సీతారాం ఏచూరి… భారతీయ మార్క్సిస్ట్ చరిత్రలో తనదొక అధ్యాయం… అఫ్ కోర్స్, భారతీయ రాజకీయాల్లో కూడా..! 72 ఏళ్ల వయస్సులో మరణం అంటే ప్రస్తుత ఆయుఃప్రమాణాల ప్రకారం తక్కువ వయస్సే…
మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో పుట్టాడు… గతంలో ఉమ్మడి ఏపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా మేనల్లుడు తను… తరువాత ఢిల్లీలో చదువు… అక్కడే వామపక్ష రాజకీయాల్లోకి ఎస్ఎఫ్ఐ నుంచి ఎంట్రీ… అంచెలంచెలుగా ఎదిగి ఏడేళ్లుగా సీపీఎంకు ప్రధాన కార్యదర్శి తను…
మొదటి భార్య ఇంద్రాణి మజుందార్… ఆమె తల్లి ప్రఖ్యాత స్త్రీవాది, విద్యావేత్త, లెఫ్ట్ యాక్టివిస్ట్ వీణా మజుందార్… బెంగాలీ… తరువాత సీతారాం ప్రముఖ జర్నలిస్టు, రైటర్ సీమా చిస్తీని రెండో పెళ్లి చేసుకున్నాడు… మొదటి పెళ్లితో తనకు ఓ కొడుకు, ఓ కూతురు…
Ads
కొడుకు కరోనా కారణంగా మరణించాడు… కూతురు ఏదో యూనివర్శిటీలో టీచింగ్ ఫ్యాకల్టీ… రెండో భార్య సీమా చిస్తీ ప్రస్తుతం ది వైర్ ఎడిటర్… గతంలో పలు మీడియా సంస్థల్లో ప్రముఖ స్థానాల్లో పనిచేసింది… సీతారాం ఏచూరి భౌతిక దేహాన్ని గత మూడు వారాలుగా చికిత్స పొందుతున్న ఎయిమ్స్‌కే వైద్యశాస్త్ర అవసరాల కోసం దానం చేసింది ఆ కుటుంబం…
2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడు… 2015 నుంచీ పార్టీ ప్రధాన కార్యదర్శి… ఇదీ తన వ్యక్తిగతం…లెఫ్ట్ రాజకీయాల్లో తను తీసుకున్న నిర్ణయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, పరిణామాలు గట్రా ఇక్కడ ప్రస్తావించడం లేదు… సుదీర్ఘం అది… కానీ ప్రకాష్ కారట్ గ్రూపు పార్టీలో పెత్తనం కోసం (మన తెలుగు సీనియర్ కామ్రేడ్లు కూడా అదే గ్రూపు) సీతారాం ఏచూరి నాయకత్వానికి పొగపెట్టినప్పుడు సైతం నిబ్బరంగా, ఎక్కడా బ్యాలెన్స్ కోల్పోకుండా నిలబడ్డాడు…
స్ట్రెయిట్… పార్టీ విధానాలు, పార్టీ సిద్ధాంతాల పట్ల నిజాయితీతో కూడిన నిబద్ధత తనది… మృదుస్వభావి, మృదుభాషి కూడా… అందుకే ఆయన అందరి కామ్రేడ్… పార్టీలకు అతీతంగా తనను అభిమానిస్తారు… పెద్దగా వివాదాలు కూడా లేవు తన కెరీర్‌లో… ఎస్, తన మరణం దేశ లెఫ్ట్ పాలిటిక్స్‌కు నష్టమే…
ఒకసారి… కొన్నేళ్ల క్రితం… ఎన్నికల ప్రచారం కోసమే వచ్చాడు, అప్పుడు ఉమ్మడి ఏపీ… తన కారులో ఇంటర్వ్యూ కోసం ఎక్కాను… అంబాసిడర్ కారే… అప్పట్లో ఏదో చవక సిగరెట్ తాగినట్టు కూడా గుర్తు… (తను శ్వాసకోశ సమస్యలతోనే ఈరోజు కన్నుమూశాడు)… ఏదో పొలిటికల్ ఇంటర్వ్యూ అన్నట్గుగా గాకుండా మామూలు సంభాషణ కాసేపు… తను ఏదైనా సబ్జెక్టు మీద చెబుతుంటే ఇక వింటూ పోవాల్సిందే… సరళమైన భాషలో సూటిగా, లోతుగా… (లెఫ్ట్ రాజకీయాలు, విధానాలు, సిద్ధాంతాల మీద బాగా పరిచయం ఉన్నవారైతే ఇంకా ఎక్కువ సేపు మాట్లాడేవాడేమో… కానీ మా సంభాషణ కొద్దిసేపే సాగింది…)
కొత్త తరం కమ్యూనిస్టు రాజకీయాల పట్ల ఆసక్తిగా లేదు… రిక్రూట్‌మెంట్లు పెద్దగా లేవు… ట్రేడ్ యూనియన్ యాక్టివిటీ కూడా తగ్గింది… (అప్పటికి 3 రాష్ట్రాల్లో సీపీఎం అధికారంలో ఉంది…) సమాజంలో వినియోగతత్వం బాగా పెరిగింది… కొత్త జనరేషన్స్‌లో సొసైటీ కన్సర్న్ తగ్గిపోతుందనే అసంతృప్తి కనిపించింది ఆయన మాటల్లో… నిజమే కదా, పార్టీ నానాటికీ కొడిగట్టుకుపోతోంది…!! బై బై కామ్రేడ్..!!
Share this Article