Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ జనాభిమానం ఫేక్ కాదు… కడుపుల్లో నుంచి తన్నుకొచ్చిన దుఖమే…

November 2, 2021 by M S R

‘‘దక్షిణాదికి, అందులోనూ కన్నడకే పరిమితమైన ఓ వారసత్వ హీరో… లీడ్ యాక్టర్‌గా చేసినవి మహా అయితే 30 లోపు… తన డెస్టినీ బాగాలేదు కాబట్టి చిన్న వయస్సులోనే గుండెపోటుకు గురయ్యాడు… అంతేకదా, మరెందుకు కన్నడ ప్రభుత్వం, ప్రజలు, మీడియా, సోషల్ మీడియా అతిగా రియాక్టయ్యాయి..? నిజంగా ఈ రేంజ్ నివాళికి అర్హుడా..?’’……. ఇదీ ఒకాయనకు వచ్చిన సందేహం..! ఈ సందేహానికి నిజంగా అర్థం లేదు… ఎందుకంటే జనానికి ఎవరిని ప్రేమించాలో తెలియదా..? తనను గమనిస్తున్నారు, భిన్నమైన తన వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తున్నారు, అందుకే కనెక్టయ్యారు… ఆ మరణం పట్ల దుఖితులయ్యారు… కంఠీరవ స్టేడియంలో ఒక రోజంతా ప్రజల అంతిమ నివాళ్ల కోసమే తన మృతదేహాన్ని ఉంచాల్సి వచ్చింది… కనీసం 10 లక్షల మంది ‘దండం’ పెట్టి ఉంటారని ఓ అంచనా… కర్నాటక అధికార యంత్రాంగం పది వేల మంది పోలీసుల్ని ఈ బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపుల డ్యూటీల్లో నియమించాల్సి వచ్చిందట… పూర్తి అధికార లాంఛనాలతో అంత్యక్రియల్ని జరిపారు… ముఖ్యనేతలంతా హాజరయ్యారు… పునీత్ మృతిపై ప్రజల్లో వెల్లువెత్తిన విషాదానికి ఇలాంటివెన్నో సూచికలు…

puneeth

కడపటి చూపు కోసం స్టేడియం కోసం వచ్చిన లక్షలాది మంది కరోనా భయాల్ని కూడా అధిగమించారు… తోసుకువస్తున్న ఆ జనాన్ని ఎవరూ కంట్రోల్ చేయలేని స్థితి… ఎవరికీ ఏమీ చెప్పలేని స్థితి… అదేసమయంలో జనం తమ చెప్పుల్ని బయటే విడిచిపెట్టేసి వెళ్లారు… పైన ఫోటో సాక్ష్యం… ఇలాంటివి అయిదారు కుప్పల చెప్పులు… తీసేసేకొద్దీ మళ్లీ మళ్లీ… ఆ చెప్పుల్ని అక్కడే వదిలేసి ఇళ్లకు వెళ్లిపోయారు… పునీత్ మీద ప్రజల అభిమానంలో కల్తీ లేదు, కృత్రిమత్వం లేదు… వాళ్ల కడుపుల్లో నుంచి పొంగిన దుఖమే అది… 29వ తేదీ పునీత్ రాజకుమార్ మృతి మీద గూగుల్‌లో సెర్చుల సంఖ్య అక్షరాలా కోటి దాటింది… రెండుమూడు రోజుల్లో పునీత్ సంబంధ సెర్చులు దాదాపు కోటిన్నర… ఎవరో చెప్పే పనిలేదు, గూగుల్ డెయిలీ ట్రెండ్స్‌లోనే కనిపిస్తుంది…

Ads

google

ఏవో నాలుగు పిచ్చిపాటలు, గెంతులు, రొటీన్ కథ, ఇమేజీ బిల్డింగ్ ఫార్ములా సినిమాలు తీసేయడంతో రాలేదు ఇది… తను పాపులర్ హీరోయే కావచ్చు, కానీ ప్రజలు తనలోని వేరే కోణాన్ని చూశారు… అది దాతృత్వం… మిగతా సొల్లు ముచ్చట్ల హీరోలతో పోలిస్తే పునీత్ ఆచరణలో పది మందికీ నిజంగా సాయపడ్డాడు… మరొకటి తన ప్రవర్తన… డౌన్ టు ఎర్త్… మామూలుగా సినిమా సెలబ్రిటీలు అనగానే వాళ్లకువాళ్లు దైవాంశ సంభూతులుగా భావిస్తారు… మబ్బుల్లో నడుస్తుంటారు… కానీ పునీత్ నేల మీదే నడిచాడు… నిన్న ఒక వార్త… సాధారణంగా దానం చేయబడిన ఒక కంటితో ఒకరికే కంటిచూపు ఇవ్వగలరు కదా… పునీత్ కార్నియాలను సపరేటుగా విడదీసి, నలుగురికి కంటిచూపునిచ్చారట… మరణానంతరమూ ఆ దేహం సేవ చేస్తూనే ఉంది… ఆ కుటుంబం మీద ప్రజల్లో సానుభూతి ఉంది… వీరప్పన్ బాధిత కుటుంబమని కాదు… ఫ్యాన్స్ అభిమానాన్ని సొమ్ము చేసుకుని అధికార పీఠాలు ఎక్కాలని, జనాన్ని ఇంకా దోచుకోవాలని వాళ్లు ఎప్పుడూ తహతహలాడలేదు… ఇండస్ట్రీకే పరిమితమయ్యారు…

puneeth

అన్నింటికీ మించి… నలువైపులా చెడు, స్వార్థం, శుష్క హృదయాలు మాత్రమే కనిపిస్తున్న దుష్ట, ఎడారి కాలమిది… అందుకే ఎవరు మానవతాకోణంలో వ్యవహరించినా సరే జనం వాళ్ల వైపు చూస్తున్నారు… అభిమానిస్తున్నారు… ప్రత్యేకించి కరోనా సంక్షోభం సమాజంలోని ప్రస్తుత మానవత్వ అసలు స్థాయి ఎంత హీనస్థితిలో ఉందో బట్టబయలు చేసింది… పునీత్ మీద వెల్లువెత్తిన అభిమానానికి అదీ ఓ ముఖ్య కారణమేమో…!! (కరోనా ఉచ్ఛదశలో… సొసైటీలో ఉన్నత దశలో ఉన్న అనేకులు దిక్కులేని చావులతో నేరుగా హాస్పిటల్ నుంచి స్మశానానికి తరలించబడి… అనాథల్లా కాలిపోయి, అస్థికల్లా ఇళ్లకు చేరిన దృశ్యాలు చూశాం…) ఈమధ్య కొన్నేళ్లలో ఏ సెలబ్రిటీ అయినా, ఏ నాయకుడైనా ఇంత గొప్ప ప్రజానివాళిని అందుకున్నాడా..? నిజం, ఎవరో అన్నట్టు… మన చావు మనం ఎలా బతికామో చెబుతుంది…!!  

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions