రాహుల్జీ అనేసరికి ఒక తెలీని ఉద్వేగం, అసాధారణ ఉత్సాహం, అంతులేని ఉత్తేజం. మొత్తంగా ఆయనో నిరంతర ప్రవాహం. ఏ మూస వాదాల్లోనూ ఇమడని స్వేచ్ఛా జీవి. ఎవరి ఆదేశాలకూ తలగ్గొని మేధావి. ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వజనీనత కలిగిన సత్యాన్వేషి !
చరిత్రకారులు చాలా మంది ఉండొచ్చుకానీ చలనశీలత కలిగిన భౌతికవాద దృక్పథం తో చరిత్రని మధించినవారు అరుదు. యాత్రికులు ఎందరైనా ఉండొచ్చుకానీ వ్యవస్థ మార్పు కోసం ప్రయాణాన్ని ఒక సాధనంగా చేసుకున్న వారు తక్కువ. పరిశోధనలు ఎందరైనా చేయవచ్చుగాక, కానీ మానవ కళ్యాణం కొరకు శోధననే శ్వాసగా చేసుకున్న జ్ఞాన పిపాసులు లేరు.అలా ఎవరైనా ఉన్నారంటే అందులో మొదటి వ్యక్తి రాహుల్జీ !
అలాంటి రాహుల్జీ పట్ల అపోహలెన్నో ఉన్నాయి. అపార్థాలే అన్నే ఉన్నాయి. తండ్రి మీద అలిగి యాభై ఏళ్ళు వచ్చేంతవరకూ మళ్ళీఇంట్లో అడుగుపెట్టనని శపధం చేసి ఆయన చనిపోయిన విషయాన్ని కూడా లేఖ ద్వారా తెల్సుకున్న ఈ రాహులేనా టిబిట్ ప్రయాణంలో తనతో ఉన్న కుక్కపిల్ల చనిపోయిందనీ వెక్కి వెక్కి ఏడ్చి దానిపై నివాళిగా 8 సంస్కృత శ్లోకాలు రాసింది..?
Ads
పెట్టుబడిదారీ వర్గాల ఏజంటంటూ గాంధీని తీవ్రంగా దుయ్యబట్టి, తిట్టని తిట్టు తిట్టకుండా తిట్టిన ఇతడేనా గాంధీ హత్య నాడు విసిరేసిన సిగరెట్ ని మళ్ళీ జీవితాంతం ముట్టకుండా ఉండటమే కాక , గాంధీ నిస్సందేహంగా రెండవ తథాగతుడు.. నిజంగా మహాత్ముడే అంటూ బుద్దుడితో పోల్చింది..?
అప్పటిదాకా పట్టనట్లున్న ఈ మనిషేనా అంబేద్కర్ బౌద్ధం స్వీకరించినపుడు దేశంలోని కమ్యూనిస్టులంతా నోర్మూసుకునో, అవాకులు, చెవాకులు పేలుతూనో ఉన్నప్పుడు, వాళ్ళందరి నోళ్ళూ మూతపడేలా అంబేద్కర్ బౌద్ధ దీక్షకి మద్దతివ్వడమే కాక “నవదీక్షిత బౌద్దుల”నే వ్యాసం రాస్తూ, “ఏడు వందలేళ్ళ తర్వాత భారతదేశంలో బౌద్ధానికి లభించిన ఘన ప్రతిష్ఠలో ప్రముఖపాత్ర నిస్సందేహంగా బాబాసాహెబ్‌ది, చరిత్ర వారిని ఎప్పుడూ మరువజాలదు.” అనగలిగిందీ…?
రష్యాలో కమ్యూనిస్టుగా మారి భారత దేశంలో తిరుగులేనంత సేవ పార్టీకి చేసి, తన భావాల కారణంగా పార్టీ నుండి బహిష్క రించబడిన ఈయనేనా పదేళ్ళ తర్వాత కూడా అంతులేనంత కీర్తిప్రతిష్టలు ఉండి, తీరిక లేనన్ని కార్యక్రమాలలో మునిగి ఉండి కూడా పార్టీ ఆఫీసుకెళ్ళి సామాన్య కార్యకర్తలా దరఖాస్తు చేసుకుని సభ్యత్వం ఇమ్మనమని గద్గద స్వరంతో అడిగింది..?
అవును. ఆయన మానవీయ దృక్పధాన్ని విస్మరించిన శుద్ధ భౌతికవాది కాడు, మానవ సంబంధాలని పట్టించుకోని మూఢ విప్లవకారుడు కాడు. ఆయన ప్రపంచానికి ప్రమాణం మనిషి. ఆయన వివేకానికి మూలం వ్యవస్థ. అందుకే బౌద్దంలోని వర్ణరాహిత్యాన్నెంతగా ప్రేమించాడో, మార్స్కిజంలోని వర్గ రాహిత్యాన్ని అంతే అభిమానించాడు. మనిషిని చైతన్య పర్చడమే సమాజ మార్పుకి దోహదం చేస్తుందనే నమ్మకమే చివరివరకూ ఆయన్ని నడిపించింది !
కేదార్‌నాథ్ పాండేగా పుట్టాడు. బాబా రామ్ ఉదార్దాస్ గా మత దోపిడీనీ దగ్గరగా చూసాడు. కేదార్‌నాథ్ విద్యార్దిగా రచనా వ్యాసంగం మొదలెట్టాడు. రాహుల్ సాంకృత్యాయన్‌గా, ఎల్లలు లేని విశ్వనరుడిగా ఎదిగి, ఒకే వ్యక్తి – అనేక జీవితాలు గడిపాడు !
దేవుళ్ళకి బలులు వొద్దన్నాడని సాంప్రదాయవాదులు రాళ్ళేస్తే, ఉర్దూకి దేవనాగరి లిపి ఉండొచ్చన్నాడని సామ్యవాదులనబడే వాళ్ళు ఆయన్ని విమర్శించి పార్టీ నుండి వెళ్ళగొట్టారు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఆయన తాను నమ్మిందే చెప్పాడు, చెప్పిందే చేసాడు. ముప్పైకి పైబడిన భాషల్లో పాండిత్యం, ఐదారు భాషల్లో అసామాన్య ప్రావీణ్యం ఉండి కూడా హిందీ భాషలోనే రచనలు చేసాడు. ఎన్నో దేశాలు పదులసార్లు చుట్టేసినవాడై వుండి, ప్రసంగాల కోసం అమెరికా నుండి ఆహ్వానం వస్తే అవతలకి పొమ్మని నిరాకరించాడు !
బ్రాహ్మణాధిపత్యంతో కుళ్ళి కంపుకొడుతూ కూనరిల్లుతున్న ఆనాటి పండిత సభల్ని తన స్వీయసాధనా ప్రతిభతో విభ్రాంతి చెందేలా చేసి ,”మహాపండితు”డయ్యాడు. ప్రాధమిక విద్య కూడా సరిగా చదవని వ్యక్తి ప్రపంచంలోనే రెండు అత్యున్నత విశ్వవిద్యాలయాలైన లెనిన్ గ్రాడ్ రష్యా,లో సంస్కృత ఆచార్యుడిగా, శ్రీలంకలో తత్వశాస్త్ర ఆచార్యుడిగా పాఠాలు చెప్పాడు. ప్రాచీన, ఆధునిక శాస్త్రాలన్నింటినీ మధించాడు !
ఇలా చెప్పుకుంటూపోతే ఒక్క సారిగా అయ్యేది కాదు. రాహుల్జీ జీవితాన్ని వ్యాసంలోనో, ఉపన్యాసంలోనో ఇమడ్చడమంటే పోటెత్తే సముద్రాన్ని పొట్టి సీసాలో ఎక్కించే పిచ్చి ప్రయత్నం, ఆకాశం మొత్తాన్ని అద్దంలో చూపించే దుస్సహాసం !
టిబెట్, లఢఖ్ ల నుండి ప్రాణాలకి తెగించి ఆయన తీసుకువచ్చిన అపురూపమైన ప్రాచీన రాతప్రతులు, విలువైన గ్రంధాలు, చిత్రాలకి సంబంధించి పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. పాట్నాలో రాహుల్జీ పేరిట ఉన్న విభాగం, ఆయన జన్మస్థలంలోని లైబ్రరీలు, డార్జిలింగ్ లోని ఆయన విశ్రమించిన స్థలం అత్యంత నిర్లక్ష్యానికి గురయ్యాయి !
2018 లో రాహుల్ 125వ జయంత్యుత్సవాలు కూడా నామ్ కే వాస్తే గా జరిగాయే కాని జీవంతో జరగలేదు. ఎమ్మెన్ రాయ్ అముద్రిత రచన The Philosophical Consequences of the Modern Science , ఆంటోనియో గ్రాంసీ Prison Notebooks తో పోల్చదగ్గ రాహుల్ జీ జైలు సాహిత్యం (ఓల్గా సే గంగా మొదలుకొని సింహసేనాపతి, జయయౌధేయ, వైజ్ఞానిక్ భౌతికవాద్, దర్శన్ – దిగ్దర్శన్ హజారీబాగ్ జైల్లోనే రాసాడు) ఇంకా అముద్రిత రచనలు, ఆయన ఐదుభాగాలుగా రాసిన ప్రపంచ సాహిత్యంలోనే అతిపెద్ద ఆత్మకథ “మేరీ జీవన్ యాత్ర” పై కృషి జరగాల్సిన అవసరం ఉంది. ఢిల్లీలో రాహుల్ సాహిత్య ప్రతిష్టాన్, లక్నోలో రాహుల్ ఫౌండేషన్ కొద్దో గొప్పో చేస్తున్నాయ్ కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో కాదు !
ముఖ్యంగా గాంధీ, అంబేద్కర్, రాయ్, పెరియార్, భగత్ సింగ్ వంటి వారందరి పై చలనచిత్రాలూ, డాక్యుమెంటరీ చిత్రాలు వచ్చాయి. కానీ రాహుల్జీ కృషిని ప్రస్తావిస్తూ ఏవో డి.డి. ఛానల్ చేసినవే కానీ ఈ తరానికి అందుబాటులో ఆధునికంగా జరిగిన యత్నాలు నాకు తెల్సీ ఏవీ లేవు. ఇప్పటికైనా తెలుగులో చెట్టుకొకరూ, పుట్టకొకరూగా ఉన్న వామపక్ష, ప్రజాతంత్ర, అభ్యుదయ వాదులు, పార్టీలు, సంఘాలు కనీసం రాహుల్జీ విషయంలో ఒక్క తాటి మీదికొచ్చి ఈ దిశగా ఆలోచిస్తే బావుంటుందని నా భావం !
చివరగా ఎన్ని లోపాలున్నప్పటికీ రాహుల్జీ రచనల్ని తెలుగువారికి అందించిన ఆలూరి భుజంగరావు గారిని ఈ సందర్భంగా స్మరిస్తూ, మారిన వ్యక్తుల పట్ల మన భావాలు కూడా మార్చుకోవడానికి సిద్దపడగలగడం మార్స్కిజంలో ముఖ్యమైన సూత్రం. విప్లవానంతరం శిలాస్థూపం మీది అమరుల పేర్లలో బకునిన్ వంటి అనార్కిస్టులకి కూడా ఎంతో మంది విమర్శించినా లెనిన్ స్థానం కల్పించింది అందుకే !
జీవితంలో గతిశీలతని అన్వయించుకుంటూ ముందుకు సాగిపోవడానికి రాహుల్ జీవితాన్ని మించిన తార్కాణం మరోటి లేదు. ఆ దిశగా ఆయనే ఆహ్వానించినట్లు, యువత ప్రపంచాన్ని చుట్టుముట్టి సామాజిక స్పృహ కలిగిన సంచారులుగా సిద్దంకావడం, మతతత్వ శక్తులు పెట్రేగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అభ్యుదయ లౌకికశక్తులన్నింటి పట్ల ఒక మిత్రపూరితమయిన సహృధ్భావ వైఖరిని ఏర్పర్చుకోవడమే ఈరోజు రాహుల్జీ కి మనం ఇవ్వదగ్గ నిర్మాణాత్మక నివాళనేది నా అభిప్రాయం, సెలవు !
(మొన్న #రాహుల్జీ 130వ జయంతి)…………. రచయిత :: – Gourav M
Share this Article