Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పటి చిరంజీవి మంచి సినిమా ‘శుభలేఖ’కు ఈ నాటకమే స్పూర్తి…

October 6, 2023 by M S R

Sai Vamshi………  వరకట్నంపై వందేళ్ల కిందటి సమ్మెటపోటు… వరకట్నం సాంఘిక దురాచారం. ఎన్నాళ్లయింది దాని మీద ఒక గట్టి సినిమానో, నాటకమో వచ్చి? ‘వరవిక్రయం’ నేటికీ ఆ లోటు తీరుస్తూ ఉంది. పశ్చిమగోదావరి జిల్లావాసి కాళ్లకూరి నారాయణరావు గారు వందేళ్ల క్రితం రాసిన నాటకం ఇది. ఆయన గనుక ఇది రాయకపోయి ఉంటే తెలుగు నాటకరంగపు ముత్యాలదండలో ఒక మణిపూస ఉండకపోయేది కదా? ఎల్లకాలాలకూ తట్టుకొని నిలిచే ఈ నాటకాన్ని చేజార్చుకునేవాళ్లం గదా? ఎన్ని వేల నమస్సులు చెబితే మాత్రం తెలుగు జాతి ఆయన రుణం తీర్చుకోగలుగుతుంది?

చెప్పడానికి చాలా చిన్న కథ! ఇద్దరు ఆడపిల్లలున్న ఇల్లు. చీకూచింతా లేని చక్కని సంసారం. పెద్ద పిల్ల పెళ్లీడుకు వచ్చింది. వరుడు కావాలి. తల్లిదండ్రులు వెతగ్గా వెతగ్గా దొరికాడొకడు. పిల్లకు ఈడూజోడు. కానీ అతని తండ్రి పరమ పిసినారి. కట్నం ఐదు వేలు పోయక తప్పింది కాదు. ఇది ఆ చిన్నదానికి ఇష్టం లేదు. ఆ ఐదు వేల కోసం ఉన్న పొలాన్ని అమ్మారన్న సంగతి కలతపెట్టింది‌.

ఎలాగైనా ఈ పెళ్లి తప్పిపోవాలి. దేవుడి మీద భారం వేసి నూతిలో దూకి ప్రాణాలు తీసుకుంది. కానీ అటు మొగపెళ్లి వారికి ఇంత భారీ కట్నం పోగొట్టుకోవడం ఇష్టం లేదు. మరి ఏమిటి సాధనం? రెండో పిల్ల ఉందిగా! ఆ అబ్బాయికి తనని ఇచ్చి పెళ్లి చేశారు. రెండేళ్లు గడిచింది. ఆ పిల్ల కాపురానికి రాదు‌.

Ads

మామకు అసహనం. కోడలి కోసం కాదు, ఆమెకు తమ తరఫున పెట్టిన నగల కోసం. వాటిని తిరిగి తెచ్చుకుని, తన కొడుక్కి మరో పెళ్లి చేయాలని ఆలోచన. విషయం కోర్టు దాకా వెళ్లింది. “నేను బోలెడంత కట్నం పోసి వరుణ్ని కొనుక్కున్నాను. అతనే నా ఇంటికి రావాలి” అందా అమ్మాయి. అందరూ వింతగా చూశారు. ఆ అమ్మాయి పట్టు వీడలేదు. అబ్బాయి తలవంచాడు. తన తండ్రి నీచబుద్ధి బయటపెట్టాడు. భార్య మాట అంగీకరించాడు. న్యాయమూర్తి వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చాడు. కథ ముగిసింది.

varavikrayam

“అబ్బే! అదంతా వందేళ్ల క్రితం మాట. ఇప్పుడలా లేదు” అని నాలుక చివరి మాటలు చెప్పొద్దు. ఇవాళా అదే పరిస్థితి నడుస్తోంది. నాటి ఐదు వేల కట్నం నేడు ఐదు, యాభై లక్షల దాకా పాకింది. కులాల గొప్పలు, కుటుంబాల తాహతు బట్టి రేటు పెరుగుతోంది. ఇవాళ్టికీ పేపర్లలో వరకట్న వేధింపుల కేసులు, చావులు, ఆత్యహత్యలు కనిపిస్తూనే ఉన్నాయి. ‘కట్నం’ అనే దురాచారానికి ‘కానుకలు’ అనే మాట తగిలించి, దాన్నొక ఆచారం, ఆర్భాటం చేసింది మనం కాదా? దానికి ‘స్త్రీ ధనం’ అనే నాజూకైన పేరు పెట్టి గొప్పలు పోతోంది మనం కాదా? ఇంకా ఈ ఆచారం కొనసాగిస్తోంది మనమే కదా! వాహ్ నారాయణరావు గారూ! వందేళ్ల క్రితమే ఎంత ఆధునికంగా ఆలోచించారు! జోహార్! కానీ మాకు ఇప్పటికీ బుద్ధి రానేలేదు.

Script and Dialogue Writing గురించి బోలెడంత చదువుతాం! వర్క్‌షా‌ప్‌లకు, క్రాష్ కోర్సులకు వెళ్తాం. కానీ నాటకాన్ని, అందునా తెలుగు నాటకాన్ని అధ్యయనం చేయడాన్ని మించిన సాధన ఉంటుందా? సినీ రచయితలు కావాలని తపనపడేవారిలో చాలామంది ఏవేవో చదువుతారు. కానీ తెలుగు నాటకం అనే విశిష్టమైన మెటీరియల్‌ని కనీస పరిగణనలోకి తీసుకుంటున్నట్టు కనిపించరు. ఈ నాటకం చూడండి! వరకట్నం తప్పు అని చెప్పే కథ. కానీ ఎక్కడా సీరియస్ టోన్‌తో కళ్లు ఒత్తుకునేలా సాగదు. ఆద్యంతం వ్యంగ్య, హాస్య సంభాషణలతో అలరిస్తూనే అసలు విషయాన్ని సూటిగా చెప్తుంది. ప్రతి సన్నివేశం ఆలోచింపజేస్తుంది. మచ్చుకు ఒక ఉదాహరణ చూడండి..

shubhalekha

గృహస్థు తన చిన్నకూతురి పెళ్లి చేశాడు. అదీ సంప్రదాయాలను అనుసరించి 16 రోజుల పెళ్లికి ఏర్పాట్లు చేశాడు. చూసేవారికి ఆనందమే! కానీ ఆడపిల్లని కన్నవారికి తెలుస్తుంది అసలు బాధ. దినదినగండం.. నూరేళ్ల ఆయుష్షు అనేలా ఉంటుంది పరిస్థితి. ఆ సమయంలో ఓ ఉదయం పూట ఇంటి పెరట్లో ఉన్నప్పుడు ఒకతను వచ్చి,

“అయ్యా! వియ్యపురాలుగారు లేచే వేళయింది. అమ్మగార్నింకా పంపించారు కారేం?”

“ఎందు నిమిత్తము?”

“ఎందునిమిత్తం అంటారేమిటి? వియ్యపురాలుగారికి తెలివిరాగానే కండ్లు తుడవాలి, కాళ్ళు మడవాలి, కోక సర్దాలి, కిందకు దింపాలి, పెరట్లోకి పంపాలి, నీళ్ళచెంబు అందివ్వాలి, రాగానే కాళ్ళు కడగాలి, పండ్లు తోమాలి, మొహం తొలవాలి, నీళ్ళు పోయాలి, ఒళ్ళు తుడవాలి, తల దువ్వాలి, కొత్తచీర కట్టాలి, కుర్చీ వెయ్యాలి, కూర్చోబెట్టాలి, పారాణి రాయాలి, గంధం పుయ్యాలి, అత్తర్లివ్వాలి, పన్నీరు చల్లాలి, మొహాన్ని మొహరీలద్దాలి, కళ్ళకు కాసులద్దాలి, వంటిని వరహాలద్దాలి, వెండి పలుపు వెనకను కట్టాలి, బంగారుపలుపు పక్కను చుట్టాలి, దిష్టి తియ్యాలి, హారతివ్వాలి, అద్ధాన్నమివ్వాలి, యిల్లాంటివి ఇంకా నా తలవెంట్రుకలన్ని ఉన్నాయి. ఆలస్యమైతే అలకకట్నం చెల్లించవలసి వస్తుంది. త్వరగా పంపించండి.”

‌.. చూడండి! ఎంత నైసుగా మొగపెళ్లివారు ఆడపిల్ల తల్లిదండ్రుల చేత పనులు చేయించుకుంటున్నారో! దాన్ని అంతే వ్యంగంగా రాశారు కాళ్లకూరి వారు. వింటుంటే హాస్యం ధ్వనిస్తుంది కానీ, నిజంగా అవన్నీ చేయాల్సిన స్థితిలో ఆ తల్లిదండ్రుల బాధ తల్చుకుని గుండె చివుక్కుమంటుంది. ఈ నాటకం నిండా ఇలాంటి సంభాషణలే చాలా పొందిగ్గా ఉంటాయి. హాస్యం పండిస్తూనే ఆలోచించేలా చేస్తాయి.

మీరింకా ఈ నాటకం చదవకపోతే తప్పక చదవండి. నాటకం చదవడం కుదరదు అనిపిస్తే యూట్యూబ్‌లో రేడియో నాటకం అందుబాటులో ఉంది. వినండి. సినీ/సాహిత్య రచయితలుగా మారాలని అనుకునేవారు అప్పుడప్పుడైనా నాటకాలను చదువుతూ వాటిని అధ్యయనం చేస్తూ ఉండండి.

PS: 1939లో సి.పులయ్యగారు ఈ నాటకాన్ని ఇదే పేరుతో సినిమాగా తీశారు. నటి భానుమతి రామకృష్ణ గారికి అదే తొలి సినిమా. అందులో ఆమె కాళింది (పెద్ద కూతురు) పాత్ర పోషించారు. కె.విశ్వనాథ్ గారు తీసిన ‘శుభలేఖ’ సినిమాకీ ఈ నాటకమే స్ఫూర్తి…. – విశీ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions