శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి… ఈ నానుడిని నిజం చేసి తన సంగీతంతో శిశు, పశు, పాములను తన్మయత్వంలో ముంచెత్తిన పద్మవిభూషణుడు పండిట్ జస్రాజ్. అలాంటి మహానుభావుడి బాల్యానికి కేరాఫ్ మన భాగ్యనగరం. ఆ భాగ్యాన్ని భాగ్యనగరంతో పంచుకున్న ఆ బడి డ్రాపవుటే.. బడా సంగీతకారుడై.. సాగిన ఆ జర్నీలో హైదరాబాద్ తో ఆయనకున్న ఆ అనుబంధమేంటో ఓసారి ఆయన మాటల్లోనే చెప్పుకుందాం.
మా తండ్రి మోతీరామ్ ప్రముఖ సంగీతకారుడు. నా నాల్గో ఏటనే మా తండ్రిని కోల్పోవడం మాకు మిగిలిన తీరని క్షోభ. ఇంకా నాకు గుర్తుంది. మధ్యాహ్నం భోజనం కాగానే.. జస్రాజ్ ఆజావో అని తాను పడుకోని.. తన బొత్తపై నన్ను కూర్చోబెట్టుకుని సంగీతం పాడేవారు. అప్పుడప్పుడే ముద్దుముద్దు మాటలు పలికే నాతో ఆ కీర్తనలు పాడించే ప్రయత్నం చేస్తూ.. అలా సరదాగా సాయంకాలం నాల్గున్నర ఐదింటివరకూ మా నాన్నతో గడిచిన మసక మసక తీపి జ్ఞాపకాలు ఇంకా నా మదిలో అలాగే ఉన్నాయి.
ఉస్మాన్ అలీఖాన్ మందిరంలో ఆస్థాన విద్వాంసుడిగా మా నాన్నను రాయల్ మ్యుజీషియన్ గా ప్రకటించే ఐదారు గంటల ముందే.. అదే రోజు మానాన్న గొంతు మూగబోయింది. మా నాన్న లేరన్న వార్త మమ్మల్ని కలిచివేసింది. నిజంగా ఆయన అదే ఆస్థానంలో స్టేట్ మ్యుజీషియన్ గా కొనసాగి ఉంటే గనుక.. మా కుటుంబం మరో స్థాయిలో ఉండేది. కానీ, మా నాన్న పోతూపోతూ మాకు మిగిల్చిన దిక్కులేని స్థితి మాత్రం.. మాలో అలజడి రేపిందంటూ.. నాణానికి రెండోవైపు కొన్ని చేదు జ్ఞాపకాలనూ తన సన్నిహితులతో పంచుకునేవారట జస్రాజ్.
Ads
1972 నుంచి హైదరాబాద్ వేదికగా పండిట్ మోతీరామ్, ఆయన సోదరుడు పండిట్ మణిరామ్ పేరిట నిర్వహించే సంగీత్ సమారోహ్ కార్యక్రమానికి వచ్చే జస్రాజ్ కుటుంబ సభ్యులు.. గోల్నాకలో ఉన్న తండ్రి సమాధి వద్ద ఉదయమే నివాళులర్పించేవారు. అలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందుస్థానీ వోకల్ ఆర్టిస్ట్ గా పేరెన్నికగన్న జస్రాజ్ తన తండ్రితో, తన సోదరులతో.. అంతకుమించి, హైదరాబాద్ తో తనకన్న ఎన్నో అనుబంధాలను నెమరు వేసుకోవడంలోనే ఒక అనుభూతిని ఆస్వాదించేవారట.
అయితే, మా తండ్రి మరణం తర్వాత మా కాకైన పండిట్ జ్యోతిరామ్.. మా సొంత గ్రామమైన హర్యానాలోని హిసార్ జిల్లా మండోరికి వెళ్లిపోదామని పట్టుబట్టారు. కానీ, మా అమ్మ అంతకుమించి భీష్మించింది.. వద్దని వారించింది. మా నాన్న మరణం తర్వాత మా పెద్దన్నే మాకు అన్నా, నాన్న అన్నీ అయ్యాడు. మా అమ్మ కూడా మా నాన్నంత ఘనత సాధిస్తాడన్న నమ్మకాన్ని మా అన్నపై పెట్టుకుంది. ఆ తర్వాత ఆయనే మొత్తం కుటుంబ పోషణ చూసుకున్నారు. అలా జాంబాగ్ పళ్ల తీపిని.. ఇక్కడి మార్కెట్ కొచ్చే పూల గుబాళింపునూ ఆస్వాదిస్తూ.. వివేకవర్ధినీ స్కూల్ లో చదువు కొనసాగిస్తూ.. నా బాల్యం గడిచింది.
కానీ చదువుపై మాత్రం నాకంత ఆసక్తి ఉండేది కాదు. అసలు వివేకవర్థినీ స్కూల్ కు పోతేకదా..? రోజూ బడి తప్పించుడే! ఎందుకంటే మార్గమధ్యంలో ఉన్న యాకుబియా అనే ఓ చిన్న రెస్టారెంట్ నన్నక్కడకు అయస్కాంతంలాగా లాగేసేది. ఎందుకంటే వేరే ఏ పాటలూ లేనట్టూ… అక్కడ కేవలం దిగ్గజ గజల్ సంగీతకారిణైన బేగం అక్తర్ పాడిన దివానా బనాహైతో దివానా బనాదే… వర్నా కహీ తక్దీర్ తమాషా నా బనా దే అనే జలపాతంలా జారే ఆ గజల్ మాత్రమే వినిపిస్తుండటం.. అది అంతకంతకూ నన్ను ఆకర్షిస్తుండటంతో.. సంగీతమంటే ఇంత స్నూతింగ్ గా ఉంటుందా అనుకునేవాడిని.
బడికని చెప్పి యాకూబియా రెస్టారెంట్ కు వెళ్లడం.. బేగం అక్తర్ గజల్ కు మెస్మరైజవుతూ పొద్దస్తమానం ఆ పాటే వింటూ గడపడం.. నా దినచర్యగా మారింది. పిల్లవాణ్ననేమోగానీ.. ఆ రెస్టారెంట్ వాళ్లు కూడా అవసరమైతే మంచినీళ్లివ్వడం… ఆకలవుతుందా బాబూ అంటూ పాటల పట్ల నా అనురక్తిని గమనించి తినడానికి ఏదైనా ఇవ్వడమూ చేసేవారు. కానీ, ఓ ఏడాదివరకూ చూసింతర్వాత ఈ పిల్లోడు బడికి వెళ్లడంలేదు.. రోజూ మా రెస్టారెంట్ కు వచ్చి పాటలు వింటున్నాడు.. మీరేమో ఇతను బడికి వెళ్తున్నారనుకుంటున్నారని.. చివరకు మా అమ్మకు మొత్తం విషయం చెప్పేశారు. ఇలాగైతే ఇక నా చదువు అటకెక్కినట్టేనని గ్రహించిన మా రెండో అన్న.. నా ఆసక్తిని గమనించి అప్పుడే తబలా నేర్పించాడు.
అలా ఏడాదిలోనే తబలాలో మంచి నడక సాధించిన నేను.. ఏడేళ్లకే సోదరులతో కలిసి కాన్సర్ట్స్ కు వెళ్తూ నా సంగీత ప్రయాణాన్ని ప్రారంభించాను. అలా భాగ్యనగరంలోని మీర్ ఉస్మాన్ అలీఖాన్ వద్ద ప్రస్తుత బాలీవుడ్ సంగీత ద్వయమైన జతిన్-లలిత్ తండ్రైన తన మరో సోదరుడు ప్రతాప్ నారాయణ్.. స్టేట్ మ్యుజీషియన్ గా అపాయింట్ కావడంతో ఆయనకు తోడుగా వెళ్లేవాడిని. మా అన్నలైన పండిట్ మణిరామ్, ప్రతాప్ నారాయణ్ దగ్గర తబలాలో నిష్ణాతుడయ్యాను.
ఆరోజుల్లో హైదరాబాదీలకు తబలా వాద్యమంటే మక్కువెక్కువ. ఇప్పటికీ ఆ క్రేజ్ కనిపిస్తూనే ఉంది. పెద్దపెద్ద నవాబుల్లో కొందరు వినడానికి ఆసక్తి కనబరిస్తే.. మరికొందరు స్వయానా తబలా వాయిస్తూ తన్మయత్వంలో మునిగిపోయేవారంటూ తన జ్ఞాపకాలను గుదిగుచ్చేవారు జస్రాజ్. అలా సాలార్జంగ్ కు ఇష్టమైన దివాన్ దేవ్డీలో మూడు, నాల్గుసార్లు తనకు తబలా వాయించే అవకాశం వచ్చింది. ఒక్కో గది రంగురంగుల దీపకాంతుల్లో మెరిసిపోతుంటే.. అంతకుమించిన ధవళ వస్త్రాల్లో సాలార్జంగ్ మెరిసిపోయేవారు. ఒక్కో గదిలో కాస్సేపు తబలా వాద్య కచేరీ జరిగేది. అలా ఎన్ని గదుల్లో వాయిస్తే.. అన్ని గదుల్లో ఒక్కో గదికి.. ఒక్కో గంట చొప్పున లెక్క కట్టి మరీ డబ్బులిచ్చేవారు నాటి నవాబులు. ఎంతైనా వాళ్లు నవాబులు కదా..?! అంటూ ఛలోక్తులు విసిరేవారు జస్రాజ్!!
అక్కడ కట్ చేస్తే… దేశ స్వాతంత్ర్యోద్యమం తీవ్రమైన వేళ అది. 1946 కాలమది. అప్పటి నవాబులతో సహా.. చాలామంది తెలిసినవారు తమను హైదరాబాద్ వదలి వెళ్లిపోమ్మని ఒత్తిడి తీసుకొచ్చారు. ఏదైనా జరగరానిది జరిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తామెవ్వరం కూడా మీకు ఉపయోగపడకపోవచ్చు అందుకే వెళ్లిపోండంటూ నిక్కచ్చిగా చెప్పేశారు. అయితే, అలాంటి పరిస్థితులను మేం 1944 నుంచీ చూస్తూ వస్తున్నాం. ఇక 1946లో మాత్రం పూర్తిగా హైదరాబాద్ ను విడిచిపెట్టాల్సి వచ్చింది.
అలా సంక్లిష్టతలెదురైనప్పుడు గుజరాత్ సనందలోని మహారాజ్ జయవంత్ నాకు గురువయ్యారు. ఓ గైడ్ అయ్యారు. అలాగే, నా తండ్రి తర్వాత తండ్రైన కాక పండిట్ మణిరామ్ కూడా నాకు గురువయ్యాడు. అదే సమయంలో ఆయనతో జగడాలు ఉండేవి. ఒక కీర్తనను నైపుణ్యంతో ఆలపించడమంటే అదంత సులభం కాదు. ఆయన నాకు అలా నేర్పడంలేదేమోనని నేను అనుమానించేవాణ్ని కూడా. కానీ, మా బాబాయ్ పట్ల ఆ శంఖని మహారాజ్ జయవంతే తీర్చారు.
దసరా నవరాత్రుల్లో ఒకసారి నవమి పూజ జరిగే సమయంలో ఆయన దేవీ పూజా మందిరంలోకి వెళ్లుతూ.. నేను పూజ చేస్తున్నంతసేపూ నీవిక్కడ జాన్ పురి రాగమాలపిస్తూ ఉండూ అంటూ లోనికి వెళ్లిపోయారు. అలా నేను పాడుతూనే ఉన్నాను. ఆయన పూజ చేస్తూనే ఉన్నారు. బయటకొచ్చిన ఆయన నాకొక పేడా తీసుకొచ్చి ఇచ్చారు. నీ ఆలాపన ఈ పేడా అంత తీయగా ఉంది. దీనికి కారణం మీ సోదరుడు మణిరామే. కాబట్టి మణిరామ్ తో గొడవ పెట్టుకోవడం సరికాదంటూ నాకు జ్ఞానబోధ చేసిన గురుతుల్యులు మహారాజ్ జయవంత్ అంటూ హైదరాబాద్ లోని తన చిన్ననాటి దోస్తులకు ఈ ముచ్చట్లన్నీ చెప్పేవారు జస్రాజ్.
అలా తన ఆధ్యాత్మిక గురువైన మహారాజ్ జయవంత్ మరణానంతరం.. జస్రాజ్ తన కుటుంబీకులతో కలిసి కలకత్తా పయనమయ్యారు. అక్కడే ఆల్ ఇండియా రేడియోలో ప్రొఫెషనల్ హిందుస్థానీ ఓకల్ సింగర్ గా తన మరో ప్రస్థానాన్ని ప్రారంభించిన జస్రాజ్.. 13 ఏళ్ల తర్వాత ముంబైకి పయనమయ్యారు. తన మొదటి సంగీత కచేరీని 1952లో నేపాల్ రాజైన త్రిభువన వీర విక్రమ్ సభతో ప్రారంభించిన పండిట్ జస్రాజ్.. ఆ తర్వాద పద్మశ్రీగా.. పద్మభూషణుడిగా.. పద్మవిభూషణుడిగా అంచెలంచెలుగా ఎదిగిన తీరు.. ఆకాశానికి నిచ్చెన వేసినట్టుగా సాగిన ఆయన సంగీత ప్రయాణం.. రెస్ట్ ఆఫ్ లైఫ్ ఇక అందరికీ తెలిసిందే.
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనన్నట్టుగా.. బాల్యస్మృతుల విషయంలోనూ ఎవరికైనా అవి ఒకటే! అలాగే, హైదరాబాదంటే సంగీత రారాజైన స్వర్గీయ జస్రాజ్ కు అదో విడదీయలేని ఆత్మీయ స్మృతి, మురిపెం, మమకారం. అందుకే హైదరాబాదీల తరపున ఆ స్వరమాంత్రికుడిని మరోసారి తల్చుకుంటూ.. జస్రాజ్ యాదిలో! (మొన్నటి 17 ఆయన వర్ధంతి… రమణ కొంటికర్ల)
Share this Article