Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నోబెల్ ప్రైజ్ విన్నర్ హాన్ కాంగ్… గాఢమైన కథావస్తువుకు ప్రపంచ ప్రసిద్ధి…

October 11, 2024 by M S R

.

2024 సాహిత్యంలో నోబెల్ బహుమతి దక్షిణ కొరియా రచయిత్రి “హాన్ కాంగ్” గారికి నిన్న ఇచ్చారు.

ఇతరుల కంటే భిన్నంగా, మానవ జీవితంలోని వివిధ కోణాలను ప్రతిబింబించే రచనలు చేసిన హాన్ కాంగ్ ఒక ఇంటర్వ్యూ లో తన చిన్ననాటి గురించి మాట్లాడుతూ: “మా ఇంట్లో పేదరికం ఉండేది. మా నాన్న కూడా ఒక రచయితే, కానీ సరైన ఫర్నీచర్ కూడా ఉండేది కాదు. మా ఇంట్లో ఉన్న పుస్తకాలే నా ప్రపంచం. అవే నన్ను చూసుకునేవి, పుస్తకాలే నన్ను పెంచాయి,” అని చెప్పింది. ఎంత అద్భుతమైన మాటలు!

Ads

నోబెల్ అకాడమీ సెక్రటరీ, అవార్డును అందజేస్తూ, “చరిత్రాత్మక వేదనలను ఎదుర్కొంటూ, మానవ జీవితంలోని నాజూకుదనాన్ని వెలుగులోకి తీసుకువచ్చే గాఢమైన కవితాత్మక గద్యరచనలు చేసింది హాన్ కాంగ్’’ అని కొనియాడారు.

భారతీయ రచనల్లో ఆత్మ ఉంటుంది, పాశ్చాత్య కథల్లో శరీరం మాత్రమే ఉంటుందని కొందరు భావిస్తారు. అలాగే, పాశ్చాత్య తత్త్వశాస్త్రం ప్రాక్టికల్‌గా ఉంటుందని, భారతీయ తత్త్వశాస్త్రం మూస ధోరణి మాత్రమేనని మరికొందరు అభిప్రాయపడతారు. నిజానికి ఈ రెండు అభిప్రాయాలు సరైనవి కావు. వారి వాదనల పరిధి అంతవరకే. కానీ, విస్తృతంగా ఆలోచిస్తే, ప్రపంచం మొత్తం ఒకటే. మానవ స్వభావం ప్రతి చోటా ఒకేలా ఉంటుంది. కేవలం ప్రాంతీయత లేదా సంస్కృతి ఆధారంగా మాత్రమే కాదు, మానవతా విలువలు, అనుభవాలు ప్రపంచవ్యాప్తంగా ఒకే రకంగా ఉంటాయి అని నా వ్యక్తిగత అభిప్రాయం. హాన్ కాంగ్ రచనలు కూడా ఈ భావనను ప్రతిబింబిస్తాయి.

హాన్ కాంగ్ రచనలు హృదయాంతరాళం లోపలికి వెళ్ళి చదవాలి, అంత గాఢంగా ఉంటాయి. ఆమె రచనలు లోతైన భావోద్వేగాలను, వ్యక్తిగత బాధను, మరియు సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తాయి. ఆమె రచనల్లో విభిన్నమైన అంశాలు ఉంటాయి, ముఖ్యంగా హింస, స్వేచ్ఛ, మానవ సంబంధాలపై ఆమె విశ్లేషణ చాలా లోతుగా ఉంటుంది. 2016 లో అమె రాసిన నవల “ది వెజిటేరియన్” కి గాను బుకర్ ప్రైజ్ వచ్చింది.

వెజిటేరియన్ చదువుతుంటే చలం రాచిన మైదానం, అమృత్ ప్రీతం రాసిన ది స్టెంచ్ ఆఫ్ కిరోసిన్, ఇంకా బ్రిటీష్ రచయిత్రి వర్జీనియా వుల్ఫ్ రచనలు కొన్ని గుర్తుకు వచ్చాయి. ఏ పుస్తకం లేదా నవల చదువుతుంటే ఒక కంక్లూజన్ ఉంటుంది లేదా, వస్తుంది కానీ హాన్ కాంగ్ రాచిన నవల “ది వెజిటేరియన్” లో అనుభవం ఒక ప్రవాహంలా ఉంటుంది, ఎవరికి అర్ధం అయ్యింది వాళ్ళు తీసుకోవటమే, ఒక కంక్లూజన్ ఉండదు.

సాహిత్యంలో నోబెల్ బహుమతి అనేది ఒక్క నవలకి మాత్రమే ఇచ్చి ఉండరు. ఆమె ప్రధాన రచనలు: ది వెజిటేరియన్, ది వైట్ బుక్, గ్రీక్ లెసన్స్, హ్యూమన్ యాక్ట్స్, ది విండ్ బ్లోస్ గో, యూరోపా, కన్వలజెన్స్.

నా ఉద్దేశంలో హాన్ కాంగ్ ప్రసిద్ద రచనలు 3, వాటి గురించి…
1. ది వెజిటేరియన్: ఒక సాధారణ ఉద్యోగి, ఒక అత్యంత సాధారణమైన అమ్మాయి పెండ్లి చేసుకుంటారు. వాళ్ళ జీవితం సాఫీగా సాగుతూ ఉంటుంది. ఈ కథలో యెంగ్-హే అనే మహిళకి ఒక కల రావటంతో మాంసాహారం మానేసి శాకాహారిగా మారుతుంది. ఇంట్లో ఉన్న మాంసం అంతా పారేసి సూర్యరశ్మిని పీల్చుకొని నీటిని త్రాగుతూ బ్రతుకుతుంది. దక్షిణ కొరియాలో శాకాహారం అంటే నార్మల్ కాదు, అక్కడ అందరూ సాధారణంగా తినేది మంసాహారం. నిజానికి ఈ కథ మానసిక బాధలని గురించి మాత్రమే, శాకాహారం/ మాంసాహారం అని కాదు. ఆ తర్వాత భర్త, సంఘం నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటుంది.

ఈ పుస్తకం మూడు భాగాలుగా ఉంటుంది. మొదటి దానిలో ఆమె భర్త ఆమె గురించి మాట్లాడింది, రెండో దానిలో ఆమె సిస్టర్ భర్త ఆమె గురించి, మూడో దానిలో ఆమె సిస్టర్ ఆమె గురించి మాట్లాడింది ఉంటుంది. ఆమె ఏమి అన్నది ఎక్కడా ఉండదు, అదే ఈ బుక్ లో ప్రత్యేకత. వేర్వేరు కోణాల నుంచి యెంగ్-హే యొక్క జీవితం ఉంటుంది. ఈ కథ వ్యక్తిగత స్వేచ్ఛ, శరీరంపై ఉన్న హక్కులు, సామాజిక ఒత్తిళ్లపై లోతైన చర్చను అందిస్తుంది. ఇందులో మనుషులపై కుటుంబం, సమాజం ఒత్తిడి ఎలా ప్రభావితం చేస్తుందో చూపిస్తుంది.

ప్రధానం గా కొందరు ఆడవాళ్ళ మానసిక సమస్యలు. నిజానికి ఆడవాళ్ళ/మగ వారి మానసిక సమస్యలని అర్ధం చేసుకోవాలంటే వాటి మీద పట్టు, లోతైన అవగాహన ఉండాలి. అది లేకపోతే జరిగే అనర్ధాలు ఇలా ఉంటాయి అనొచ్చునేమో తెలియదు. అలా అని ఆయా భావాలు కరక్ట్ అని చెప్పలేము. చదివి ఎవరికి అర్ధం అయ్యింది వాళ్ళు అనుభవించటమే ఈ పుస్తకం. ప్రపంచ వ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది, 2016 సంవత్సరంలో ప్రతిష్టాత్మకమైన బుకర్ ప్రైజ్ వచ్చింది ఈ నవలకి.

2. హ్యూమన్ యాక్ట్స్: ఈ నవల 1980 లో దక్షిణ కొరియాలోని ప్రజాస్వామ్య ఉద్యమం (గ్వాంగ్జు ఉద్యమం) నేపథ్యాన్ని తీసుకుని రాయబడింది. ఈ ఉద్యమంలో జరిగిన హింస, నిరసనలు, మరణాలు ఈ కథలో ప్రధానాంశాలుగా ఉంటాయి. ప్రధానంగా ఒక యువకుడు, డోకీ, మరణించిన స్నేహితుని శవాన్ని తిరిగి పొందటానికి ప్రయత్నిస్తాడు. అతని అనుభవాల ద్వారా హాన్ కాంగ్ ఈ ఉద్యమం సమయంలో ప్రజలు ఎదుర్కొన్న హింస మరియు మానవత్వాన్ని ప్రశ్నించే పరిస్థితులను లోతుగా పరిశీలిస్తుంది. ఈ పుస్తకం మనసును కదిలించేలా, హింస, బాధ, మరియు సామూహిక స్మృతి పట్ల అవగాహనను కలిగిస్తుంది. ఈ కథలో వర్ణన మానవహక్కుల అంశాలను పరిశీలిస్తుంది.

3. ది వైట్ బుక్: ఈ పుస్తకం హాన్ కాంగ్ యొక్క అత్యంత వ్యక్తిగతమైన రచనలలో ఒకటి. ఇందులో ఆమె తన సోదరి మరణం నుండి పుట్టిన భావాలను, ఆత్మవేదనలను కవిత్వంగా అల్లింది. ఇందులోని రచనలు తెల్లని వస్తువుల (పాలు, మంచు, బట్టలు) ఆధారంగా రూపొందించబడిన కవిత్వంలా ఉంటాయి. “వైట్” అనే రంగు ద్వారా వేదన, మరణం మరియు పునర్జన్మపై ఆలోచనలను వ్యక్తీకరించింది. ఇది కేవలం ఒక పుస్తకం కాకుండా, జీవితంలోని అవగాహనలను, మనవైపు నుండి చూసే జీవితాన్ని ప్రశ్నించే ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలా ఉంటుంది. పాఠకులకు ఇది లోతైన భావోద్వేగ అనుభూతిని అందిస్తుంది.

హాన్ కాంగ్ రచనలు జీవితంలోని కఠిన పరిస్థితులను, మానవ స్వభావాన్ని కవిత్వంలా వివరించడం ద్వారా ప్రపంచంలోని పాఠకులను ఆలోచింపజేస్తాయి. నిజంగా “చరిత్రాత్మక వేదనలను ఎదుర్కొంటూ, మానవ జీవితంలోని నాజూకుదనాన్ని, వివిధ పార్శ్వాలని వెలుగులోకి తీసుకువచ్చే గాఢమైన కవితాత్మక గద్యరచనలు చేసింది హాన్ కాంగ్…… — జగన్నాథ్ గౌడ్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions