Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బహుముఖ ప్రజ్ఞ గోఖలే… ఆ ఫ్యామిలీకి సినిమా చరిత్రలో ఓ స్పెషల్ పేజ్…

October 14, 2023 by M S R

Bharadwaja Rangavajhala………..   అబౌట్ మాదవపెద్ది …. తెలుగు సినిమా చరిత్రలో మాధవపెద్ది ఫ్యామ్లీది ఓ స్పెషల్ పేజ్. గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బ్రాహ్మణ కోడూరు గ్రామం నుంచీ రాజకీయ, సాహిత్య, సంగీత , చిత్రకళా రంగాల్లో జండా ఎగరేసిన ఫ్యామ్లీ ఇది. ఈ బ్రాహ్మణ కోడూరుతో నాకో అనుభవం ఉంది. ఆ ఊరు నుంచీ ఆ రోజుల్లో పీపుల్స్ వార్ కు చాలా మంది సింపథైజర్లు ఉండేవారు. వాస్తవానికి నేను మాధవపెద్ది గోఖలే గురించి రాద్దామనుకున్నా .. కానీ ఆయన ఒక్కడికే పరిమితం అయ్యే పరిస్థితి కనిపించలేదు.

ఆ కథలోకి దూకితే … మా. గోఖలే అలియాస్ మాధవపెద్ది గోఖలే స్వంతంత్ర సమరయోధుడు మాధవపెద్ది లక్ష్మీ నరసయ్యగారి రెండో కుమారుడు. పెద్ద కుమారుడు మాధవపెద్ది నాగేశ్వరరావుగారు. ఆయన విజయవాడ సిమెంట్ ఫ్యాక్టరీలో ఇంజనీరు. ఆయన ఇంజనీరేగానీ … పిల్లలు కళాప్రపంచంలోకి దూకేశారు.

అందులో పెద్దాడు మాధవపెద్ది రమేష్ . ఇతను కొంచెం బాలసుబ్రహ్మంలా పాడేవాడారోజుల్లో. మాధవపెద్ది బ్యాచ్ తో నందమూరి బ్యాచ్ కి ఓ స్పెషల్ రిలేషన్ ఉందనిపిస్తుంది ఈ కథ పూర్తిగా చదివితే … నందమూరి బాలకృష్ణకు అద్భుతంగా సరిపోయేది మాధవపెద్ది రమేష్ గొంతు. బాలయ్య తొలిరోజుల సినిమాల్లో ఎక్కువగా ఇతనే పాడాడు.

Ads

దానవీరశూరకర్ణలో పూర్తి నాటకాల పద్దతిలో పెండ్యాల స్వరపరచిన కలకంటినో స్వామి పాట రమేష్ చాలా బాగా పాడారు. ఆనంద్, రమేష్ ఈ ఇద్దరూ బాలు తర్వాత శ్రేణి గాయకులన్నమాట ఆ రోజుల్లో. ఈ రమేష్ తమ్ముడు సురేష్ సంగీత దర్శకుడుగా బాలకృష్ణ భైరవద్వీపం , శ్రీ కృష్ణ విజయం తదితర చిత్రాలకు పన్జేశారు.

ఇక మళ్లీ కథ మొదటికి పోతే … ఈ మాధవపెద్ది లక్ష్మీనరసయ్యగారి మూడో కుమారుడు మాధవపెద్ది సత్యం. సినీ పరిశ్రమలో చాలా పాపులర్ సింగర్. ఎస్వీఆర్ కు ఆయన పాడితే సాక్షాత్తూ రంగారావే పాడుతున్నట్టుండేది. అంతేనా రేలంగి, రమణారెడ్డి తదాదిగా గల కామెడీ టీమ్ మొత్తానికీ పిఠాపురంతో కల్సి ఆయనే పాడి రక్తి కట్టించేవాడు. కొసరాజు రాఘవయ్య గారి సాహిత్యాన్ని చక్కగా జనంలోకి తీసుకుపోయిన వాడు మాధవపెద్ది సత్యమే.

ఇతన్నీ, వీరి అన్నగారైన గోఖలేనూ సినిమాల్లోకి నడిపించినవాడు తెనాలి చక్రపాణియే. గోఖలే పూర్తి పేరు గోపాల కృష్ణ గోఖలే. లక్ష్మీ నరసయ్యగారు స్వతంత్ర సమర యోధుడు. అప్పట్లో భోగరాజు పట్టాభి, ముట్నూరి కృష్ణారావు, కోపల్లె హనుమంతరావులాంటి జాతీయ వాదుల కృషి ఫలితంగా బందరులో ఏర్పడిన ఆంధ్రజాతీయ కళాశాలలో గోఖలే చదువుకున్నారు. ఆ కాలేజీలో కళావిభాగం ప్రమోదకుమార చటర్జీ నేతృత్వంలో పని చేసేది.

చిత్రకళలో తనకున్న ఇంట్రస్టు గురించి గోఖలే కాలేజ్ ప్రిన్స్ పల్ చిల్లరిగె శ్రీనివాసరావుగారికి చెప్పారు. అలా చటర్జీ గారి దగ్గర విద్యార్ధిగా చేరిపోయారు. అక్కడ ఫౌండేషన్ కోర్సు పూర్తయ్యాక మద్రాసు వచ్చి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరాడు. దేవీ ప్రసాద్ రాయ్ చౌదరి ఆ కాలేజ్ నిర్వహిస్తూంటేవారు. అక్కడ చిత్రకళ ఆరు సంవత్సరాల కోర్సు. అయితే గోఖలే గీసిన బొమ్మలు చూసిన రాయ్ చౌదరి మూడో సంవత్సరంలో చేర్చుకున్నారు. ఆ కాలేజీ్ నుంచీ ఫస్ట్ క్లాసులో డిప్లమో తీసుకున్నారు. ఆ తర్వాత కూడా అక్కడే ఉండి శిల్పకళ కూడా నేర్చుకున్నారు.

మరి భుక్తి కోసం … గూడవల్లి రామబ్రహ్మం నేతృత్వంలో వచ్చిన ప్రజామిత్ర పత్రికలో గోఖలే కార్టూన్లు వేసేవారు. అలా రామబ్రహ్మంగారితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత గూడవల్లి తీసిన రైతుబిడ్డ చిత్రానికి గోఖలేను కళాదర్శకుడుగా తీసుకున్నారు. అలా కళాదర్శకుడుగా రైతుబిడ్డ ఆయనకు తొలి చిత్రం.

ఆ రోజుల్లో కళాదర్శకత్వానికి అంత ప్రాధాన్యత ఉండేది కాదు. అన్ని పన్లూ వీరే చూసుకోవాలసి వచ్చేది. సెట్సూ గట్రా గట్రా అన్నీనూ … ఇలా గోఖలే నిర్విరామంగా రోజుకు పద్దెనిమిది గంటలు కూడా పనిచేయాల్సి వచ్చేది. ఈ పనితో పాటు ఆంధ్రపత్రిక, భారతి పత్రికల్లో గోఖలే బొమ్మలు వేసేవారు. కాశీనాథుని నాగేశ్వర్రావు గారు బాగా ప్రోత్సహించేవారు.

శివలెంక శంభుప్రసాద్ గారు 1940లో గోఖలేని ఆంధ్రపత్రికలో చీఫ్ ఆర్టిస్టుగా రిక్రూట్ చేశారు. అయితే ఉద్యోగంలో కళాకారుడు ఎప్పుడూ పెద్దగా ఇమడడు కదా అలా ఆయన అక్కడ ఆ పదవిలో ఎక్కువ కాలం లేడు పాపం. ప్రపంచ యుద్ద భయం వల్ల గోఖలే మద్రాసు వదిలేసి తెనాలి వెళ్లిపోయారు. ఇది గోఖలే జీవితంలో ఓ అద్భుతమైన టర్నింగు.

తెనాలిలో మేనమామ వరసయ్యే కొడవటిగంటి కుటుంబరావు దగ్గర ఎక్కువ సమయం గడిపేవాడు. అక్కడ చక్రపాణి తదితరులతో పరిచయం. వాళ్లతో సాహిత్య చర్చలు చేసే సందర్భంలో కథలు రాయాలనే ఆలోచన కలిగింది. అలా కథకుడు అయ్యారాయన. గోఖలేను తిరిగి మద్రాసు రైలెక్కించిన ఘనత చక్రపాణిదే.

అలా మద్రాసు తిరిగి వచ్చి చక్రపాణి సంపాదకత్వంలో వచ్చిన ఆంధ్రజ్యోతి పత్రికలో చిత్రకారుడుగా చేరారు. అక్కడే అంటే ఆంధ్రజ్యోతిలోనే పామరభాషలో కథలు రాస్తూ ఉండేవారు. అనగా ముళ్లపూడి వారిలా… యమ వ్యవహారిక మాటలతో రాయడం ప్రారంభించారు. ముఖ్యంగా గుంటూరు మాండలికంలో… ఈ రచనలు చాలా పాపులర్ అయ్యాయి. గోఖలే కథలు విశాలాంధ్రవారు చాలా సార్లు అచ్చేశారు.

గోఖలే అనగానే గుర్తుచ్చే సంఘటన కాటూరు ఎలమర్రు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి బాసటగా నిల్చారని కాటూరు యలమర్రు గ్రామాలపై నెహ్రూ ప్రభుత్వ పోలీసులు దాడి చేసి గ్రామస్తులను దిగంబరంగా గాంధీ విగ్రహాల చుట్టూ తిప్పి కొట్టిన ఘటనను గోఖలే చిత్రీకరించారు. అది అప్పట్లో చాలా పెద్ద కాంట్రోవర్సీ అయ్యింది. ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలా కాంగ్రెస్ పాదులో ప్రారంభమైన నడక వామపక్ష మార్గానికి మళ్లింది.

May be an image of 1 person

గ్రామీణ వాతావరణాన్ని ముఖ్యంగా బాల్యాన్ని గోఖలే చాలా చిక్కగా చిత్రీకరించారు. ఆయన కథల్లో గొడ్లు కాచుకునే పిల్లలు. పొలాల్లో రైతులు … కడవలు పెట్టుకుని అలా నడుచుకుపోయే అమ్మాయిలు … మొత్తగా శ్రమైక జీవన సౌందర్యం మాత్రమే కాదు … దోపిడీని సవివరంగా ఆవిష్కరించడం గోఖలే కథల ప్రత్యేకత.

అలా ఆంధ్రజ్యోతిలో పన్జేస్తూ … కమ్యూనిస్టు పార్టీ పత్రిక ప్రజాశక్తిలోనూ కొంతకాలం కథ నడిపారు. యాభైలో నాగిరెడ్డి చక్రపాణి వాహినీలో షేర్లు కొనేసి విజయా సంస్ధ ప్రారంభించినప్పుడు చక్రపాణి నేతృత్వంలో మళ్లీ కళాదర్శకుడు అవతారం ఎత్తారు గోఖలే. ఆ కంపెనీలో షావుకారు నుంచీ జగదేకవీరుని కథ వరకూ పన్జేశారు.

జగదేకవీరుని కథ తర్వాత కంపెనీ ఉద్యోగానికి నమస్తే అనేసి ఆ తర్వాత బయట చిత్రాలకూ పనిచేశారు. వాటిలో మహామంత్రి తిమ్మరసు తదితర చిత్రాలున్నాయి. ఎన్టీఆర్ ఆఫ్ క్రౌన్ పెడితే కృష్ణుడుగా బాగోడనీ … ఫుల్లు క్రౌన్ వాడితే అతనే కృష్ణుడని అనుకునే ఛాన్సెస్ బలంగా ఉన్నాయని చెప్తూ స్కెచ్చెస్ వేసి నందమూరి తారక రామారావును పౌరాణికాల హీరోని చేసిన వాడు గోఖలే. అలాగే గోఖలే అనగానే ఠక్కున గుర్తొచ్చే బొమ్మ బ్రహ్మనాయుడుది.

ముందు ఒర కత్తి పెట్టుకుని ఆలోచనల్లో మునిగిపోయిన మట్టి రంగు బొమ్మ బ్రహ్మనాయుడు చాలా పాపులర్. డెబ్బై ఎనిమిది నుంచీ ఎనభై రెండు మూడు మధ్య చాలా మంది ప్రభావవంతమైన తెలుగు కవులు రచయితలు కళాకారులు కన్నుమూశారు. ఆ లిస్టులో చలం, కృ.శా, శ్రీశ్రీ , కొకు గోఖలే ఉన్నారు. 1981 అక్టోబర్ నెల్లో కన్నుమూశారు గోఖలే. తెలుగు సమాజానికి రంగస్థల రాజకీయ సాహిత్య సంగీత రంగాల్లో సేవ చేసిన ఇంటిపేరు మాధవపెద్ది. అన్నట్లు వీళ్లు మా బ్రాహ్మలే అనుకుంటానండోయ్ .. లేకపోతే నేనింత రాస్తానా నా బొంద … గోఖలేగారి ఫొటో కనిపించగానే ఇలా రెచ్చిపోయానంటే ఇది ఖచ్చితంగా పోగుబంధమే సుమీ …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions