.
మోస్ట్ పాపులర్, రద్దీ, కమర్షియల్ దైవక్షేత్రాల్లో ఉండడు దేవుడు… ప్రశాంతంగా, ఏ హడావుడీ, ఏ కమర్షియల్ వాసనలూ లేని క్షేత్రాల్లో ఉంటాడు… నో, నో, నేను తిరుపతి గురించో, మరే ఇతర క్షేత్రం గురించో చెప్పడం లేదు… ఐనా తిరుమలలో దేవుడు ఉన్నాడా…? అక్కడ రాజకీయ నికృష్టుల ధాటికి ఎప్పుడో వెళ్లిపోయి ఉంటాడు కదా… ఎవడి కర్మ, ఖర్మ వాడు అనుభవిస్తాడు… అలిపిరిలో కావచ్చు, మరో చోట కావచ్చు…

Ads
సరే, మనం ఆమధ్య కర్నాటక, తెలంగాణ సరిహద్దుల్లో…. కృష్ణా సజీవ ప్రవాహం నడుమ కొలువై ఉన్న శ్రీపాద వల్లభ గురుదత్త క్షేత్రం గురించి చెప్పుకున్నాం… ఆ స్టోరీ చదివిన ఓ సీనియర్ జర్నలిస్టు వుప్పల రమేష్ శర్మ వెళ్లాడు… తను స్వయంగా రాసి పంపించిన స్టోరీ ఇదుగో….
గానుగాపురం రెండు సార్లు వెళ్లొచ్చాక దత్తపీఠాల పట్ల ఆసక్తి కలిగింది… కురువపురం వెళ్ళాలని అనిపించినా తెలంగాణా గుడుల ‘గొప్పదనం’ తెలిసి, అనుభవించి, ఇంటి నుంచే దండం పెడదామని అనుకున్నా…
కొద్ది రోజులక్రితం ముచ్చట వాల్ మీద ఈ క్షేత్ర సందర్శన వివరాలు తెలుసుకున్నా… ఉన్నంతలో మంచి క్షేత్రం అని నిర్ణయించుకొని ఓ నలుగురం ఉదయం ఆరు గంటలకు హైదరాబాదు నుంచి కార్ లో బయలుదేరాం…
ఆరాంఘర్ నుంచి నూటా ఎనభై కిలోమీటర్ల దూరం… స్వామి దర్శనం తర్వాతే కడుపు చల్లబరచాలని పరగడుపున ఉన్నాం… మక్తల్ నుంచి పందొమ్మిది కిలోమీటర్ల దూరం దారుణంగా ఉంది… Car పార్కింగ్ పూర్తిగా ఉచితం… మన దగ్గర మాదిరిగా కండపుష్టి కలవారు హుంకరిస్తూ, గుత్ప కర్ర పట్టుకొని, ఏయ్, అటు పో.. ఇటు రా అనే అరుపులు లేవు…
నదికి ఇవతలి ఒడ్డున పీఠంలోకి వెళ్లగానే ఒక మహానుభావుడు పిలిచి, మాకు రెండేసి నాణాలు ఇచ్చి, గంధం పెట్టీ, తెల్ల వస్త్రంలో భద్రపరిచి బీరువాలో పెడితే ధనానికి ఇబ్బంది ఉండదని చెప్తూ…. నాయనా, ఆ కుడి వైపునకు త్వరగా వెళ్ళండి… ముందు టిఫిన్ తినండి… నదికి ఆవల స్వామి వారిని దర్శించి, ఇక్కడ భోజనానికి రండని చెప్పారు…

నది వద్దకు రాగానే యాభై రూపాయలకు ఒక యాత్ర చొప్పున పడవలో కూర్చోబెట్టి అవతలి ఒడ్డుకు చేర్చారు… అక్కడ వేదపండితుడు నమకం చమకంతో సుస్వరంగా అభిషేకం చేస్తుంటే బయట తెర మీద మన ఎదురుగానే చేస్తున్నట్లు అనిపించింది…
జరగాలి… జరగాలి… అనే ఆదిలింపులు లేకుండా భక్తులే నిముషంపాటు స్వామిని దర్శించి బయటకు వెళ్ళడం దత్తుడి వైభవం… ఇక భోజనాలు… అన్నపూర్ణ నిలయంలో ఉదయం ఆరున్నర నుంచి గంట సేపు టీ, ఎనిమిదిన్నర నుంచి గంట సేపు అల్పాహారం, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు చక్కటి భోజనం పప్పు, పులుసు, చల్లకూడిన రుచికరమైన భోజనం…
మళ్ళీ రాత్రి భోజనం ఉండనే ఉంది… వరుస పద్ధతిలో నిలబడి ప్లేట్ తీసుకొని, అన్నం తీసుకొని ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చొని టేబుల్ మీల్స్….
ఎవరు తిన్న కంచం, గ్లాస్ వాళ్ళే కడిగి పొందికగా పెట్టాలి… కాకపోతే పారేయవద్దని స్వయం నియంత్రణ పాటించాలి… క్రితం రాత్రి వచ్చి బస చేసి అభిషేకం చేసుకుంటే మరింత ఫలితం అని చెపుతారు…..
నదికి ఇవతలే రెండు ఆశ్రమాలు ఉన్నాయి… రాత్రి నిద్రకు పోయేవాళ్లు అక్కడ బస తీసుకోవచ్చు… టిఫిన్, భోజనం, రాత్రి ఏ పూటకు అక్కడ చేరుకున్నా సరే ఫుడ్డు…. కృష్ణా స్నానం… రాత్రి దత్తాత్రేయ శిష్య ప్రాంగణంలో నిద్ర… దర్శనం… అభిషేకం… కమర్షియల్ పుణ్యక్షేత్రాలతో పోలిస్తే ….
ఆహా.,.. జై గురుదత్త... దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా... హైదరాబాద్ భక్తులు పోటెత్తుతున్న గానుగాపూర్ వోకే... కానీ అంతకుమించి ప్రాశస్త్యం ఉన్న కురువాపురం అలియాస్ కురుగడ్డ.... అక్కడికి సమీపంలో ఒకటీరెండు క్షేత్రాలున్నాయి... అవి తరువాత చెప్పుకుందాం...!!
Share this Article