Taadi Prakash is with Laxman Aelay…
తెలంగాణా రంగుల కల… ఏలే లక్ష్మణ్
Glory to the art of Telangana
—————————————————-
లక్ష్మణ్ పెయింటింగులు ఇప్పుడు లక్షల రూపాయల్లో అమ్ముడుపోతున్నాయి.
ఆ నాజూకైన రేఖల్లో పలికే తెలంగాణ పేదల జీవన వాస్తవమూ, సౌందర్యము ప్రపంచాన్ని ఆకర్షించాయి.
తెలంగాణ పెయింటింగ్ కి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన వైకుంఠం, లక్ష్మా గౌడ్ లాంటి లెజెండరీ కళాకారుల పేర్ల సరసన లక్ష్మణ్ పేరు చేరిందిపుడు.
తంగేడు, మంకెన పూలలా ఒక ప్రత్యేకమైన అందంతో కళకళలాడే లక్ష్మణ్ పెయింటింగ్ లను ప్రేమించే అభిమానులు దేశ విదేశాల్లో కొల్లలుగా వున్నారు. 56 సంవత్సరాల ఏలే లక్ష్మణ్ కి ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయి అమెరికాలో సెటిలైంది. రెండో అమ్మాయి ప్రియాంక తండ్రి లాగానే క్వాలిఫైడ్ ఆర్టిస్టు. పెయింటర్ గా ఇప్పుడిపుడే పేరు తెచ్చుకుంటోంది. ఈరోజు – జూన్ 8 – లక్ష్మణ్ పుట్టిన రోజు.
ఏలే లక్ష్మణ్ కి గొప్ప భవిష్యత్ వుంటుందని చాలా ఎర్లీగానే కనిపెట్టగలిగాడు ఆర్టిస్ట్ మోహన్.
ఆర్టిస్టులు పాండు, రాజు, శంకర్, అన్వర్, ఆంజనేయులు, బ్రహ్మం ల అసాధారణమైన టాలెంట్ ని మోహన్ ముందే ఎలా పసిగట్టాడో, లక్ష్మణ్ గురించి ముప్ఫై సంవత్సరాల క్రితమే అంతే ముందుచూపుతో ఈ వ్యాసం రాశాడు. ఈ నవ యువ తెలంగాణ కళాకారుడి కోసం 1990లోనే మోహన్ రాసిన ప్రేమలేఖ ఇది.
– Prakash
*** *** ***
ఏలే లక్ష్మణ్ .. వెర్రితనం వర్ధిల్లాలి!
పేరు లక్ష్మణ్. ఊరు కదిరేనిగూడెం (భువనగిరికి దగ్గర). డిగ్రీ వెలగబెట్టాడు. ప్రస్తుతం ఓ ఆర్టిస్టు ఉద్యోగం. ఇంకా అనవసరపు వివరాలు చాలా ఉన్నాయి. అవసరమైన విషయం –
ఇతను వాటర్ కలర్స్ బొమ్మలేస్తున్నాడు. అవి బావున్నాయి కూడా. రాబోయే సంవత్సరాల్లో చాలా బాగా వుండే ప్రమాదం స్పష్టంగా అగుపిస్తోంది.
మీట్ మిస్టర్ లక్ష్మణ్. లక్షణమైన కుర్రాడు.
పల్లెటూరి పిల్లగాడు. చెప్పుకోడానికి గొప్పలేం లేవు. స్పెషల్ ఏమీకాడు. ఆర్డినరీ. వెరీ వెరీ ఆర్డినరీ.
నీలాగా, నాలాగా, మీ పక్కింటి అప్పారావు లాగా
ఒక లక్ష్మణ్. కదిరేనిగూడెం వాస్తవ్యుడు.
నిజానికి పారిస్ లో పుట్టాడు అని రాస్తే కొంచెం దర్జాగా ఉండేది. పైగా మీకూ నాకూ బాగా తెలిసిన సిటీ.
మరి ఈ గూడెం ఎక్కడుంది? మన రాష్ట్రంలోనేనట. నల్గొండ జిల్లాలో భువనగిరికి ఓ కిలోమీటర్ దూరాన ఉంది. మనకి తెలీనంత మాత్రాన కదిరేనిగూడెం స్థల మహత్యం పోదుగదా. ఆ వూరికి ఈ నాటికీ రోడ్డు లేదు. బస్సుల్లేవు అంటాడు లక్ష్మణ్. (పాపం బొమ్మలేయటం కోసం హైదరాబాద్ నడిచి వచ్చేశాడేమో?) ఆ ఊళ్లో ఏకోనారాయణ బడిలో చదువుకున్నాడు. ఈరోజుకీ ఊరి మొత్తంలో అక్షరజ్ఞానం గల వాళ్ళు పట్టుమని పదిమందేనట. అయినా ఆ వూళ్లో పుట్టటం నాకెంతో గర్వంగా ఉందంటాడు లక్ష్మణ్. ఆ గూడెంలో అశోకుడు నాటకుండానే చెట్లున్నాయి. అశోకుడు తవ్వకుండానే బావులున్నాయి. పొలాలున్నాయి. అవే నన్ను పెంచాయంటాడు. అందుకే ఆర్టిస్టు అయ్యానని అతని అనుమానం.
వెనకటికి ఒక జెకొస్లావాక్ కళాప్రియుడికి కూడా ఇలాంటి అనుమానమే వచ్చింది. ఆయన చిత్త ప్రసాద్ బొమ్మలు చూసి వాటి ప్రేమలో పడ్డాడు. ఇండియా వచ్చి తిరిగివెళ్తూ ఓ వ్యాసం రాశాడు. చిత్తప్రసాద్ బొమ్మల్లో నేటివ్ స్మెల్ గురించి చెప్పాడు. నిజానికి ఇండియాలో పుట్టిన ప్రతి బిడ్డా ఏదో ఒక రకమైన ఆర్టిస్టు అయ్యే ఉంటాడన్నాడు.
ఇక్కడి చెట్టు చేమా.. ప్రకృతిలోని వింత సంగీతం, రంగులూ, వైవిధ్యం.. ఇవన్నీ ప్రతివాణ్ణి వద్దన్నాసరే గాయకుడిగా, వాద్యగాడిగా, నర్తకుడిగా, చిత్రకారుడుగా మార్చి తీరతాయన్నాడు.
ఇదంతా మనదేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో.
ఇప్పుడలాగేం లేదు. మనందరిలోని కళను, మనందరిలోని మనుషుల్నీ సాంతం చంపుకోడానికి దేశం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. సిటీలు పెరిగాయి. కళ అనేది కనిపిస్తే పట్టుకుని దాన్ని చితక్కొట్టడానికి దినపత్రికలనీ, వారపత్రికలనీ, ఎడ్వర్టైజింగ్ ఏజెన్సీలనీ స్థాపించారు. ఇవి మన కల్చర్, టేస్ట్ నిర్ణయిస్తుంటాయి. తెల్లవారు జామున కలత నిద్రలో బాస్ కనిపించగానే భయంతో గజగజలాడుతూ లేచి, ఫుట్ బోర్డు మీద వేలాడుతూ పరుగులెత్తే టెన్ టు ఫైవ్ క్లర్కులనీ, టైపిస్టులనీ వేలకువేలుగా ఈ ఆఫీసులు ఉత్పత్తి చేశాయి.
ఇవే ‘ఆర్టిష్టులు’ జాతిని కూడా అవసరార్ధం మాన్యుఫాక్సర్ చేశాయి. ఆ ఫ్యాక్టరీ ప్రాడక్ట్ ల అమ్మకాలకి తగిన సైజుల్లో దుస్తులు కుట్టడం ఇక్కడ సిసలైన ఆర్టిస్టు పని. అతను కూడా సేల్స్ ప్రమోటర్లలో ఒకడు. పనిలో కాస్త తేడా.
తాజాగా వచ్చే విదేశీ, స్వదేశీ మాగజైన్ల ఎడ్వర్టైజ్మెంట్ తీరును తెలివిగా గానీ, మూర్ఖంగా గానీ కాపీ చేయటం, ఈ పని కాస్త ప్రతిభావంతంగా చేసి, మరికాస్త టెక్నికల్ స్కిల్ ప్రదర్శించినవాడు పెద్ద పేల్స్ ప్రమోటర్. అదే పెద్ద ఆర్టిస్టుగా గుర్తించబడి మరికాసిని రాళ్లు ఎక్స్ ట్రా సంపాయిస్తాడు.
మాఊళ్లో బావి పక్క, చింతచెట్టు నీడ నీరెండ వంక చూస్తూ బద్దకంగా ఒళ్లు విరుచుకుని, ఆ తర్వాత ఎప్పుడో తాపీగా చింతాకుల్లోని నాలుగు పచ్చల మెరుపుల వింతని కుంచెతో గీస్తానని ఎవడేనా బుద్ధితక్కువ వాడు అన్నాడనుకోండి.. ఈ ఏజెన్సీల్లో పత్రికల్లో ఉండే బాసులు బాంబు పేలినట్టు చూస్తారు. ఇది ఏ కమర్షియల్ ప్రొడక్ట్ కవర్ గా పనికొస్తుందని అడుగుతారు. దీని సేల్ పొటెన్షియల్ ఎంతో
మార్కెట్ సర్వేలో తేలాలంటారు. ఇలాంటి కళకు వయబిలిటీ, ప్రాఫిటబిలిటీ ఉండదు గనక,
అది గుట్టుచప్పుడు కాకుండా అంతరిస్తోంది.
ఇలాంటి హై ఓల్టేజి కమర్షియల్ ఆర్ట్ ప్రపంచంలో ఉంటూ ఎందుకూ కొరగాని, ఎక్కడా పనికిరాని లాండ్ స్కేప్ లు వేసే ఒకానొక బుద్ధితక్కువ వాడున్నాడని తెలిసినపుడు నేనూ ఒక ఆఫీన్ ఎగ్జిక్యూటివ్ లాగే విస్తుపోయాను. డబ్బూ, పేరూ, ప్రమోషనూ, లాభమూ, ఎలాటిది లేని, పింఛనూ, పి.ఎఫ్. గ్రాట్యుటీ రాని ఒక రంగంలో కొంతకాలంగా దీక్షగా ఈ బొమ్మలేస్తున్నానని లక్ష్మణ్ వెర్రిగా చెప్పినప్పుడు ఆనందమూ వేసింది. పత్రికల్లో అప్పుడే కళ్ళు తెరుస్తున్న ప్రతి బాలకళాకారుడు కూడా “బోరిస్ వాలెజో” అని అరవటం, ఆ తుక్కు కేలండర్ ఆర్ట్ వెంటబడి మిమిక్రీ చేయలేక బెంగపడుతున్న సమయంలో సొంతగా వాటర్ కలర్స్ ని అర్థం చేసుకోడానికి లక్ష్మణ్ చేస్తున్న ప్రయత్నం చూసి ముచ్చట అనిపించింది. లక్ష్మణ్ బొమ్మలు మహా కళాఖండాలని అనుకోవటం లేదు. కానీ కమర్షియల్ ఆర్ట్ ప్రపంచాన్ని ఆవహించిన పశ్చిమ దేశాల భూతప్రేతాలు ఇతన్ని పట్టు కోలేదు.
వెస్ట్రన్ ఆర్ట్ చేతబడి ఈ బాలుడికి జరగలేదు.
లక్ష్మణ్ బొమ్మలు స్వచ్ఛంగా ఉన్నాయి. అతని ప్రయత్నం పవిత్రంగా ఉంది. వాళ్ళ వూళ్లోని చిన్న గోడమీద పిచ్చిగడ్డి మొక్కల్ని, పిచ్చికల్నీ గీసినా, మెలికలు తిరిగిన చెట్టుని వేసినా పాత ఎటాచ్ మెంట్ ని ఆవిష్కరిస్తున్నాడనిపించింది.
అన్నిటికీ మించి కొన్ని వందలో, వేలో బొమ్మలు గీశాక – ఇతను లక్ష్యాన్ని చేరే ప్రమాదం స్పష్టంగా అగుపిస్తుంది. అధిక తెలివితో ఉక్కిరిబిక్కిరవుతున్న కమర్షియల్ ప్రపంచంలో
లక్ష్మణ్ బుద్ధి తక్కువతనం వర్ధిల్లాలి.
లక్ష్మణ్ వెర్రితనం, అమాయకత్వం జిందాబాద్.
– Mohan, Artst, 1990…….. (మోహన్ రాతలు పాత విస్కీ తరహా… ఎంత పాత సరుకైతే అంత కిక్కు… ముప్ఫయ్ ఏళ్ల నాటి స్కాచ్ ఇది… ముచ్చట…)
Share this Article
Ads