బంగ్లాదేశ్‌లో పరిస్థితులు విషమించి… మూకలు బజారుకెక్కి, విధ్వంసాలకు దిగాక… అన్నీ అదుపు తప్పాయి… చివరకు సుప్రీంకోర్టు మీదా పోరాటానికి సై అనేసరికి ఆ చీఫ్ జస్టిస్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది… మా వ్యతిరేకులకు ఆశ్రయం ఇస్తే బహుపరాక్ అని ఇండియానూ బెదిరిస్తున్నది అక్కడ ప్రస్తుతం పైచేయి సాధించిన ఓ రాజకీయ పార్టీ…
అంతే, ఒకసారి అరాచకం ప్రబలితే ఇక అది ఎటు దారితీస్తుందో ఎవరూ చెప్పలేరు… ఐతే ఆ వార్తలు చదువుతుంటే, హఠాత్తుగా ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ రాసుకున్న కొత్తపలుకులోని కొన్ని వాక్యాలు ఆశ్చర్యకరంగా అనిపించాయి… ‘‘బంగ్లాదేశ్ వంటి పరిణామాలు మన దేశంలో జరగకపోవచ్చును గానీ, నిజాయితీపరులు, ప్రజాస్వామ్య ప్రియులు, కష్టపడి సంపాదించి పన్నులు కడుతున్న వారిలో అసంతృప్తి గూడుకట్టుకుంటోంది. అది ఎప్పుడైనా, ఏ రూపంలోనైనా పెల్లుబకవచ్చు…… ప్రభుత్వాలు మాత్రమే కాదు– వ్యవస్థలు కూడా ప్రజల్లో తమపై నమ్మకం పోకుండా వ్యవహరించాలి… లేనిపక్షంలో ఏదో ఒకరోజు ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది…’’ ఆ వాక్యాలు ఇవే…
నేరుగా ఆయన ఏమీ చెప్పకపోవచ్చుగాక… కానీ జగన్ మీద విచారణలు వేగంగా పూర్తి చేయాలి, తను ఇంకా బెయిల్ మీద బయటే ఉన్నాడు, అవినీతి కేసులు మోస్తున్న వ్యక్తి నీతినిజాయితీల మీద నీతులు చెబుతున్నాడు, వాటీజ్ దిస్ యువరానర్ అని ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది…
Ads
‘‘తనపై దాఖలైన కేసులలో విచారణ కూడా జరగకుండా జగన్ తప్పించుకోగలుగుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిన మాట నిజం కాదా? మధ్యలో దర్యాప్తు సంస్థలకు, న్యాయస్థానాలకు పాత్ర లేదా? ఈ రెండు వ్యవస్థల ప్రత్యక్ష, పరోక్ష సహకారం లేని పక్షంలో ఇది సాధ్యమా? డిశ్చార్జి పిటిషన్లను సాకుగా చూపడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది… ఆ విషయం కింది కోర్టులకు తెలియదా? సుప్రీంకోర్టు మాదిరిగా కింది కోర్టులు కూడా ఆలోచించి ఉంటే జగన్ కేసులలో ఈ పాటికి విచారణ కూడా పూర్తయ్యేది కదా? ’’ అని రాసుకొచ్చాడు ఆయన…
వరుసగా డిశ్చార్జి పిటిషన్లు, న్యాయమూర్తుల బదిలీలు వంటివి జగన్ మీద విచారణ జరగకుండా చేస్తున్నాయనేది తన అసంతృప్తి… అర్జెంటుగా జగన్‌కు శిక్ష పడితే బాగుండు అన్నట్టుగా… ఇంతకాలం వెనకేసుకొచ్చారు కాబట్టే మోడీ ప్రభుత్వం కూడా క్రెడిబులిటీ కోల్పోయి, ఈసారి తమకు అవసరమైనంత మెజారిటీ రాకుండా శిక్షకు గురైందంటాడు పరోక్షంగా…!
సరే, అదెలా ఉన్నా… అర్జెంటుగా సాక్షి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే సుమా అని చంద్రబాబుకు చెబుతున్నాడు… రాష్ట్రంలో శాంతిభద్రతల్లేవు, పెట్టుబడులకు భద్రత లేదు, తెలంగాణ వైపు చూడండీ అని జగన్, తన రోతపత్రిక (సాక్షి) ఎంతగా దుష్ప్రచారం చేస్తున్నా చంద్రబాబు చర్యలు తీసుకోవడం లేదని రాధాకృష్ణ అసంతృప్తి… కొద్దిరోజులుగా సాక్షి రాస్తున్నట్టు గనుక గతంలో ఇతర పత్రికలు ప్రచురించి ఉంటే కేసులు పెట్టేవాళ్లు అంటాడు తను, అంటే సాక్షిని ఎందుకు ఇంకా ఉపేక్షిస్తున్నావు అని చంద్రబాబును అడుగుతున్నాడు…
గతంలో జగన్ అధికారంలోకి రాగానే రెండేళ్లపాటు టీడీపీ కేడర్ బయటికి రావడానికే భయపడింది, కానీ ఇప్పుడు వైసీపీ వాళ్లు స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారట… తెలుగుదేశం కేడర్‌లో కూడా చంద్రబాబు ధోరణి పట్ల ఈ అసంతృప్తి ఉందట… అంటే వైసీపీ శిబిరం మీద ఇంకా విరుచుకుపడతావా లేదా, లేకపోతే నువ్వే అనుభవిస్తావ్ సుమా అని చెబుతున్నట్టుగా ఉంది ఆ వ్యాసం… హేమిటో…!!
Share this Article