.
గురుసమానులు మల్లావఝల సూర్యనారాయణ శర్మ కాలం చేశాడనే సమాచారం చదివిన వెంటనే చిన్నప్పుడు తను పరిచయం చేసిన తెలుగు హనుమాన్ చాలీసా గుర్తొచ్చింది… ఓ చిన్న హనుమాన్ గుడిలో ప్రతివారం తన ఆధ్వర్యంలోనే భజన సాగేది… అందులో చాలీసా, సుందరకాండ తప్పనిసరి… అవి రాసింది, పాడింది ఎంఎస్ రామారావు… సుందరదాసుగా సుప్రసిద్ధుడు… తన గురించి గొప్పగా చెప్పేవాడు తరచూ… అలా తనూ గుర్తొచ్చాడు… తను నీరాజనం సినిమా కోసం ఆలపించిన ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో పాట కూడా లీలగా చెవుల్లో వినిపించసాగింది…
Ads
ఇదేసమయంలో మిత్రుడు రంగావఝల భరధ్వాజ పోస్టు ఒకటి కనిపించింది… అదే ఇది…
శ్రీ హనుమాను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథ నే పలికెద సీతా రామ కథా ….
సుందరదాసుగా పాపులర్ అయిన ఎమ్మెస్ రామారావు గారిని ఓ సారి గుర్తు చేసుకుందామనిపించింది.
తెలుగు సినిమా తొలి ప్లేబ్యాక్ సింగర్ ఆయన.
1941లో వచ్చిన బిఎన్ రెడ్డి దేవత సినిమాలో నేపధ్యగాయకుడుగా సినీపరిశ్రమలోకి ప్రవేశించారు. ఈ వసంతము నిత్యము కాదోయ్ అంటూ తొలి సినిమా పాట పాడారాయన.
అలా దాదాపు ఇరవై మూడు సంవత్సరాల పాటు సినిమాల్లో పాటలు పాడారు.
దీక్ష చిత్రంలో ఆత్రేయ గారి తొలి పాట …
పోరా బాబూ పో పోయి చూడు ఈ లోకం పొకడ ఎమ్మెస్ రామారావు గారే పాడారు.
ఆ తర్వాత ఓ మలయ పవనమా పాట కూడా ఇప్పుడు విన్నా కొత్తగానే అనిపిస్తుంది.
ఆయన నటుడు, పాటల రచయిత, సంగీత దర్శకుడు కూడా.
1954 లో వచ్చిన పల్లెపడుచు చిత్రానికి ఆయన సంగీత దర్శకత్వం వహించారు.
సినిమాల్లోకి ప్రవేశించకముందు రామారావు గారు గ్రామఫోన్ కంపెనీలకు పాటలు పాడేవారు.
వీరు గానం చేసిన తొలి ప్రైవేటు రికార్డు వల్లదంటే కోపమా …
సముద్రాల సీనియర్ రాశారు.
సి.ఆర్ రామన్ సంగీతం అందించారు.
ఆ రోజుల్లో అనే కాదు …
డెబ్బై దశకంలో కూడా ఆకాశవాణిలో తరచు ప్రసారమయ్యే ఓ నాట్య మాడవే రాణీ ..
ఈ పాట రేడియోలో విన్న జ్ఞాపకం ఇంకా ఉంది.
ఇక సమాధిలో అనార్కలి, మూసేనా కనుమూసేనా మా ఆంధ్రకేసరి , ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో ఏ నాటికీ మరపురాని మధురగీతాలుగా పలువురిని ఆకట్టుకున్నాయి.
ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో పాట ఆయనే రాసి స్వరపరచి పాడారు.
ఈయన పాడిన చివరి సినిమా పాట చివరకి మిగిలేదిలో …
చెంగూన అలలాగా … అనే మల్లాది వారి సాహిత్యం. 1963లో ఎందుచేతో ఆయనకి సినిమా మీద విరక్తి వచ్చేసింది.
అవకాశాలు రెగ్యులర్ గా ఉండకపోవడం కావచ్చు. మద్రాసుకు గుడ్ బై చెప్పిన ఆయన తిన్నగా రాజమండ్రి చేరారు.
నవభారతి గురుకులంలో పనిచేశారు. ఉపాధ్యాయుడుగా చేరారు.
చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని వందరూపాయల లోపు జీతంతో జీవనం సాగించారు.
అప్పటికే ఒక అబ్బాయి నేవీలోకి వెళ్లినట్టున్నారు.
ఆ తర్వాత జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి ప్రోత్సాహంతో …
హైద్రాబాద్ వచ్చి భక్తిగీతాలు పాడడం ప్రారంబించారు.
ఆయన గాత్రంలో హనుమాన్ చాలీసా, సుందరకాండ బాగా ప్రాచుర్యం పొందాయి.
ఆయనే రాసి గానం చేసిన సుందరకాండ చాలా పాపులర్.
త్యాగరాయగాన సభ వెనకాల అప్పట్లో ఎవరో బేస్మెంట్ వేసిన ఇల్లు అమ్మేస్తుంటే కొనుక్కున్నారు. అక్కడే ఉండేవారు.
ఎర్లీ ఎయిటీస్ లో నేను చిక్కడపల్లి ఆంధ్రాబ్యాంకు వెనకాల సందుల్లో అద్దెకుండేవాణ్ణి.
బ్యాచ్లర్ ప్లస్ ఉద్యమ జీవితం.
త్యాగరాయగానసభ వెనక వైపుకు ఓ టిఫిన్ బండి ఉండేది .
అక్కడ పొద్దున్నే ఫాస్ట్ ను బ్రేక్ చేసేవాణ్ణి.
సరిగ్గా నేను టిఫిన్ కోసం వెళ్లేప్పుడు ఎమ్మెస్ రామారావుగారు ఒక చిన్న టవల్ కట్టుకుని వాళ్లింటి ముందు నందివర్ధనం చెట్టు ఉండేది ..
దాని పూవులు కోస్తూ కనిపించేవారు.
1921 మే 3 వ తేదీన తెనాలి తాలూకాలోని మోపర్రు గ్రామంలో జన్మించారు ఎమ్మెస్ రామారావు.
ఆయన స్కూలింగ్ అంతా అక్కడే జరిగింది.
అక్కడ నుంచీ ఇంటర్ కోసం గుంటూరు హిందూ కాలేజ్ లో చేరారు.
పాట ఆయనతో ప్రయాణం చేస్తూనే ఉంది.
అంతర్ కళాశాల సంగీత పోటీల్లో హిందూ కాలేజ్ నుంచీ కంటెస్ట్ చేసి మొదటి బహుమతి సాధించారాయన.
అడివి బాపిరాజు గారు ఆయన గాత్రాన్ని మెచ్చుకుని ప్రోత్సహించి సినిమాల్లోకి నడిపించారు.
కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు.
పాటలు ఆయనే రాసి పాడేవారు.
తొంభై రెండు ప్రాంతాల్లో హైద్రాబాద్ లోనే కన్నుమూశారు.
అప్పటికి ఆయన వయసు డెబ్బై రెండు.
ఆయన పిల్లలు ఆయన్ని గౌరవించి ఆ ఇంటిని కొంచెం గుడిలాగా మార్చారు …
నిన్న ఓ పనిమీద చిక్కడపల్లి వెళ్లినప్పుడు ఆయన ఇల్లు చూశాను.
అపార్ట్మెంటీకరణ జరిగిపోయుంటుందనుకుంటూ అటు తల తిప్పాను.
సహజంగా ఈ జనరేషన్ పిల్లలు అదే చేసేస్తున్నారు కదా అని ..
కానీ అది కాస్త ఆలయం షేప్ తీసుకోవడం నన్ను తెగ ఆశ్చర్యపరచినది.
అందుకే వారిని ఒక్కసారి తల్చుకోవలినిపించినది…
Share this Article