Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జాణవులే… నెరజాణవులే… వరవీణవులే… కిలికించితాలలో…

September 4, 2025 by M S R

.

Bharadwaja Rangavajhala……….    పులకించని మదులను సైతం పులకరింపచేసిన గాన మాధుర్యం జిక్కి కృష్ణవేణి జయంతి నేడు. పిల్లపాలు గజపతి కృష్ణవేణి అంటే ఎవరో చెప్పలేరు కానీ జిక్కి అనగానే ఎవరైనా గుర్తుపడతారు. కమ్మని కంఠంతో మధురమైన పాటలతో దక్షిణాది సినీ ప్రేక్షకులను మైమరపించిన గాత్రం జిక్కి కృష్ణవేణి. ఈ రోజు జిక్కి పుట్టినరోజు.

జిక్కి తండ్రి మద్రాసు సినీ పరిశ్రమలో చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారు. వాళ్లది చిత్తూరు జిల్లా, చంద్రగిరి. చిన్న వయసులోనే జిక్కికి చిత్ర పరిశ్రమతో అనుబంధం ఏర్పడింది. తండ్రితో పాటు స్టూడియోల్లో తిరుగుతున్న బాల జిక్కిని చూసి పంతులమ్మ మూవీలో బాలనటిగా అవకాశం ఇచ్చారు గూడవల్లి రామబ్రహ్మం. కానీ నటిగా కొనసాగలేదు కృష్ణవేణి.

Ads

తన గానంతో దక్షిణాది ప్రేక్షకులను తన్మయులను చేశారు. జిక్కి ప్రత్యేకంగా సంగీతాభ్యాసం చేయలేదు. జస్ట్ పాటలంటే ఇంట్రస్టు. అలా విని ఇలా పాడేయడం జిక్కి ప్రత్యేకత. పైగా అవతలి గాయని వేసిన గమకాలు, ఇతర స్వరవిన్యాసాలూ అన్నీ అంతకన్నా బెటరుగా పాడేసే ప్రయత్నం చేసేది. అందుకే జానపద గీతాలకు జిక్కినే ప్రిఫర్ చేసేవారు సంగీత దర్శకులు.

ఒకే స్వరంలో అటు మధురానుభూతిని, ఇటు కవ్వింపునీ పలికించగల గాయని జిక్కి. ఆమె పాట వింటే పులకించని మది పులకిస్తుంది, ఆమని హాయిగా సాగుతుంది.  ఎన్ని సార్లు విన్నా ఆమె గాత్రంపై మోజు తీరలేదు అనిపిస్తుంది. సంగీత జ్ఞానం కన్నా ఎక్స్ ప్రెషన్ పలకడం సినీ నేపధ్య గాయనికి ఉండాల్సిన లక్షణం.

సరిగ్గా ఇక్కడే సంగీత దర్శకుడు ఆదినారాయణరావుకి జిక్కి నచ్చేది. సువర్ణ సుందరిలో అజరామర గీతం హాయి హాయిగా ఆమని సాగే లాంటి పాటలెన్నో జిక్కితోనే పాడించుకున్నారాయన. ‘పంతులమ్మ’ లో బాలనటిగానే కాదు గాయనిగానూ తనేమిటో చెప్పే ప్రయత్నం చేశారు జిక్కి. ఇంకా త్యాగయ్య, మంగళసూత్రం, గొల్లభామ చిత్రాల్లో నటించారు. తర్వాత ‘జ్ఞానసుందరి’ అనే తమిళ సినిమాతో పూర్తి గాయనిగా మారారు.

ఈ చిత్రంలో జిక్కి పాడిన పాట బాగా ప్రేక్షకాదరణ పొందింది. దాంతో అప్పటి సినీ సంగీత దర్శకులందరి దృష్టి జిక్కిమీదనే. 1950 దశకంలో దక్షిణ సినీ పరిశ్రమలో గాయనిగా జిక్కికి తిరుగులేదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, సింహళ, హిందీ… ఇలా ఏ భాషలోనైనా ఆమె గాత్రమే వినిపించేది. మొత్తం పది వేలకు పైగా పాటలు పాడారు.

సహ గాయకుడు ఎ.ఎం.రాజాతో కలిసి హిందీ చిత్రంలో పాడారు. హిందీ భాషలో పాడిన తొలి తెలుగు గాయకులు వీరిద్దరే. ఎన్నో హిట్ పాటలు పాడిన వీరిద్దరూ తర్వాత వివాహం చేసుకున్నారు. డబ్బింగ్ పాటలను సూపర్ హిట్ చేసిన గానం జిక్కిది. ఎ.ఎమ్ రాజాతో ప్రేమ పెళ్లి తర్వాత కూడా జిక్కి గాయనిగా చాలా బిజీగా ఉండేవారు. వైవాహిక జీవితం తన గాన ప్రయాణానికి ఇబ్బంది కాలేదు.

జానపదాలు, హిందూస్తానీ పద్దతిలో కూర్చే నాటకాల ఫక్కీ గీతాలకు జిక్కినే ఎప్రోచ్ అయ్యేవారు సంగీత దర్శకులు. ఘంటసాల సంగీతం అందించిన అభిమానంలో ఓ హిందీ బాణీ అనుకరణ ఉంటుంది. దాన్ని కోరి మరీ జిక్కితో పాడించారాయన. ఓహో బస్తీ దొరసానీ పాట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

భర్త ఎ.ఎం.రాజా రైలు యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత తన ఇద్దరు కొడుకులతో కలిసి సంగీత బృందాన్ని ప్రారంభించి, విదేశాల్లో అనేక సంగీత కార్యక్రమాలు నిర్వహించారు జిక్కి కృష్ణవేణి. ఆమె ఎప్పుడూ డబ్బు ముఖ్యమనుకోలేదు. దానికి ఉదాహరణ ఓ తమిళ సినిమాలో మొత్తం పాటలు పాడే అవకాశం వచ్చినప్పుడు, నిర్మాత ఎక్కువ మొత్తంలో డబ్బు ఇచ్చినా తనంతట తానే ఆ డబ్బులు తగ్గించుకున్నారు. చివరి క్షణం వరకు పాడుతూనే కన్నుమాయాలనుకున్నారు జిక్కి. అవకాశాలు తగ్గితే స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసుకున్నారు.

ఎవరైనా వచ్చి మా సినిమాలో పాడాలని కోరితే వెళ్లి పాడారు. కానీ ఎన్నడూ ఏ విధమైన కాంట్రవర్సీని దరికి రానీయలేదు. హాయిగా అందమైన పాటలానే సగౌరవంగా జీవించారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369 లో జాణవులే అంటూ తన గాత్రంతో అలరించారు జిక్కి.

సంగీత దర్శకుడు కీరవాణి కూడా సీతారామయ్యగారి మనవరాలు చిత్రంలో ఓ పల్లెపట్టు గీతాన్ని జిక్కితోనే పాడించుకున్నారు. నాగార్జున నిన్నే పెళ్లాడుతాలోనూ జిక్కితో పాట పాడించుకున్నారు. మురారిలో అలనాటి రామ చంద్రుడు అన్నింటా సాటి సుశీలతో కలసి జిక్కే పాడారు. పాటకే తన జీవితం అంకితం చేసుకున్న జిక్కి 2004 ఆగస్టు 16న కన్నుమూశారు. ఆమె శ్వాస ఆగిపోయినా మన గుండెల్లో జిక్కి స్వరం పులకించని మది పులకించు అంటూ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టార్గెట్ సాక్షి ఎడిటర్..! జగన్ సన్నిహితగణంపై పాలకుల ప్రత్యేక దృష్టి..!!
  • నేపాల్ అల్లర్ల విశ్లేషణలోనూ… అదే యాంటీ- జగన్, అదే ఆవు వ్యాసం…
  • పార్టీ పాలసీల్లో గందరగోళం, అస్పష్టత… అమరావతిపై యూటర్న్ అదే…
  • ‘కూలీ’ ఇచ్చి మరీ… కొరడాలతో కొట్టించుకోవడమంటే ఇదే…
  • నాటకాలు, సినిమాలు… రచన, నటన… విసు ఓ తమిళ దాసరి…
  • కేసీయార్ పదేళ్ల స్వరాష్ట్ర పరిపాలనకు మరో వికృతకోణం ఇది…
  • GenZ … నెట్ వీథుల్లో విప్లవరచన… అసలు ఏమిటీ తరం..? చదవండి..!
  • Air Bag to Air Bus …. ప్రయోగాలు ఫలిస్తే విమానప్రాణాలకు శ్రీరామరక్ష…
  • భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ… బీమా భరోసాలే కాదు, ఈ జాగ్రత్తలూ ముఖ్యమే…
  • వంశీ మార్క్ జమజచ్చ సినిమా.., అప్పట్లో జహిజట్… నవ్వుల్ డబ్బుల్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions