.
Bharadwaja Rangavajhala
…. తాపీ ధర్మారావు గారు రాసిన గ్రంధాలు, ముఖ్యంగా దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు? మత వాదులను ఇబ్బంది పెట్టింది. మతం పరిణామ సిద్దాంతాన్ని అంగీకరించదు.
మనిషిని దేవుడు సృష్టించాడు అన్నప్పుడు పరిణామ క్రమం అనేదాన్ని ఏకవాక్యంలో తిరస్కరించడం జరుగుతుంది. సరిగ్గా అక్కడే హేతువాదానికీ మతవాదానికీ గొడవ నడుస్తుంది. సృష్టించడంలో పరిణామ క్రమం ఉండే అవకాశమే లేదు.
ధర్మారావు గారు తొలి రోజుల్లో శుద్ద గ్రాంధికాన్నీ వాడుతూ పద్యాలు రాశారు … ఎందుకు రాశారు?
దాని వెనకాల కూడా నిరసన కార్యక్రమమే ఉంది. ముందు తాను పండితలోకంలో ఒక గౌరవం సంపాదించుకోవాలి …
ఆ తర్వాత తన వాదనలను వారూ వింటారు. అప్పుడు చర్చ నడుస్తుంది.
మనం ఎవర్నైతే టార్గెట్ చేశామో వారికి మనం మాట్లాడే మాటలు వినిపించాలి కదా …
అలా వినిపించగలిగితేనే తాను చేస్తున్న వాదనకు అర్ధం ఉంటుంది.
Ads
అందుకే శృంగేరీ స్వామి వారి సన్మానాన్ని, వారు ఇచ్చిన విశారద అనే బిరుదునూ స్వీకరించారు.
ధర్మారావు గారు సమకూర్చుకున్న పాండిత్యం అంతా కేవలం తనను తాను ఉన్నతుడుగా నిరూపించుకోవడం కోసం కాదు.
ప్రపంచం ముందు కొత్త విషయాలను చర్చకు పెట్టడమే ఆయన ఉద్దేశ్యం.
అంతకు మించిన ప్రోగ్రామ్ ఏదీ లేదు.
తన మీద వచ్చిన విమర్శలను స్వీకరించి తనలో ఏవైనా లోపాలుంటే సరిచేసుకునే ప్రయత్నమే చేశారాయన.
దేవాలయాల మీద బూతుబొమ్మలు అనే వ్యాసాలను ఆయన గూడవల్లి గారి ప్రజామిత్రలో ప్రచురించారు.
మిగిలిన వ్యాసాలు దాదాపు ఆయన సొంత పత్రికలలో లేదా తన సంపాదకత్వంలో వచ్చిన పత్రికల్లోనే అచ్చువేశారు.
వేగుచుక్క గ్రంథమండలి … పెట్టడం … ఇతర కార్యక్రమాలు, సినిమాలు, ఎన్టీఆర్ ను బిఎన్ కు పరిచయం చేయడం…
అవును, మల్లీశ్వరిలో హీరోగా ఎన్టీఆర్ వేయడం వెనక తాపీ ధర్మారావ్ ఉన్నారు.
పల్లెటూరి పిల్ల చూసి వీణ్ణి మీరు వినియోగించుకోండి అని బిఎన్ కు సలహా చెప్పింది తాపీ ధర్మా రావు గారే .
తాపీ ధర్మారావు బరంపురంలో 1887 సెప్టెంబర్ 19న జన్మించారు.
తండ్రి వైద్యవృత్తిలో ఉన్నారు.
కుమారుడ్ని ఓ పెద్ద ప్రభుత్వోద్యోగంలో చూడాలనుకున్నారు.
డిగ్రీ అయ్యేవరకూ ధర్మారావు గారి అభిప్రాయం కూడా దానికి అటూ ఇటూగా ఉండేది.
తను చేయాల్సిన పని వేరే ఉందనిపించేది. సాహిత్యం వైపు మనసు లాగేది.
డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత కొంత కాలం మాథ్స్ టీచర్ గా పనిచేశారు.
మరికొంత కాలం బొబ్బిలి రాజా దగ్గర దివాన్ గా పనిచేశారు.
ప్రాచీన సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసి ఆంధ్ర విశారద సాధించారు.
తొలి రోజుల్లో ఆయన శైలి గ్రాంధికం.
తర్వాత నెమ్మదిగా జన వాడుక భాషలోనే రచనలు చేశారు.
చేయాలని చెప్పారు.
భాష విషయంలో ఆయన పాత అభిప్రాయాలతో ఉన్న రోజుల్లో …. కాదు, పాత రూపాలలో చేసిన సాహిత్య వ్యాసంగం
పాత పాళీ టైటిల్ తో అచ్చు వేసినా…
సామాజిక అంశాలను కూడా వస్తువుగా తీసుకుని పన్నెండు పద్యఖండికల సంపుటాన్ని ప్రచురించారు.
కొత్త పాళీ అంటూ మారిన అభిప్రాయాలతో రూపాలలో వ్యాససంపుటి ప్రచురించారు.
ఇందులో వ్యాసాలు దాదాపు ప్రజామిత్ర పత్రికలో వచ్చినవే.
వాటిలో చిన్నయసూరి బాలవ్యాకరణం భాషకు చేసిన అపచారం మీద రాసిన వ్యాసం వివాదాస్సదం అయ్యింది.
తన అభిప్రాయాలేవీ గాల్లోంచీ పుట్టలేదనీ …
ప్రతి అభిప్రాయానికీ తాను రావడానికి పట్టిన సమయం ప్రామాణికంగా తీసుకున్న విషయాలు అన్నిటినీ చాలా విపులంగా వివరించారాయన. తనది ప్రదానంగా హేతువాద దృక్పథం.
ప్రతిదీ ప్రశ్నించుకుని దాన్ని అన్వేషించి, అధ్యయనం చేసి, ప్రపంచానికి తాను తెలుసుకున్నది చెప్పడం మాత్రమే కాదు ..
ఆయన నిశ్చిత అభిప్రాయం.
దేవాలయాల మీద బూతుబొమ్మలు ఎందుకు?
పరిశోధనకు పదిహేనేళ్లు పట్టింది అన్నారాయన.
ప్రతి పుస్తకం మనకు కొత్త విషయాన్ని నేర్పించేదే … ఎలా ఓ విషయాన్ని అర్ధం చేసుకోవాలి … ఎలా అధ్యయనం చేయాలి … అధ్యయనానికి తీసుకోవాల్సిన ప్రాతిపదిక ఏమిటి?
ఇలా నడుస్తుంది …
మన సమాజ గతిని గమనాన్నీ అర్ధం చేసుకుని దాన్ని రచనా రూపంగా జనం ముందు పెట్టడం వెనకాల ఆయన ఉద్దేశ్యం…
నేనింత చదివాను.. ఇంత అధ్యయనం చేశాను అని చాటుకోడానికి కాదు ..
మాతృస్వామ్యం నుంచీ పితృస్వామ్యంకు సమాజం మారడం …
పెళ్లి తంతు ఎలా మొదలై ఎలా నడుస్తోంది .. మహిళలకు మనం ఇస్తున్నట్టు చెప్తున్న గౌరవం నిజమైన గౌరవమేనా?
ఇలా అనేక అంశాల మీద ఆయన రాసిన వ్యాసాలేవీ తన జ్ఞానాన్ని చాటుకోడానికి రాసినవి కాదు …
నాకు ఈ సందేహం వచ్చింది దాన్ని నివృత్తి చేసుకోడానికి నేనిలా అధ్యయనం చేశాను.
తద్వారా నాకు అనిపించిన విషయాలివి.
వీటిలో ఏదైనా తప్పుంటే చెప్పవచ్చు.
అలాగే అనవగాహన ఉండడంతో పాటు … మరింత విస్తారంగా పరిశోధన చేసి ఉండాలనే సూచనలు కూడా చేయవచ్చు.
అందుకు ఉపయోగపడే మార్గాలను సూచించవచ్చు .
అలా నన్ను నేను అభివృద్ది పరచుకోవడం కూడా నా ఉద్దేశ్యం అని చెప్పారు.
ఇంత సైంటిఫిక్ గా ఆలోచించి రాసే వారు ఆయన.
ఇనుపకచ్చడాలు లాంటి రచనలు ఆ రోజుల్లో ఏ రచయిత అయినా ఊహించి ఉండేవారా?
రాళ్లూ రప్పలూ అనే టైటిల్ తో ఆయన రచన చాలా వరకూ ఆత్మకథాత్మకంగానే సాగుతుంది.
అయితే … ఇక్కడ …
బెజవాడ నుంచీ ప్రజామిత్ర పత్రిక నడుపుతూ ఉండిన గూడవల్లి రామబ్రహ్మం పోరుపెట్టడంతో సినిమాల వైపు కూడా దృష్టి సారించారు తాపీ ధర్మారావు.
మాలపిల్ల సినిమాలో మాలలు మాత్రం మనుషులు కాదా అంటూ రాసిన పాట ఆయనదే.
అలాగే..
లేవో పేరునకెన్నియో మతములు అనే పాట రాశారు.
అంతా మనవాళ్లే లో …
ఆపేదెవరు? నిజాన్ని అడ్డేదెవరు?
ఆ సినిమా కథ మాటలు గుడిపాటి వేంకట చలం అన్నప్పటికి…
తెరానువాదం చేసింది తాపి ధర్మారావు గారే…
అలాగే చలం గారు మధ్యలో వెళ్ళిపోతే విశ్వనాథ కవిరాజు అనే పెద్దమనిషితో రాయించుకున్నారు.
రైతు బిడ్డ కథ గూడవల్లి రామబ్రహ్మం.
మాటలు త్రిపురనేని గోపీచంద్.
దానికి స్క్రీన్ అడాప్షన్ తాపీ వారే.
ఎన్టీఆర్ రాజుపేదలోనూ ఆయన సాహిత్యం కనిపిస్తుంది.
అశ్వనీ వారి మాయలమారిలో …
కూ యని కూసే కోకిలయైనా ఝుమ్మని –
ఆర్. బాలసరస్వతీ దేవి, పిఠాపురం – పాడిన పాట రాసింది తాపీ ధర్మారావు గారే.
పల్లెటూరి పిల్లలోనూ రెండు పాటలు రాశారు తాతాజీ.
ఆయన కుమారుడు తాపీ చాణక్య డైరెక్ట్ చేసిన సినిమాలన్నింటిలోనూ ఒకటో రెండో పాటలు ఆయన రాసేవారు.
భీష్మ సినిమాలో …
నా జన్మంబుతరింప చేసెద ప్రతిజ్ఞన్ దిక్పతుల్ అంటూ ఘంటసాల ఆలపించిన పద్యం రచన తాపీ ధర్మారావు గారే.
రోజులు మారాయి లో …
ఇదియే హాయి కలుపుము చేయి వేయిమాటలేల అంటూ జిక్కి,ఘంటసాల పాడిన డ్యూయట్ కూడా తాపీ ధర్మారావు గారే రాశారు.
సారధీ వారి సినిమాలన్నింటిలోనూ తాపీ వారి పాటలు ఒకటో రెండో కనిపిస్తాయి.
అలాగే కె.ఎస్ ప్రకాశరావు దీక్ష లోనూ ఓ పాట రాశారు తాపీ.
అభ్యుదయ రచయితల సంఘం తొలి అధ్యక్షులు ఆయనే.
మదాలస, సావాసం, ఆడబ్రతుకు, ఇల్లాలు , పత్ని, లాంటి సినిమాలకు ఆయన సింగిల్ కార్డు లిరిక్ రైటర్ కూడా.
బిఎ సుబ్బారావు తీసిన ఎన్టీఆర్ నటించిన భీష్మ సినిమా స్క్రిప్టు సగం పైగా ఆయనే రాశారు. మిగిలినది ఆరుద్ర రాశారు.
- దీని మీద జోకు …
భీష్మ సినిమా సగం వరకూ తాపీగానూ ఆ తర్వాత ఆదుర్దాగానూ నడుస్తుంది అని …
ఆయన రాసిన విజయ విలాస హృదయోల్లాస వ్యాఖ్యకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు.
డెబ్బై మూడులో మరణించారు.
కాగడా , జనవాణి , కొండెగాడు లాంటి పత్రికలు ప్రారంభించారు.
కమ్యునిస్టు పార్టీ తెలుగు దిన పత్రిక కు విశాలాంధ్ర అని పేరు పెట్టింది కూడా ఆయనే.
అయితే అదే కాగడా పత్రిక టైటిల్ కామేశ్వర శర్మకు ఎలా చేరిందనేది ప్రశ్న.
వారి ఇంటిపేరు కూడా చిత్రంగానే ఉంటుంది.
తాపీ అని … వారి పూర్వీకులు తాపీ పని చేయడం వల్లే ఈ ఇంటిపేరు స్తిరపడి ఉండవచ్చు అని ఆయనే చెప్పారు.
ఆయన ఇద్దరు కొడుకులూ కమ్యునిస్టు పార్టీలో పనిచేశారు.
పెద్ద కొడుకు మోహనరావు పార్టీకి అంకిత భావంతో పని చేశారు.
చిన్న కొడుకు చాణక్య కొద్ది కాలం పార్టీలో పనిచేసి తర్వాత సినిమా ప్రవేశం చేశారు.
ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ సినిమా రాముడూ భీముడూ ఆయనే తీశారు .
శ్రీశ్రీ, పింగళి, సముద్రాల, ఆరుద్ర, సినారే పాటలు వచ్చినట్టే ధర్మారావు గారి పాటలు కూడా అచ్చేస్తే బావుంటుంది కదా…
అని పబ్లిషర్లకు ఒక ఐడియా…
పాటల లిస్టు నేను ఇస్తా కావాలి అంటే….
Share this Article