సంస్కారరహిత రాజకీయాలు, దిక్కుమాలిన బూతుల భాష, దిగజారుడు ఎత్తుగడలు ఆంధ్రా రాజకీయాల్లో అసాధారణం ఏమీ కాదు… వీళ్లు దేవుడిగా కొలిచే ఆ ఎన్టీయారే ఓసారి అసెంబ్లీలో శాసనసభ్యురాలు నన్నపనేని మీద ప్రయోగించిన పరమ ముతకతిట్టు ఎందరికి గుర్తుందో తెలియదు గానీ… అప్పట్లో పెద్ద రచ్చే అయ్యింది..! బోషిడికే అనే హిందీ పదానికి అర్థం జగన్మోహన్రెడ్డే స్వయంగా చెప్పేవరకు చాలామందికి తెలియదు కానీ ఎన్టీయార్ వాడిన బూతు అచ్చ తెలుగు, అది అందరికీ అర్థమయ్యే తెలుగు… ఆనాటి నుంచి ఈనాటికీ న బూతో న పాలిటిక్స్… కాకపోతే కొడాలి, పట్టాభి వంటి నేతలు ఈ సంస్కృతిని కొత్త శిఖరాలు ఎక్కిస్తున్నారు… ‘‘తిడితే మాత్రం ఎదురుతిరిగి తంతారా, ఆఫీసుల మీద దాడులు చేస్తారా, బీపీ పెరిగితే ఏం చేస్తారు అని సీఎం సమర్థిస్తాడా..? ఈట్కా జవాబ్ పత్తర్సే అన్నట్టుగా ఇలాగే ఇంకా చేస్తాం అని సజ్జల బెదిరించడం కరెక్టేనా..? జగన్కు రాజధర్మం తెలుసా..?’’ అని పచ్చ క్యాంపు తెగ ఆవేశపడుతోంది… ఇటు బాబు మార్క్ హైఫై, హైరేంజ్ నిరసన దీక్ష, అటు వైసీపీ జనాగ్రహ దీక్షలు… ఈ ట్రిపుల్ ఎక్స్ పాలిటిక్స్కన్నా… నల్లా నీళ్ల దగ్గర ఆడవాళ్ల బూతులు, కొట్లాట కాస్త సంస్కారయుతం అనిపిస్తుంది… శ్రీరెడ్డి, సరయు వంటి కేరక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు… కట్ చేస్తే..?
నిజానికి ఆంధ్రా రాజకీయాల్లో బూతులు పెద్ద విషయమేమీ కాదు, జనం కూడా అలవాటైపోయారు… అంతకుముందు కాస్త ఆం‘బూతులు’ అదుపులో ఉండేవి కానీ మరీ కొన్నేళ్లుగా మరీ చెలరేగిపోతున్నాయి… ఇప్పుడు పట్టాభి ఉద్దేశపూర్వకంగానో, నోరుజారో, కుట్రపూరితంగానో వాడిన బోషిడికే పదానికి అసలైన అర్థంకన్నా… దాన్ని తెలుగుదేశం క్యాంపు సమర్థించుకునే తీరు మరీ నీచంగా ఉంది… తిట్టుకన్నా ఘోరం… మంచీమర్యాద తెలిసిన నాయకుడిగా భావించే ఓ టీడీపీ లీడర్ ఏమంటాడంటే..? ‘‘గుజరాత్లో ఆ పేరుతో ఓ ఊరుంది… బ్రిటిష్ వారు అమాయకుల్ని ఈ పేరుతో సంబోధించేవాళ్లు… ఈ పదానికి అసలు అర్థం మీరు బాగున్నారా అని…!’’ వైసీపీలోనే ఉన్న ఓ మిత్ర వ్యతిరేకి కూడా దాదాపు అదే చెప్పుకొచ్చాడు… ఓ హిందీ పాటలో పద్దెనిమిది సార్లు ఈ పదం వాడారు తెలుసా అని కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు పోస్టులు… ఇలా రకరకాల సమర్థనలు…
Ads
అంటే..? పట్టాభి వాడిన ఆ పదం అభ్యంతరకరమేమీ కాదా..? గతంలో వైసీపీ వాళ్లు కూడా తిట్లు వాడారు కాబట్టి తెలుగుదేశం వాడటంలో తప్పు లేదనా..? మీరు బాగున్నారా అనే అర్థమే నిజమయ్యే పక్షంలో ఈ పద సమర్థకులు ఎవరినైనా పలకరించేటప్పుడు ఈ పదాన్ని వాడగలరా..? నిజానికి మీ పాలన తీరు, మీ నిర్ణయాల తీరు చూసి కడుపు రగిలిపోయి మాకు తిట్లు వస్తున్నాయి, బరాబర్ తిడతాం అని నేరుగా, సూటిగా, ధైర్యంగా సమర్థించుకుంటే సరిపోయేదిగా…!! కానీ ఇలా తిట్లకు కొత్త అర్థాలు చెబుతూ, అసలు అది తిట్టే కాదు అనే పవిత్ర ముద్రలు దేనికి..? ఆ బూతుకు ఆమోదనీయతను తీసుకొస్తున్నారా..? దాన్ని వాడినా తప్పేమీ లేదని సమాజానికి చెబుతున్నారా..? ఇవేం పాలిటిక్సురా బాబూ..!!
Share this Article