మార్కెట్‌లో బియ్యం ధరలు అడ్డగోలుగా పెరిగాయి… ఉత్పత్తి పెరిగితే ధరలు తగ్గుతాయి అనే కామన్ వ్యాపార సూత్రం బియ్యానికి పనికిరాదు… సన్నధాన్యం ఉత్పత్తి పెరుగుతున్నా సరే సన్నబియ్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి… సోనామశూరి కాస్త ఖరీదని అందరికీ తెలిసిందే… దాన్ని హెచ్ఎంటీ, జైశ్రీరాం రకాలు ఎప్పుడో దాటిపోయాయి… పైగా పాతబియ్యం దొరకడమే లేదు… వీటికన్నా బాస్మతి నయమేమో అని చెక్ చేస్తే… లాంగ్ గ్రెయిన్, ఓ మోస్తరు బాస్మతి రకాలు మన సన్నరకాల బియ్యంకన్నా చౌకగా దొరుకుతున్నాయి…
అలాగే చూస్తుంటే కాలనమక్ రైస్ అని కనిపించింది… నల్లరంగులో బ్యాగులపై ముద్రించి ఉంది… కిలో 200 వరకూ ఉన్నాయి ధరలు… బాస్మతిని మించిన రేట్లు ఉన్నాయా..? ఏమిటి దీని స్పెషాలిటీ అని చూస్తే… నాన్ బాస్మతి రకాల్లో నంబర్ వన్ అని రాసి ఉంది… అసలు నాన్ బాస్మతి ఏమిటీ ఖర్మ… అన్నిరకాల బియ్యాల్లోనూ ఈ బియ్యమే ఖరీదు… మరి ఏమిటి స్పెషాలిటీ..? నల్లగా ఉన్న బియ్యం తినబుద్ది అవుతుందా అసలు..?
ధాన్యం పైపొట్టు మాత్రమే నలుపు… జ్ఙానప్రాప్తి జరిగాక ఇక పూర్తి స్థాయి సన్యాసంలోకి వెళ్లేముందు ఈ విత్తనాలను ప్రసాదించాడని అంటారు… అందుకే దీన్ని బుద్ధ బియ్యం అని కూడా వ్యవహరిస్తారు… మిగతా రకాలతో పోలిస్తే నలుపు పొట్టుతో కాస్త ఉప్పదనం కూడా ఉంటుంది కాబట్టి కాలా నమక్ అంటుంటాడు… బాస్మతి తరహాలో పొడుగు గింజ కాదు కానీ బాస్మతిని మించిన పరిమళం దీని సొంతం… ఒకప్పుడు నేపాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ హిమాలయాల పాదాల చెంత వేలాది ఎకరాల్లో సాగు జరిగేది…
Ads
పెస్టిసైడ్లు, ఎరువులు వాడీ వాడీ క్రమేపీ ఈ రకం బియ్యం తన ఒరిజినాలిటీని కోల్పోయింది… ఆ వాసన పోయింది… దిగుబడులు పడిపోయాయి… వేరే రకాలతో పోలిస్తే మంచి ధరలు వచ్చేవి కావు… ఒక దశలో మరీ 1000 హెక్టార్లు, అంటే 2500 ఎకరాలకు సాగు తగ్గిపోయింది… కొన్నేళ్ల క్రితమే దీన్ని కాపాడుకోవాలనే స్పృహ పెరిగి, ఒకటీరెండు వరి పరిశోధన కేంద్రాలు దీన్ని కాపాడే ప్రయత్నాలు మొదలు పెట్టాయి… ఇప్పుడు మళ్లీ 15 వేల హెక్టార్ల దాకా పెరిగింది… అంటే 37, 38 వేల ఎకరాల వరకూ… ఆన్‌లైన్ సైట్లు, బయట దొరికే కాలా నమక్ చాలావరకూ డూప్లికేట్… కానీ దాని పేరిట రేట్లు మాత్రం మండిపోతుంటాయి…
ఏమిటి దీని స్పెషాలిటీ..? మామూలు బియ్యం రకాలతో పోలిస్తే అన్నం మెత్తగా అవుతుంది… సులభ జీర్ణం… ఐరన్, జింక్ పర్సంటేజీ ఎక్కువ… అన్నిరకాల బియ్యంలోకన్నా ఇందులో ప్రొటీన్ల శాతం ఎక్కువ… దాదాపు రెట్టింపు… ప్రత్యేకించి అల్జీమర్స్‌తో బాధపడేవాళ్లకు మంచి ఆహారం… అంతేకాదు, ఈ బియ్యం జీఈ వాల్యూ… 49 నుంచి 52 నడుమ ఉంటుంది… అంటే సుగర్ పేషెంట్లకు ఇది సూపర్ ఫుడ్… చిరుధాన్యాలతో ఈక్వల్… ఇలాంటి ఎన్ని క్వాలిటేటివ్ రకాల్ని కాలగతిలో పోగొట్టుకున్నామో… కనీసం ఒరిజినల్ సీడ్ భద్రపరుచుకోగలిగామా..?
Share this Article