అన్నదానానికి విశిష్టమైన వ్రతం
~~~~~~~~~~~~~~~~~~~~
కేదారం అంటే —
Ads
అన్నపుగింజలను ఇచ్చే పంటపొలం.
కనుక కేదారేశ్వరుడు పాడిపంటల దేవుడు.
ఇది ఏ బౌద్ధజైనాలనాడు కుదురుకున్నదో.
ఇప్పటికీ అదే శ్రద్ధాచారాలతో నడుస్తున్నది.
పరిపూర్ణమైన నియమనిష్టలతో
అన్నపానాలు, ప్రకృతివస్తువులు
చెల్లించుకునేదే– దీపావళి నోము !
దీపావళి నోము / కేదారేశ్వర వ్రతం
************************
ఉత్తర తెలంగాణాలో వ్యవసాయ
కుటుంబాలకు విశిష్టమైన పండుగ
దీలెనోముల గురించిన…కథనం!
ఇది పంటలపండుగ-వంటలపండుగ !!
సోదరి రమారెడ్డి (కరీంనగర్)చెప్పిన
తమ దీలెనోముల సంగతులు
(కొన్ని జోడింపులతో)…
“మాకు దీలె/కేదారినోములు ఉన్నయి.
నాకు బాగ ఇష్టమైన పండుగ..
నోములు కొండంత పండుగ!
పనిగుడ పర్వతమంత ఉంటది !…
ఎందుకంటే
అన్ని పండుగలు తినుడు తాగుడే..
కానీ దీలెపండుగకు
(ఇంటికి సున్నాలు వేసుడుమొదలు..)
ఒక్కటే ఇల్లూవాకిలి సుద్ది.
ఇసిరెల సుద్దిసుబ్రం…
తక్కువ కర్సు, ఎక్కువ పని..
మనసు నిమ్మలం…
ఇగ మాది “ఎంపుకం” నోము…
అంటే అన్ని లెక్కకొద్ది (21)అన్నట్టు
పొద్దుగాల నాలుగుగొట్టంగా లెత్తే,
పనయ్యేవరకు పొద్దూకుద్ది…
ఇగ నాకు ఉన్న ఇట్టాన్ని చూసి,
మా అత్త పనిమొత్తం నాకే విడిచిపెడతది.
దేవుని అర్రల పనిసుత…
మొదట- వెనుకటి నుండి
వంతన కొద్దివస్తున్న
కొలుతల ప్రకారంగ
మా అత్త ఒక్కతే..
బెల్లపన్నం, పసుపన్నం బోనాలు వండుతది.
బోనాలు మీదకి దీపానికి 21 పోగుల వత్తి జేస్తది…
నేను దేవుని పటువలు, పాలవెల్లి పుదిచ్చి,
మర్రి ఆకులల్ల అన్ని 21చొప్పున పోకలు,
ఖర్జూరలు, పసుపు బొట్లు, గంధం బొట్లు,
కుంకుమ చీటీలు,మేక గొతికెలు,
మర్రి ఊడలు, మర్రి పండ్లు, మర్రి ఈనెలు,
అల్లం ముక్కలు, బెల్లం ముక్కలు,
గుగ్గిళం ఉండలు, మైసాచ్చి ఉండలు, బంతి పూలు,
21 పోగుల దారం, దాన్ని 21 ముడులు వేసుడు
21 మర్రి ఆకుల ఇస్తరాకు కుడుత.
ఇగ కొత్త నేతిబొట్టులో గోలిచ్చిన
21 బెల్లప్పాలు కూడా నైవేద్యం.
మా మామ సూడసక్కగ
గోడకు కొప్పెడ ఏస్తడు..
ఇగ గివన్ని తయారు అయినంక
ఆవు పెండ, మూత్రం తోటి గద్దె అలికి,
ఆవు పాలతో పాత నోముదండలు తడిపి ఎండవెట్టి
(ఇగ ఈ ఎండవెట్టుడు ఒక పెద్ద ముచ్చట, ఆ టైంలో వాటిని జాగ్రత్తగా కాపాడాలే, కాకులు ఎత్తుకపోతాయట, వాటి కంటవడకుండా కనిపెట్టుకొని ఇంట్ల ఎవరన్నా ఒక
పెద్ద మనిషిని అక్కడ కావలి కూసోవెడతరు)
పుదిచ్చిన పట్వలు పెట్టి, పట్వల ముందట గొలుసు పోసి
(గొలుసు అంటే ఎవ్వరు తొక్కని ఉసికె/ఇసుక),
గొలుసు మీద కొత్త కనుము ముక్క వేసి,
ఆ కనుము ముక్క మీద బియ్యం పోసి,
దాని మీద 21 ఆకుల మర్రి విస్తారాకు వేసీ,
దాంట్ల ఆవు పాలతో కడిగి ఎండవెట్టిన
పాత నోముదండలు కుడుకులు పెట్టి,
ఇగ వాటి సుట్టూ 21 బంతిపూలు పెట్టి,
పైన జెప్పినవి అన్నీ 21 సొప్పున వెట్టి
పాలవెల్లి (పూల పందిరి) మీద
కొత్త మేదర చాటల 21 బెల్లప్పాలు పెట్టి ,
21 పోగుల వత్తి పెద్ద దీపాంతల వేసీ,
దాన్నిండా నూనె పోసి పెడతరు.
ఇగ అయ్యగారు వచ్చి
పూజ మొదలువెట్టినంక
అత్తమ్మ దీపం ముట్టించి, గౌరమ్మను జేత్తరు.
(ఇగ ఆ ముట్టిచ్చిన దీపం తెల్లారి తిరిగి దేవున్ని
ఎత్తుకునేదాక కాపాడాలే, గది చానా చానా ముఖ్యమైన సంగతి)
మా మామ 21 పోగుల దారం పోసి, 21 ముడులు ఎస్తరు..
(ఈ మద్య మామకి ఆరొగ్యం బాగలేక నీనే అన్ని వేసి ఇస్తన్నా…) ఇగ ఈ నోముదండ కూడ
పాతనోము దండలతో పాటుపెట్టి,
కేదారనోము కథ అయ్యగారు సదువుతాంటే
అందరం అది వినుకుంట మాభాగ్యం అనుకుంటమ్..
అంత అయినంక- గుగ్గిళం, మైసాచ్చి పొగవేసి,
కొబ్బరి కాయకొట్టి, ఇస్తారాకుల—
బెల్లపన్నం,బెల్లప్పాలు— కూర/శాకం
గుమ్మడికాయ, చిక్కుడుకాయ, వంకాయ,
కాకరకాయ, తీరొక్క కాయలన్ని…,
మిరుపకాయలు, ఉప్పువేసి
ఉడికిచ్చే పోపువేయని కూర &
పెరుగు తోటి నైవేద్యం పెడుతం.
అందరికి అదే ప్రసాదం…!!
తర్వాత కురాడికుండకు
నైవేద్యం పెడుతం.. అది ఆడబిడ్డ పాలు!
కురాడికుండ కాడి నైవేద్యం
ఆడబిడ్డనే తప్పకతినాలే.
ఎదురుగుంజకు, పొయ్యికి (అగ్నిపురుషునికి)
నైవేద్యం/ ఆరగింపులు తప్పనిసరి.
అందరికంటే/అన్నిటికంటె ముందు
పోచమ్మకు బోనం చెల్లిస్తం !
అర్రల దేవుని పట్వల కాడ
రెండు చెమ్మెలల్ల దీపాలు వెడుతం.
ఇవి మల్లన్న దేవునికట.
(మా పెద్దలు అంటరు)
నోములకు–
చివరిముచ్ఛట పెద్దముచ్చట
బోనాలకు తగినట్టుగా
తీరొక్కరకాలుగ
కాయగూరలు, పులుసులువండి,
వాడకట్టు వాళ్ళందరిని పిలిచి
భోజనాలు పెట్టుడు…..
ఏ వంటా మిగులకుంట
అందరికీ కడుపునిండ తినవెట్టాలె.
గిదీ!… మా దీలెనోముల ముచ్చట…
ఈ నోములు కూడా వాళ్ల వాళ్ల ఆచారాలు,
పద్దతులను బట్టి కొంచెం మారుతుంటయి.
విస్తరి కింది బియ్యం–
తిరుగువారంనాడు నైవేద్యం వండిపెట్టుడు
పందిరిమీది చాటఎత్తుకునుడుతోటి
నోముల పని పూర్తయితది.
మైలలో, సుతకమో.. మరేదైనా కారణంగానో
దీలెనాడు నోములు పడకపోతే
పంచమికో ఏకాదశిరోజునో
తిరుగువారం నాడో కాదంటే
కార్తీకపున్నానికో నోముకుంటరు.
నోములను మాత్రం పడగొట్టుకోరు…… ~ డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
Share this Article