మనకు పోలీస్ ఆఫీసర్ల ఇళ్లల్లో వెట్టి చాకిరీ చేసే ఆర్డర్లీ వ్యవస్థ తెలుసు… బానిసల్లా పనిచేయించుకుంటారు… పేరుకు జాతికి బోలెడు నీతులు చెప్పే ఉన్నతాధికారులందరూ ఇంతే… ఐఏఎస్ అధికారులు శుద్ధపూసలు ఏమీకాదు… ఈ దోపిడీ ఎన్‌లైటెన్ సర్కిళ్లు అన్నీ చేస్తున్నవే… వాళ్లందరి జీతాలూ మనమే పేచేయాలి, అంటే మన ఖజానా నుంచే…
వశపడని జీతాలు, సౌకర్యాలు, అధికారాలు, అక్రమ సంపాదనలు, అడ్డమైన వేషాలు… ఈ నేపథ్యంలో నిన్న ఆంధ్రజ్యోతిలో ఓ స్టోరీ కనిపించింది… రైల్వే ఉన్నతాధికారుల ఇళ్లల్లోనూ వెట్టి చాకిరీ చేస్తున్న ప్యూన్ల వెతల గురించి… ఏదో మూడేళ్లు కళ్లుమూసుకుని వాళ్ల ఇళ్లల్లో పనిచేస్తే, తరువాత కొలువు పర్మినెంట్ చేస్తారని ఆశ… కానీ ఏళ్లకేళ్లు అధికారుల ఇళ్లల్లో పనులతోనే సరిపోతోంది…
బంగ్లా ప్యూన్ అంటారట… చేయని పని అంటూ లేదు… వంట పని, ఇల్లు తుడవడం, ఊడ్వడం దగ్గర నుంచి వెహికిల్స్ కడగడం, చివరకు పిల్లల డైపర్స్ మార్చడం, దుస్తులు ఉతకడం దాకా… పైసా ఇవ్వాల్సిన అవసరం లేని పనివాళ్లుగా వాడేసుకుంటున్నారు… ఉదయం ఎప్పుడో ఆ ఇళ్లల్లోకి వెళ్తే, అందరూ పడుకున్నాక తిరిగి ఇల్లు చేరుకోవడం…
Ads
ఇవన్నీ ఎలా బయటకు వచ్చాయి..? పాపం, దాదాపు 70 మంది ఓ రహస్య ప్రదేశంలో భేటీ అయి, కష్టాలు చెప్పుకుంటూ గొల్లుమన్నారు… ఆశ్చర్యం ఏమిటంటే..? ఒక్క దక్షిణ మధ్య రైల్వేలోనే దాదాపు 4 వేల మంది ప్యూన్లు ఉన్నారట ఇలా… అధికారులు సంతకాలు చేస్తే తప్ప వాళ్లకు ఆ అరకొర జీతాలు రావు… దాంతో మనస్సు చంపుకుని అధికారులు చెప్పిన పనల్లా చేయాల్సి వస్తోంది… ఇళ్లల్లో ఆ ఇల్లాళ్ల దాష్టికం గురించి ఇక చెప్పనక్కర్లేదు…
నిజమే, రెగ్యులర్ ఉద్యోగులు కారు కాబట్టి యూనియన్లలో చేర్చుకోరు, యూనియన్లు పోరాడవు… గత ఏడాది ఇద్దరు బంగ్లా ప్యూన్లు ఆత్మహత్యా యత్నం కూడా చేశారట… చాలా పెద్ద స్టోరీ పబ్లిష్ చేసింది ఆంధ్రజ్యోతి… గుడ్ ప్రయారిటీ… ఇంకా గుండెలో తడి ఉన్న పాత్రికేయులున్నారు… థాంక్ గాడ్… అయితే తరచి చూస్తే మన చుట్టూ ఇలాంటివే ఎన్నెన్నో వెతలు, కథలు… ఎంతసేపూ వాడు వీడినేం తిట్టాడు, వీడిని వాడేం అన్నాడు అనే నిరర్ధక సొల్లు తప్ప మరేమీ ఉండటం లేదు మన పత్రికల్లో…
టీవీలకు ఇలాంటివి ఎలాగూ పట్టవు… అదొక దిక్కుమాలిన జర్నలిజం… ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలు… అవునూ, ఇలాంటి బంగ్లా ప్యూన్ల చాకిరీ వ్యవస్థ విధాన నిర్ణేతలకు తెలియదా..? ఎందుకు తెలియదు… పైదాకా ఇలాంటి పనిదోపిడీయే కదా… రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వృద్ధులు, జర్నలిస్టుల రాయితీకి ‘ఖర్చు ఆదా’ పేరిట అంటకత్తెర వేశాడు తప్ప ఇలాంటివి మాత్రం కనిపించవు… గుడ్డి మంత్రి…
ఈరోజుకు ఒక్కటంటే ఒక్క భేషైన పని లేదు తన వైపు నుంచి… అంటే, జనం మెచ్చేది అని…! పైగా మోడీ కిరీటంలో ఈయన ఓ కీర్తిపింఛం..!! అవునూ, కంట్రాక్టు ఉద్యోగులకూ యూనియన్లు ఉంటాయి, బంగ్లా ప్యూన్లకు ఎందుకు ఉండకూడదు..!! జోక్ ఏమిటంటే… బంగ్లా ప్యూన్ వ్యవస్థకు చరమగీతం పాడినట్టు అప్పుడప్పుడూ స్టోరీలు వస్తుంటాయి… సేమ్, పోలీసుల ఇళ్లల్లో ఆర్డర్లీ వ్యవస్థను రద్దుచేసినట్టే ఇది కూడా…!! రికార్డుల్లో వీళ్ల కొలువు పేరు… Telephone Attendant cum Dak Khalasis (TADK)… (టెలిఫోన్ అటెండెంట్ అట…)
Share this Article