటిమెంట్ మళ్లీ పెరిగితే బీఆర్‌ఎస్‌కు లాభం అంటాడు రాధాకృష్ణ… ఆరోజులు పోయాయి మాస్టారూ… తెలంగాణ జోలికొస్తే తెలంగాణ తిరగబడుతుంది, రాజకీయాలు- ఎన్నికలు వచ్చేసరికి పార్టీల నడుమ పోరు సమీకరణాలు వేరుగానే ఉంటాయి… బీజేపీ- బీఆర్ఎస్- కాంగ్రెస్… ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్లస్‌లో ఉంది, బీఆర్ఎస్ ఇంకా పాత పరాభవాల నుంచి తేరుకోలేకపోతోంది… బీజేపీ అంతర్గత కుమ్ములాటలతో ఎదగలేకపోతోంది…

సో, రేవంత్ రెడ్డి అంటే పడని కాంగ్రెస్ అంతర్గత అసంతృప్తివాదులు, వ్యతిరేకులు కావాలనే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించి, మరింత గోకారనే రాధాకృష్ణ విశ్లేషణ అంతగా కన్విన్సింగుగా లేదు, ఐతే అది కాంగ్రెస్… అంతర్గత కుమ్ములాటలు సహజం… ఐనా బీఆర్ఎస్‌కు తెలంగాణ సెంటిమెంట్ నిజంగా కలిసొచ్చే పక్షంలో అది పొన్నం ప్రభాకర్‌కు కూడా నష్టమే కదా, ఆమాత్రం తెలియదా తనకు..? తెలుసనే విషయం రాధాకృష్ణకు తెలియదా..?!

ఎవడబ్బ జాగీరు వ్యాఖ్యలపై తెలంగాణ భగ్గుమనేసరికి… పవన్ కల్యాణ్‌కు తత్వం బోధపడి, ప్చ్, మా ఏపీలో కులకొట్లాటలు తప్ప ఈ చైతన్యం, ఈ సంఘీభావం, ఈ ఉద్వేగాలు లేవు అని బాధపడ్డాడు… ఐనా తనలోని అసలు పవన్ కల్యాణ్ ఊరుకోడు కదా… తెలంగాణ భూమిపుత్రుల్నే పోటీలో పెడతాను అని మరో వెటకారం… ఆంధ్రా పెత్తందారు చంకలో చేరిన భూమిపుత్రులను కూడా తెలంగాణ సమాజం సహించదు. అదొక్కటీ పవన్ కల్యాణ్‌కు అర్థం కావాల్సిన అసలు తత్వం…

కాళోజీ అంటాడు… “దోపిడి చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతం, ప్రాంతం వాడే దోపిడి చేస్తే ప్రాణం తోనే పాతర వేస్తం”

అందుకే రాధాకృష్ణ వ్యాసం తన రాజకీయ అనుకూల వాసనలకు లోబడి, జగన్ వ్యతిరేక భావనలకు లోబడి, ఏమాత్రం లోతు లేకుండా… పెరిఫెరల్‌గా… ఆత్మ లేకుండా తోకపటాకులాగా తుస్సుమంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బాబును ఏమీ అనలేడు- పవన్‌ తప్పనలేడు- జగన్‌ను అనకుండా ఉండలేడు…
  • సీజేపీ ధర్నా… బొద్దింకల పేరిట ‘యాంటీ మోడీ’ సెక్షన్ హంగామా…
  • … అలా నెమ్మ‌దిగా ఇళ‌య‌రాజా అనేవాడి మీద కాస్త ఇంట్ర‌స్టు మొద‌లైంది’
  • నిర్మాతలు, హీరోలు దర్శకుల్ని పేద్ద కాక్రోచ్‌లను చేస్తే… ‘పెద్ది’లు పుడతారు…
  • రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌పై కాక్రోచ్ మీడియా తప్పుడు వాదనలు ఇలా..!!
  • అసలు తప్పు జాన్వీదే..! ఇదే ధోరణి ఉంటే కెరీర్‌ ప్రశ్నార్థకమే..!!
  • ఏ మొహమాటాల్లేవ్… కొత్త T20 జట్టు ఎంపికపై డిఫరెంట్ రివ్యూ…
  • వాళ్లు బాల్యాన్ని అనుభవించనివ్వండర్రా… రొంపిలోకి అప్పుడే ఎందుకు..?!
  • ‘ పెద్ది సినిమా చూడకపోతే చంపుతా ఒక్కొక్కడినీ’… ఓ మానసిక వైకల్యం..!!
  • I Love Hyderabad … ఇది ప్రేమించదగిన నగరం కాబట్టి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions