Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కదిలిందీ కరుణ రథం, సాగిందీ క్షమాయుగం… వావ్ జాన్సన్…

August 23, 2025 by M S R

.

Bharadwaja Rangavajhala.....   చలన చిత్రాలను ప్రేక్షకులు కేవలం వినోదం కోసమే చూస్తారంటే నేను నమ్మను. ప్రజల కష్ట సుఖాలు, వారి సమస్యలకు పరిష్కారాలూ చెప్పే చిత్రాలు కూడా చూస్తారు. అసలు సినిమా లక్షణం, ప్రయోజనం అదేనని నా గట్టి అభిప్రాయం. అని ఓ సందర్భంలో చెప్పారు మోదుకూరి జాన్సన్.

జాన్సన్ ఎవరో కాదు…. కళావాచస్పతి జగ్గయ్య గారి శిష్యుడు. జాన్సన్ కొంత కాలం దుగ్గిరాల స్కూల్లో చదువుకున్నాడు. అప్పట్లో జగ్గయ్యగారు దుగ్గిరాల స్కూల్లో టీచరుగా ఉన్నారు. ఆయన దగ్గర చదువు సాహిత్యం , నాటక రచన అన్నీ నేర్చుకున్నారు జాన్సన్. ఆ జగ్గయ్యే ఇండస్ట్రీలోనూ బాసటగా నిలచారు.

Ads

గుంటూరు ఎసీ కాలేజీలో బియ్యే చదివినప్పుడు ఇంగ్లీషు లెక్చరర్ రోశయ్య, ఆ తర్వాత లా చదవడానికి ఆంధ్రా యూనివర్సిటీ వెళ్లినప్పుడు అక్కడ కూర్మా వేణుగోపాలస్వామి జాన్సన్ లోని కవినీ, నాటక రచయితనీ నిద్రలేపి నిలబెట్టారు. ప్రపంచానికి పరిచయం చేశారు.

కొంత కాలం హైద్రాబాద్ రాష్ట్ర ప్రభుత్వ అనువాద శాఖలో పనిచేశారు జాన్సన్. అదే సమయంలో సుఖేలా నికేతన్ సంస్ధ స్థాపించి నాటకాలూ సంగీత రూపకాలూ ఆడేవారు. 1962లో తెనాలిలో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. రాడికల్ హ్యూమనిస్టులతో కలిసి తిరిగేవారు. నటనాలయం నాటకం రాశారు. తర్వాత దేవాలయం, హృదయాలయం, నాగరికత, నిచ్చెన మెట్లు ఇలా చాలా నాటకాలు రాశారు. ఆడారు.

నటనాలయం ఆంధ్ర నాటక కళాపరిషత్తులో ఉత్తమ రచన బహుమతి గెల్చుకుంది. జాషువా శిష్యరికంలో పద్యరచన కూడా ప్రారంభించారు జాన్సన్. జాన్సన్ సినీ పరిశ్రమకు ముందు గాయకుడుగా వచ్చారు.

జగ్గయ్య, తిలక్ ల ప్రోత్సాహంతో కె.ఎస్. ప్రకాశరావు తీసిన రేణుకాదేవి మహత్మ్యంలో పాటలు పాడడానికి తొలిసారిగా జాన్సన్ మద్రాసులో కాలు పెట్టారు. అయితే అనివార్య కారణాల వల్ల అది అవలేదు. ఆయన తిరిగి వెళ్లిపోయారు.

అక్కినేని మరో ప్రపంచం సమయంలో రచయితగా తిరిగి మద్రాసు వచ్చి స్థిరపడిపోయారు. శ్రీశ్రీ, ఆత్రేయ రేంజ్ లో సినిమా పాటలు రాసిన కవి మోదుకూరి జాన్సన్. జాన్సన్ కూడా ఆత్రేయ లానే… రంగస్థలం మీద నుంచి సినిమాల్లోకి దూకేశారు. స్క్రిప్ట్ లేమిటి…మాటలు పాటలూ కూడా రాసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. జాన్సన్ కీ ఆత్రేయకీ చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఇద్దరూ నాటకాల నుంచి వచ్చిన వారే…

  • ఇద్దరూ మాటలతో పాటు పాటలూ అల్లిన వారే. రాసిన మాటల్లో నిప్పులు కురిపించిన వారే.

జాన్సన్ రాసిన నటనాలయం నాటకం చూసి అక్కినేని మరో ప్రపంచం చిత్రం కోసం రికమండ్ చేశారు గుమ్మడి. తొలి చిత్రంతోనే తానేమిటో ప్రూవ్ చేసుకునే అవకాశం రావడం విశేషం. జాన్సన్ లో సామాజిక స్పృహ కాస్త ఎక్కువే.

దళితుడుగా తాను పడే బాధలను చెప్పడానికి జాషువా గబ్బిలం రాశారు. జాన్సన్ అదే విషయాన్ని మరింత బలంగా వినిపించడానికి కాకి కవిత రాసి ప్రధమ ప్రపంచ తెలుగు మహాసభల వేదిక మీద చదివారు.

జాన్సన్ లో ఆ కసి తను మాటలు రాసిన ప్రతి సినిమాలోనూ కనిపిస్తుంది. జాన్సన్ చాలా మంది అనుకున్నట్టు కేవలం సందేశాత్మక తరహా గీతాలే రాయలేదు. అలాగే క్రైస్తవ గీతాలు మాత్రమే రాయలేదు. కొన్ని చిత్రాల్లో అద్భుతమైన డ్యూయట్లూ రాశారు. జాన్సన్ తో ఎక్కువ అనుబంధమే కాదు… అద్భుతమైన పాటలు రాయించుకున్న ఘనత మాత్రం కృష్ణకే దక్కుతుంది. జాన్సన్ సినిమాలో ఇన్వాల్వ్ అయితే ఎలాంటి సాహిత్యం వస్తుందనడానికి ఉదాహరణ కరుణామయుడు.

జాన్సన్ మాటలు రాసిన ఈ చిత్రంలోనే మహాకవి శ్రీశ్రీ స్థాయి గీతం ఒకటి అలవోకగా రాసేశారు. కదిలిందీ కరుణ రధం… సాగిందీ క్షమాయుగం… మనిషి కొరకు దైవమే కరిగి వెలిగె కాంతి పథం… ఈ పాట జాన్సన్ తప్ప ఎవరు రాసినా ఆ రేంజ్ లో వచ్చేది కాదని నిస్సందేహంగా చెప్పచ్చు. డైలాగ్ రైటర్ గా జాన్సన్ కు మంచి పేరు తెచ్చిన సినిమా ఉషశ్రీ వారి మానవుడు దానవుడు.

అవసరానికి మించి ఐశ్వర్యమిస్తే మనిషి కన్నూమిన్నూ కానబోడేమో… కడుపుకు చాలినంత కబలమీయకుంటే… మనిషి నీతీ నియమం పాటించడేమో… అంటూ దేవుడికి మానవుడిడి బలహీనతల గురించి వివరిస్తాడు జాన్సన్. రాసేది భక్తి గీతమే అయినా… అందులోనూ సామాజికాంశాన్ని జొప్పించడం జాన్సన్ ప్రత్యేకత. బాపు రమణల రాజాధిరాజులో జాన్సన్ ఓ పాట రాయడం చాలా స్పెషల్ అకేషన్.

మోదుకూరి జాన్సన్ చాలా ముందుచూపున్న కవి, రచయిత. అగ్రకులాల వారు మాత్రమే అవకాశాలు పొందుతారని అందరూ అనుకునే సినిమా రంగంలో దళితుడైన జాన్సన్ తన జండా ఎగరేయడం మామూలు విషయం కాదు. రామానాయుడు, కృష్ణ లాంటి నిర్మాతలు జాన్సన్ ను కోరి మరీ తన సినిమాల్లో రచన చేయించుకున్నారు.

పాడి పంటలు సినిమాలో శ్రీశ్రీ రాసాడనిపించే పాటొకటి రాసారు జాన్సన్. మన జన్మభూమీ బంగారు భూమీ అంటూ సాగే ఆ పాటలో నాగలితో నమస్కరించిన పారలతో ప్రణమిల్లి… గుండె గుప్పిట పట్టీ గుప్పెడు ప్రాణం జల్లితే… ఇలా సాగుతుందాయన కలం.

దళితుల ఆత్మగౌరవం కోసం కులాన్ని పేరు చివర పెట్టుకోవడమే మంచిదని 1970 ప్రాంతాల్లోనే… అంటే తను కాకి కావ్యం రాసే నాటికే అభిప్రాయపడిన క్రాంతి దర్శి జాన్సన్. సినిమాల్లో అవకాశాల కోసం జాన్సన్ ఎప్పుడూ వెంపర్లాడలేదు. అవే జాన్సన్ ను వెతుక్కుంటూ వెళ్లాయి.

త్రిపురనేని మహారధితో అభిప్రాయబేధాలొచ్చినప్పుడు… ఉప్పలపాటి విశ్వేశ్వర్రావుకు సైతం గుర్తొచ్చిన పేరు జాన్సనే. ఆ సినిమా దేశోద్దారకులు. తను డైలాగ్స్ రాస్తున్న సినిమాల్లో పాటలు రాయడం జాన్సన్ కు సరదా.

అది కూడా ఆత్రేయ నుంచి సంక్రమించిన అలవాటే. డైలాగ్స్ తో కుదరదు… పాట ఉంటే బాగుంటుందనుకున్న సన్నివేశాల్లో ఆ పాట కూడా తామే రాసేసే కెపాసిటీ ఉన్నవాళ్లు వీళ్లిద్దరూ. అలా రాసినా తమదైన ముద్ర వేసేవారు. దేశోద్దారకులు కోసం… జాన్సన్ రాసిన స్వాగతం దొరా సుస్వాగతం మరచిపోగలమా?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ధర్మస్థల కుట్ర బట్టబయలు… ఇక తదుపరి టార్గెట్స్ శృంగేరీ, ఉడిపి..?!
  • IF లేదా ఎర్లీ డిన్నర్..! మన గిర్నీకి, అంటే కడుపుకి కాస్త రెస్ట్ ఇవ్వండర్రా…
  • కేరళ నేతలు చాలా సింపుల్… మన వాళ్లకు ఎక్కడా లేని బిల్డప్పు…
  • భేష్ అనుపమా… ‘పరదా’ కప్పుకునీ భలే నటించావు…
  • నో, నో… ఈ శెట్లు ఎవరూ కోమట్లు కారు… జూనియర్‌తో చుట్టరికం ఏమిటంటే..?!
  • కదిలిందీ కరుణ రథం, సాగిందీ క్షమాయుగం… వావ్ జాన్సన్…
  • మన గగన్‌యాన్‌లో వెళ్లే తొలి భారత వ్యోమగామి ఎవరో తెలుసా..?
  • కాదేదీ అనర్హం… ఆధ్యాత్మిక రంగంలోకీ నార్త్ పంతుళ్లు వస్తున్నారు…
  • నువ్వు కేరళ ముఖ్యమంత్రివా..? కర్నాటక ముఖ్యమంత్రివా..?!
  • మీకేం తక్కువైంది..? ఇంకా ఎందుకు సర్ ఈ ప్రయాస..? వదిలేయండి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions