తెలుగు దేశంలో లుచ్ఛా ఎం.ఎల్.ఏ.లు! ది డర్టీ పొలిటికల్ క్రూక్ భవనం వెంకట్రాం! అజ్ఞాని జైల్‌సింగ్ రాష్ట్రపతా? హ్హి! హ్హి! హ్హి! ఎన్టీవోడు రాత్రిళ్ళు చీరెందుకు కడుతున్నాడు? అమ్మోరి సొమ్ము కమ్మోరికే!
ఈ తరహా హెడ్డింగులతో 1980 నుండి 1985 వరకు ఒక పత్రిక ఆంధ్రప్రదేశ్‌లో వుండేది. ఆ పత్రిక పేరు ‘‘ఎన్‌కౌంటర్.’’ ఎడిటర్ పేరు ‘పింగళి దశరథరామ్’. యెనభయ్యవ దశకంలో అప్పటి యువతరంలో రాజకీయ సామాజిక చైతన్యం రగిలించిన ముగ్గురు యువకులు గద్దర్, కత్తి పద్మారావు, పింగళి దశరథరామ్‌లు. గద్దర్ పాట, పద్మారావు మాట, దశరధ రామ్ రాత అప్పటి కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల గుండెల్లో దడపుట్టించాయి.
పింగళి దశరధరామ్ 23 సంవత్సరాల వయసులోనే ఎన్‌కౌంటర్ పక్ష పత్రికను స్థాపించాడు. అప్పటి వరకు పత్రికల్లో గౌరవంగా సంబోధింపబడుతున్న రాజకీయ నాయకుల్ని లోఫర్లు, డాఫర్లు, కేడీ గాళ్ళు, నంగి వెధవలు అని తిడుతూ రాసిన రాతలకు యువకులు బహుగా ఆకర్షితులయ్యేవారు. రాజకీయ నాయకుల వ్యక్తిగత విషయాల ప్రస్తావన (అక్రమ సంబంధాలతో సహా) సామాన్య పాఠకులకు ఆకర్షణీయంగా వుండేది. లక్షకాపీలతో వెలువడిన ఎన్‌కౌంటర్ పత్రిక ఎడిటర్ పింగళి దశరథరామ్ చదువుకొన్నది కేవలం తొమ్మిదో తరగతి. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య చిన్న కొడుకు హేరంబ చలపతిరావు ఏకైక పుత్రుడు దశరథరామ్. తల్లి జానకమ్మ. హేరంబ చలపతిరావు మిలటరీలో పనిచేస్తూ చనిపోయాడు. ఆ తరువాత దశరధరామ్ తన తాత పింగళి వెంకయ్య దగ్గర పెరిగాడు.
Ads
స్వాతంత్య్ర సమర యోధుడు పింగళి వెంకయ్య సంరక్షణలో పెరగటం వలన దశరధరామ్‌కు బాల్యంలోనే రాజకీయాలపట్ల ఆసక్తి కలిగింది. పదహారేళ్ళ వయసులోనే జై ఆంధ్ర ఉద్యమకారుల్ని యెదిరించి ‘విశాలాంధ్ర’ పత్రికను గ్రామాలకు చేరవేశాడు. ఎమర్జెన్సీ (1975 జూన్ 25న) విధించి ప్రజల్ని కాల్చుకు తింటున్న ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలో జరిగిన ‘‘సంపూర్ణ విప్లవం’’ ఉద్యమంపట్ల దశరధరామ్ ఆకర్షితుడయ్యాడు. జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో అనేకమంది వీధుల్లోకొచ్చి పోరాటాలు చేశారు.
వాళ్ళనందరిని జైళ్ళల్లో పెట్టించింది ఇందిరాగాంధి. ఈ ఉద్యమాన్ని బలపరుస్తూ దశరధరామ్ ‘జనసంఘర్ష్’ సమితిని నెలకొల్పాడు. 18 ఏళ్ళ వయసులోనే దశరధ్‌రామ్ మీసా చట్టం క్రింద అరెస్టు అయ్యాడు. జైలులో వున్నపుడు అనేక మంది రాజకీయ నాయకుల్ని దగ్గరగా గమనించాడు. వాళ్ళ అసలు రంగు తెలుసుకున్నాడు. జైలు నుండి విడుదల అయిన తరువాత బతకడం కోసం హోటల్ సర్వర్‌తో సహా అనేక చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు.
1972లో వినుకొండ నాగరాజు స్థాపించిన ‘కమెండో’ పక్ష పత్రికలోనూ, సి.నరసింహారావు సంపాదకత్వంలో ‘రేపు’ మాసపత్రికలో, పనిచేసి పత్రిక నడపడంలోని మెళుకువలు తెలుసుకున్నాడు. 1979 నవంబర్‌లో ఒక స్నేహితుడు ఇచ్చిన ఐదువందల రూపాయలతో పాటు తల్లి జానకమ్మ తన కుట్టు మిషన్ తాకట్టు పెట్టి ఇచ్చిన డబ్బుతో 23 ఏళ్ళ వయసులో ‘ఎన్‌కౌంటర్’ పక్ష పత్రికను స్థాపించాడు. కేవలం రెండు వేల సంచికలతో ప్రారంభమైన పత్రిక లక్ష కాపీల సర్క్యులేషన్‌తో నడిచింది. గిట్టిన వాళ్ళు, గిట్టనివాళ్ళు అందరూ చివరి పేజీ వరకు వదలకుండా చదివే వాళ్ళు. తెలుగులో ఒక్క ‘కమెండో’ పత్రిక మాత్రమే ఈ తరహాలో నడిచేది. అంతకు ముందు ములుకోలు, ఖాసా సుబ్బారావు నడిపిన ‘తెలుగు స్వతంత్ర’ నిశితంగా విమర్శించే రాజకీయ పత్రికలుగా వుండేవి.
ప్రజా బలం లేని భవనం వెంకట్రామ్‌నే కాదు. జనాకర్షణ వున్న ఎన్టీ రామారావును కూడా ఘాటైన పద జాలంతో విమర్శించేవాడు దశరధరామ్. ఎన్టీ రామారావు ప్రసంగాల్లోనూ, ప్రవర్తనలోనూ వుండే నాటకీయతను తూర్పార బట్టేవాడు. 1983 వరకు కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించి ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశంతోనూ అదే వైఖరితో వున్నాడు. ఎన్‌కౌంటర్‌లో వచ్చిన కథనాలూ, ఉపయోగించిన భాషనూ చదివిన ప్రతివారికీ యితన్ని బతకనిస్తారా అనిపించేది. ప్రతి రాజకీయ సంఘటన, మారుతున్న పరిణామాల వెనుక దాగిన రహస్యాలు తెలుసుకోవడానికి పాఠకులు ఎన్‌కౌంటర్ కోసం ఎదురు చూసేవాళ్ళు.
ఎన్‌కౌంటర్ చదవడానికి అలవాటుబడ్డ పాఠకులకు దినపత్రికల్లో వచ్చే వ్యాసాలు తృప్తినిచ్చేవికావు. నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్‌తో చేతులు కలిపి అప్పటి గవర్నర్ రామ్‌లాల్ సహకారంతో ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి కుర్చీ నుండి కూలదోసినప్పుడు కాంగ్రేసేతర ప్రతిపక్షాలన్నీ యేకమై రామారావుకు అండగా నిలిచాయి. అందరూ ఐక్యమై రాష్ట్రమంతా తిరిగి బహిరంగ సభలు పెట్టారు. ఫలితంగా గవర్నర్ పదవికి రామ్‌లాల్‌చేత రాజీనామా చేయించి శంకర్ దయాళ్ శర్మను గవర్నర్‌గా నియమించి తిరిగి రామారావును ముఖ్యమంత్రిని చేశారు.
ఈ సంఘటన తరువాత ఎన్‌కౌంటర్ చాలా ఆలస్యంగా మార్కెట్‌లోకి వచ్చింది. రామారావు ప్రజాదరణ చూసి ఇందిరాగాంధి వెనక్కి తగ్గి తిరిగి ముఖ్యమంత్రిని చేసిందని ప్రజల్లో వున్న అభిప్రాయానికి భిన్నంగా ‘‘ఇందిర కాళ్ళ చెంత తెలుగువాడి ఆత్మగౌరవం’’ అనే హెడ్డింగ్‌తో పార్టీలకతీతంగా కమ్మవాళ్ళంతా ఏకమైన వైనాన్ని అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ మధ్యవర్తిగా వుండి కొన్ని షరతులకు రామారావు వొప్పుకున్న తరువాతే ఇందిర తిరిగి రామారావును ముఖ్యమంత్రిని చేసిన తెరవెనుక కథనాన్ని ఆధారాలతో సహా దశరధరామ్ రాశాడు.
పాఠకురాలితో ప్రేమ వివాహం :
ఎన్‌కౌంటర్ పత్రిక చదివే వాళ్ళు దశరధరామ్‌కు 50 ఏళ్ళు పైబడి వుండవచ్చు అని అనుకొనేవాళ్ళు. కాని అప్పటికి పెళ్ళి కూడా కాలేదని చాలామందికి తెలియదు. రాష్ట్రంలో దశరధరామ్‌ను అభిమానించే యువతీ యువకుల సంఖ్య పెద్దదే. వాళ్ళల్లో దశరథరామ్ ఇంటి పక్కనే వున్న మామిడాల సుశీల ఒకరు. సుశీల తమ్ముడు (రమణ) దశరధరామ్ స్నేహితుడు. రమణ ద్వారానే దశరధరామ్ పరిచయమయ్యాడు. ఎన్‌కౌంటర్ పత్రిక వీరాభిమాని అయిన సుశీల దశరథరామ్‌ను ప్రేమించింది. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకొన్నారు. కానీ దశరథరామ్ వ్యవహారశైలి తెలిసిన సుశీల తల్లిదండ్రులు మొదట ఒప్పుకోలేదు.
సుశీల పట్టుదలచూసి చివరకు ఒప్పుకున్నారు. 1981లో వీళ్ళ వివాహం అయింది. సన్నిహితంగా వుండే మిత్రుల సమక్షంలో దండలు మార్చుకున్నారు. సుశీల తండ్రి శుభలేఖలు పంచి సాంప్రదాయం ప్రకారం పెళ్ళి చెయ్యాలనుకున్నాడు. కానీ దశరథరామ్ అందుకు అంగీకరించలేదు. కట్నం ఇవ్వజూపినా తిరస్కరించాడు. దశరథరామ్‌కు ముగ్గురు పిల్లలు. చైతన్య, అన్వేష్, దశరధరామ్. దశరథరామ్ చనిపోయేనాటికి సుశీల ఆరు నెలల గర్భవతి. ఆ తరువాత పుట్టిన కొడుక్కి దశరథరామ్ అని పేరు పెట్టుకొంది.
సంచలన కథనాలు :
ఎన్‌కౌంటర్ పత్రిక మొత్తం దశరథరామే రాసేవాడు. పత్రికలో ప్రచురితమైన ప్రతి కథనమూ ప్రాణాలకు తెగించి రాసిందే మంత్రుల్నీ, ముఖ్యమంత్రుల్నీ, ఉన్నత స్థానాల్లో వున్న అధికారుల్ని వాడు, వీడు అనే రాసేవాడు. రామారావు అధికారంలో ఉన్న కాలంలో డిఐజిగా పనిచేసిన అప్పారావును ‘‘అసలు ఎవడీ అప్పారావు వీడు ప్రభుత్వ జీతగాడా లేక ప్రభుత్వాధినేతా? కేవలం ప్రజల పన్నులతో కూలి తీసుకొంటున్న కూలీ మాత్రమే’’ అని రాశాడు.
తెనాలిలో కొత్త బస్టాండ్‌కు దగ్గరలో లక్ష్మీ డీలక్స్ అనే సినిమా హాలు వుంది. కొణిజేటి రోశయ్య ఈ హాలు పార్టనర్. లక్ష్మీ డీలక్స్ ప్రారంభోత్సవానికి ముందుగా హాలులో నరబలి జరిగింది. తెనాలికి సమీపంలోని కఠెవరం గ్రామానికి చెందిన శివారెడ్డి అనే 14 సంవత్సరాల బాల కార్మికుడిని బలి ఇచ్చిన ఈ సంఘటన ఎన్‌కౌంటర్‌లో అచ్చయింది. ఎన్‌కౌంటర్ కథనాన్ని ఉదహరిస్తూ శాసన మండలిలో ప్రతిపక్షాలు గొడవచేశాయి. ‘‘రోశయ్య హాలులో నరబలి’’ శీర్షికతో వచ్చిన ఎన్‌కౌంటర్ సంచికల్ని మార్కెట్లో నుండి ముందుగానే కొనేసి కాల్చేసారు. ఇది తెలుసుకున్న దశరధరామ్ రెండు వేల కాపీలు రిక్షాలో పెట్టుకొని తెనాలి బస్టాండ్ నుండి టౌన్ చివర స్వరాజ్ టాకీస్ వరకు ఎదురైన వాళ్ళందరకూ ఉచితంగా పంచుకొంటూ వెళ్ళాడు.
నాదెండ్ల భాస్కరరావు, ఎన్టీ రామారావు ప్రాంతీయ పార్టీ పెట్టబోతున్నారని ఎన్‌కౌంటర్‌లో ముందుగా వచ్చింది. ఎన్టీ రామారావును దించి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా ఇందిరాగాంధి నియమించనున్నదని ‘‘ఇందిరా ముఖ్యమంత్రిగా నాదెండ్ల’’ అనే శీర్షికతో ఎన్‌కౌంటర్ బయట పెట్టింది.
‘
‘బిల్లా’పై స్టాంపు:
1975`77 మధ్య కాలంలో ఎమర్జెన్సీని కారణంగా చూపి అపరిమిత అధికారాలతో సంజయ్‌గాంధి చేసిన అకృత్యాలు, అతని అండ చూసుకొని అతని మిత్రులు చేసిన ఘోరాలు అన్నీ ఇన్నీ కావు. ఈ కారణంగానే 77 ఎన్నికల్లో కాంగ్రెస్ వోడి జనతా పార్టీ వచ్చింది. జనతా పతనం తరువాత కాంగ్రెస్ తిరిగి అధికారంలో కొచ్చిన కొద్ది కాలానికే సంజయ్ గాంధీ స్వయంగా విమానం నడుపుతూ అది కూలిపోయి దుర్మరణం పాలయ్యాడు. అతని మరణానంతరం పోస్టల్ డిపార్ట్‌మెంట్ సంజయ్ గాంధీ మీద స్టాంపు విడుదల చేసింది. దీనికి నిరసనగా దశరధరామ్ ఢల్లీికి చెందిన హంతకుడు ‘బిల్లా’ ఫోటోతో స్టాంప్ తయారు చేశాడు.
నావికా దళంలో పనిచేసే ఉన్నతోద్యోగి పిల్లలయిన గీతా చోప్రా ` సంజయ్ చోప్రాను 1978 ఆగష్టు 26న బిల్లా (జస్బీర్ సింగ్) రంగా (ఖుష్ కుల్జీత్‌సింగ్) డబ్బుకోసం కిడ్నాప్ చేసి హతమార్చారు. ఈ కేసు అప్పట్లో చాలా సంచలనం కలిగించింది. హంతకులిద్దరూ బిల్లా రంగాలుగా ప్రసిద్ధి (ఈ పేర్లు తెలుగులో చిరంజీవి ` మోహన్‌బాబుల పాత్రలకు పెట్టి అదే టైటిల్‌తో సినిమా తీశారు). ఆ తరువాత 1982లో వీళ్ళిద్దరినీ విచారించి మరణశిక్ష విధించి ఉరితీశారు. గీతా సంజయ్‌ల దారుణ హత్యల కారణంగా 1978లో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో అధికార జనతా పార్టీ ఓడిపోయింది.
బిల్లా`రంగాలు దేశ ప్రజల దృష్టిలో కరుడుగట్టిన నేరస్థులుగా ముద్రపడ్డారు. వాళ్ళల్లో ఒకడైన బిల్లాపై స్టాంపును తయారుచేసి సంజయ్ గాంధీ స్టాంపుకు పోటీగా దశరధరామ్ పంచాడు. బిల్లా స్టాంపులను అంటించిన ఉత్తరాలను పోస్టల్ డిపార్ట్‌మెంట్ డెలివరీ చేసింది. దశరథరామ్‌పై పోస్టల్ డిపార్ట్‌మెంట్ కేసు పెట్టింది. కానీ ఈ కేసులో దశరథరామ్‌ను నిర్దోషిగా కోర్టు తీర్పు చెప్పింది.
పదిరి కుప్పం ` కారంచేడు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుండి అది యెంతటి కుల తత్వ పార్టీ అయినదీ దశరధరామ్ అనేక ఉదాహరణలతో ఎన్‌కౌంటర్ ప్రతి సంచికలో రాసేవాడు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తొలిరోజే చిత్తూరు జిల్లా పాదిరి కుప్పంలో ఆ పార్టీకి ఓటు వెయ్యలేదనే నెపంతో దళితుల మీద దాడి జరిగింది. ముఖచిత్ర కథనంతో ఎన్‌కౌంటర్‌లో ఈ దాడి గురించి దశరధరామ్ రాశాడు. పదిరికుప్పం బాధితులకు ఆర్థిక సహాయం కూడా చేశాడు.
ఆ తరువాత రెండేళ్ళకు జరిగిన కారంచేడు నరమేధం గురించి తెలుసుకొని భార్య నగలు అధిక వడ్డీకి తాకట్టు పెట్టి వీడియో కెమెరా అద్దెకు తీసుకొచ్చి బాధితుల స్టేట్‌మెంట్లను వీడియో తీశాడు. ‘‘కారంచేడులో మారణ హోమమ్’’ హెడ్డింగ్ ` ఎర్రటి అట్టతో వచ్చిన ఎన్‌కౌంటర్‌లో మొత్తం సంఘటనను వివరంగా రాశాడు. ఆ తరువాత వచ్చిన ఎన్‌కౌంటర్‌లో 77 మంది నిందితుల జాబితాను రాసి వాళ్ళను వెంటనే అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశాడు. 1985 సెప్టెంబర్ 1న కారంచేడు సంఘటనపై చీరాలలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించాడు.
ఇక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా దాదాపు ప్రతి సంచికలో ఒక వ్యాసం వుండేది. ముమ్మడివరం బాలయోగికి చాలా మహిమలు వున్నాయని, యెటువంటి ఆహారాన్ని తీసుకోడనే ప్రచారాన్ని తిప్పి కొడుతూ ‘బాలయోగి బండారం’ పేరుతో పుస్తకాన్ని రాశాడు. ఈ బాలయోగి పేరే మాజీ స్పీకరు, హెలీకాఫ్టర్ ప్రమాదంలో మరణించిన జి.యం.సి. బాలయోగికి తల్లిదండ్రులు పెట్టారు. ముమ్మడి వరం బాలయోగి ప్రతి శివరాత్రికి ప్రజలకు దర్శనం ఇచ్చేవాడు. ఆ తరువాత పెరిగే వయసుతో పాటు శరీరం కూడా పెరిగి పోయి కూర్చోలేకపోతుండడంతో ఎక్కడ బండారం బయటపడి ఆదాయం తగ్గిపోతుందోనని బాలయోగిని ట్రస్టీ నిర్వాహకులు చంపేశారని దశరథరామ్ తన పరిశోధనలో తెలుసుకొని వెల్లడించాడు.
దాడులు:
హోదా అంతస్థులను ఖాతరు చెయ్యకుండా ఎంతటివారినైనా తీవ్ర పదజాలంతో విమర్శించిన దశరధరామ్‌పై దాడులు కూడా ఆ స్థాయిలోనే జరిగాయి. రాయలసీమ ఫ్యాక్షనిస్టు చల్లా రామకృష్ణారెడ్డి చేసిన ఘోరాల గురించి రాస్తే తన అనుచరులను జీపుల్లో తీసుకొచ్చి ఎన్‌కౌంటర్ ఆఫీసు మీద దాడిచేశాడు.
సినిమా నటుడు మాదాల రంగారావు గురించి మాదాలా! నువ్వు నోర్మూయ్! అని రాస్తే విజయవాడ సి.పి.ఐ. కార్యకర్తలు దశరథరామ్ ఇంటిమీద దాడిచేశారు. విశాఖపట్టణం మహానాడులో తెలుగు యువత కార్యకర్తలు దశరథరామ్‌ను ఉరి తియ్యాలి అని లేదంటే మేమే నరికి పారేస్తామని కరపత్రాలు పంచారు.
విజయవాడ సిద్ధార్థ కాలేజీలో జరిగిన తెలుగుదేశం ‘మహానాడు’ సభకు వెళ్ళినపుడు అక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలు దశరధరామ్‌ను గుర్తుపట్టి చంపటానికి ప్రయత్నం చేశారు. దశరథరామ్ మీదకు ఎగబడ్డ గుంపును వడ్డే శోభనాద్రీశ్వరరావు వారించినా వినలేదు. జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వరరావు సమయానికి స్పందించి తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో గాలిలోకి కాల్పులు జరపడంతో ఆ దాడి నుండి దశరథరామ్ బయటపడ్డాడు.
ఎన్టీ రామారావును నాదెండ్ల భాస్కరరావు పదవినుండి తప్పించిన సంక్షోభ కాలంలో దశరధరామ్ తన మిత్రులతో కలిసి హైదరాబాద్ వెళుతూ నందిగామలో భారీ వర్షం వల్ల ట్రాఫిక్ స్తంభించడంతో రోడ్డు పక్కన వున్న రెస్టారెంట్‌కు వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడేవున్న దేవినేని నెహ్రూ మనుషులు దశరథరామ్‌ను చూసి వెంటబడ్డారు. వాళ్ళకు అందకుండా పరుగెత్తి తప్పించుకున్నాడు. నందిగామ నుండి కోదాడ వరకు తన వెంట ఎప్పుడూ వుండే గోపీ కృష్ణను రిక్షాలో ఎక్కించుకొని భారీ వర్షంలో ఈదురు గాలిలో రిక్షా తొక్కుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఎన్‌కౌంటర్ ఏజెంట్ దగ్గర షెల్టర్ తీసుకొని తరువాత రోజు విజయవాడ చేరుకున్నాడు.
దశరథరామ్ హత్య:
ఇటువంటి దాడుల గురించేగాక తన మీద జరుగబోతున్న హత్యాప్రయత్నాల గురించి యెప్పటికప్పుడు పాఠకులకు ఏకరువు పెడుతుండేవాడు. చివరిగా తనను చంపడానికి కుట్ర జరిగిపోయిందని పదిరోజుల ముందే తెలుసుకున్నాడు. ఆ రోజు 1985 అక్టోబరు 20వ తేదీన, 63వ సంచిక కోసం ఒక్క క్షణం కూడా వృథా చెయ్యకుండా కూర్చున్నచోట నుండి కదలకుండా రాస్తూనే వున్నాడు. సాయంత్రానికి మేటర్ పూర్తి చేశాడు. అప్పుడే పరశురామయ్య అనే జర్నలిస్టు మిత్రుడు వచ్చాడు ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకొన్నారు.
పరశురామయ్యను బస్టాండ్‌లో బస్ ఎక్కించి వస్తానని వచ్చిన తరువాత సెకండ్ షోకి ‘ప్రతిఘటన’ సినిమాకి వెళ్దాం అని భార్య సుశీలతో చెప్పాడు. మిత్రుడిని బస్ ఎక్కించి రిక్షాలో ఇంటికి బయలుదేరాడు. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారం ఎదురుగా వుండే గిరిరోడ్డులోకి రిక్షా రాగానే అప్పటి వరకు నీడలా వెంటాడుతున్న ఇద్దరు వ్యక్తులు రిక్షాను అడ్డగించారు. వాళ్ళ చేతుల్లో కత్తులు చూసి భయపడిన రిక్షా డ్రైవర్ పక్కకు తప్పుకున్నాడు.
ప్రాణం పోయింది అనుకొన్న తరువాత ఆ యిద్దరు దుర్మార్గులు వెళ్ళిపోయారు. భయంతో వణికిపోతున్న రిక్షావాడు రిక్షాను నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళాడు. జరిగిన ఘోరాన్ని తెలుసుకొన్న దశరథరామ్ భార్య సుశీల, తల్లి జానకమ్మ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. కాని దశరథరామ్ దగ్గరకు రాకుండా పోలీసులు అడ్డుకొన్నారు. దశరథరామ్ అతి కష్టం మీద ఊపిరి తీసుకోవటం గమనించిన సుశీల జానకమ్మ ఆసుపత్రికి తీసుకెళ్ళనివ్వమని ప్రాధేయపడ్డారు.
దశరథరామ్‌ను ముట్టుకోవడానికి ముందుకొచ్చిన సుశీల చేతిమీద లాఠీతో బలంగా కొట్టాడు పోలీసు. ఆ తరువాత దశరథరామ్ శరీరం మీద బక్కెట్లతో నీళ్ళు పోశారు. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్ళాల్సింది పోయి తెల్లవార్లు స్టేషన్‌లోనే ప్రాణాలు పోయేవరకు వుంచి ఉదయం నాలుగున్నరకు పోలీసులు దశరథరామ్ దేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి పంపించారు.
ఈ హత్యకు బాధ్యులెవరు:
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో మంత్రులు, ఎం.ఎల్.ఏ.లుగా చేసిన వాళ్ళ అక్రమాలన్నీ ఆధారాలతో సహా నిర్భయంగా తన పత్రికలో రాసిన దశరథరామ్‌ను యెప్పటికైనా అంతమొందిస్తారని అందరూ అనుకునేవారు. దశరథరామ్ ఎన్‌కౌంటర్ పత్రిక అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి తలకొరివి అయ్యింది. ప్రతిపక్షంలో వున్న కాంగ్రెస్ నాయకులకంటే ఎన్‌కౌంటర్‌ను ఎదుర్కొవడమే కష్టంగా వుండేది. ఎలాగైనా దశరథరామ్‌ను అడ్డు తొలగించుకోవాలనుకుంది.
బాధ్యతని అప్పటి విజయవాడ ఎస్.పి.గా పనిచేస్తున్న కె.ఎస్.వ్యాస్ (కోట శ్రీనివాస్ వ్యాస్)కు అప్పగించింది. ఇక వ్యాస్ దశరథరామ్ విరోధుల కోసం గాలించాడు. ‘విజయ విహారం’ పత్రిక కథనం ప్రకారం దశరధరామ్‌కు ఒకప్పటి స్నేహితుడైన తోటరాము దశరథరామ్ నుండి విడిపోయి పోటీగా ‘పొలిటికల్ ఎన్‌కౌంటర్’ అనే పత్రిక పెట్టాడు. మరొక కొత్త పత్రిక ప్రారంభించే విషయంలో దశరథరామ్‌తో విభేదాలు వచ్చిన బెనర్జీ, తోట రాములకు దశరథరామ్‌ను అంతమొందించే పనిని వ్యాస్ అప్పగించారు.
తలావొక లారీ ఇప్పిస్తానని వాగ్ధానం చేసిన వ్యాస్‌ను నమ్మి తోట రాము, బెనర్జీ, వెల్లంకి కృష్ణమోహన్‌లు దశరధరామ్ హత్యకు పథకం వేశారు. బెనర్జీ బక్కగా వుండటంతో అతన్ని ఆఫీసు దగ్గరే వదిలేసి తోట రాము, వెల్లంకి కృష్ణమోహన్లే హత్యచేశారు. ఇది 23 ఏళ్ళ వయసులో ఒక రాజకీయ పత్రికను స్థాపించి 29 ఏళ్ళకే నూరేళ్ళు నిండిన పింగళి దశరధరామ్ సాహస గాధ. ఈ సంవత్సరం అక్టోబరు 20వ తేదీకి దశరధరామ్ హత్య జరిగి 25 సం॥లు. ఎంతో మంది యువకుల్లో స్ఫూర్తిని నింపిన కలం యోధుడు తన కలాన్ని ఆయుధంగా చేసి అగ్రకుల దురహంకార ప్రభుత్వాన్ని యెదిరించి పత్రిక కోసం ప్రాణాలర్పించిన పింగళి దశరథరామ్ వర్థంతి సందర్భంగా నివాళులు…
(ఇది NJ Vidya Sagar పాత పోస్టు… ఖచ్చితంగా ముచ్చట పాఠకులతో షేర్ చేసుకోవాలని బలంగా అనిపించింది… తెలుగు పాత్రికేయంలో ఓ పేజీ… కాదు, కాదు… ఓ అధ్యాయం పింగళి దశరథరామ్… ఆ కలం ఓ నిప్పుకణం… తెలుగు పాత్రికేయంలో మొదటి అగ్నికలం, చివరి అగ్నికలం… తనది ఓ చరిత్ర… తన భాష, తన శైలి, తన రచనా ధోరణుల మీద చాలామందికి తనపై వ్యతిరేకత ఉండేది… అదే సమయంలో లక్షలాది మంది, ప్రత్యేకించి యువత తన పత్రిక కోసం ఆసక్తిగా ఎదురుచూసేవాళ్లు… ఇంత సవివరంగా తన గురించి తెలియజెప్పిన విద్యాసాగర్‌కు ధన్యవాదాలు… నిజానికి చాలా లెంతీ పోస్టు… కానీ అవసరం, అమూల్యం… ఇదే పోస్టులో దశరథరామ్ భార్యతో తన ఇంటర్వ్యూను కూడా పొందుపరిచారు… అది చదవాలని ఆసక్తి ఉన్న పాఠకులు ఈ లింక్ ఓపెన్ చేయండి… https://www.facebook.com/mmvinodini/posts/pfbid02ezE7RU7fZvEAys29yn4YjegohSaSdVxwQ9jmRg6VDdtxKDUTfAX3DZkXdwg8xVR1l
Share this Article