Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బతికింది 62 ఏళ్లు… రాసింది 1,230 కథలు… అంతేనా..? 800 నవలలు రాశారు…

April 13, 2023 by M S R

Sai Vamshi ……… 1200 కథలు.. 800 నవలల మహావృక్షం …. 79 ఏళ్ల తెలుగు రచయిత కాలువ మల్లయ్య గారు ఇప్పటికి 900 కథలు రాశారంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక రచయిత తన జీవిత కాలంలో వంద కథల మైలురాయిని తాకటం ఓ విజయం. 300 కథలు దాటిన వారు కొందరే. ఉబుసుపోక రాయడం కాదు, నికార్సయిన రచనా శైలినే మనసా వాచా నమ్మి ముందుకు పోవడం ఒక నిజాయితీ, ఒక నిబద్ధత.

తమిళ రచయిత్రి అనురాధా రమణన్ గుర్తొస్తున్నారు. బతికింది 62 ఏళ్లు. రాసింది 1,230 కథలు. అంతేనా? 800 నవలలు రాశారు. గుండె ఝల్లుమంటుంది ఆ సంఖ్య వింటే! 1977లో మొదలుకొని చివరిదాకా రాస్తూనే ఉన్నారు. ఏదో పొద్దు పోక రాసిన కథలు కావు. తమిళ వాళ్లు ఇప్పటికీ ఆ కథల్ని అధ్యయనం చేస్తున్నారు. ‘కూటు పుళుక్కల్’, ‘ఒరు మలరిన్ పయనం’‌ లాంటి కథల్ని తమిళ దర్శకులు సినిమాలుగా తీశారు.
బ్రాహ్మణ యువతిపై ఓ తాగుబోతు అత్యాచారం చేస్తే, ఆమె అతణ్ని మార్చి తన భర్తగా మార్చుకోవడం అనే కోణంలో 1980లో ‘సిరై’ కథ రాస్తే, నటి లక్ష్మి ముఖ్యపాత్రలో దాన్నే సినిమాగా తీశారు. అన్నింటినీ మించి కె.బాలచందర్ లాంటి దిగ్దర్శకుడు అనురాధా రమణన్ రాసిన నవల ఆధారంగా ‘ఒరు వీడు ఇరు వాసల్’ (ఒక ఇల్లు రెండు తలుపులు) సినిమా తీశారు.

ఒక ప్రాంతీయ భాషా రచన మరో ప్రాంతీయ భాషలో సినిమాగా మారడం చాలా తక్కువ సార్లు జరుగుతుంది. అనురాధా రమణన్ తమిళంలో రాసిన నవలలు, కథల ఆధారంగా కన్నడ, తెలుగులో కూడా సినిమాలు వచ్చాయి. ఆమె నవల ఆధారంగా 1988లో తెలుగులో ‘ఓ భార్య కథ’ అనే సినిమా వచ్చింది. డబ్బు కోసం ఒక భర్త తన భార్యని మరో వ్యక్తికి అద్దెకిస్తాడు. 30 ఏళ్ల కిందటే అత్యంత Bold Contentగా ముద్ర పడ్డ కథ అది. ఆనాటి రచయిత్రి ఆలోచనా దృక్కోణం.

తెలుగులో రచయితలు రాసిన అనేక కథలు సీరియల్స్ అయ్యాయి. రచయిత్రులవి అరుదు. తమిళవాళ్లు మనకన్నా ముందే ఉన్నారు. అనురాధా రమణన్ గారు రాసిన అనేక కథల్ని సీరియల్స్‌గా చేశారు. ‘అర్చనై పూక్కల్’, ‘పాసం’, ‘కనకండేన్ తొళి’ లాంటి కథలు తెరకెక్కించారు. అవన్నీ విజయవంతంగా నడవడం విశేషం.

అనురాధా రమణన్ మంచి చిత్రకారిణి. Drawing & Paintingనే కోర్సు‌గా చదువుకున్నారు. పత్రికల్లో ఆర్టిస్ట్‌గా ఉద్యోగం వెతుక్కునే క్రమంలో రాయడం మొదలుపెట్టారు. ఆమె చిత్రాల కన్నా కథలపై ఆసక్తి కనబరిచిన ఎడిటర్లు ఆమె కథారచనను ప్రోత్సహించారు. 61 ఏళ్ల వయసులో కూడా బొమ్మలు వేయడం ఆపలేదు.

మీరు YouTubeలో Anuradha Ramanan అని టైప్ చేసి చూడండి. పదుల సంఖ్యలో Tamil Audio Stories వస్తాయి. కథలు చదవడం కోసమే తమిళవాళ్లు ప్రత్యేకంగా ఛానెల్స్ ఏర్పాటు చేసుకున్నారు. చాలా బాగా చదువుతున్నారు కూడా. 30 ఏళ్ల పాటు ఇన్ని పనులు చేసిన అనురాధా రమణన్ ఇప్పుడు లేరు. 2010లో మరణించారు. ఆమె రచనలు ఉన్నాయి. ఆమె కొన్ని కథల్ని గౌరీ కృపానందన్ గారు తెలుగులోకి అనువాదం చేశారు. ఇద్దరికీ నెనరులు

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions