.
Bharadwaja Rangavajhala …….. బూతుల్ని కాపాడుకుందాం…..
బూతుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రస్తుత తరం మీద చాలా ఉంది.
అసలు బూతు ప్రాధాన్యత ఏమిటో తెలియచెప్పాల్సిన బాధ్యత ముందు తరాల మీద అంతకన్నా చాలా ఉంది.
అందుకే… ఆ బాధ్యతతోనే ఇది రాస్తున్నా ….
కోపం ఆరోగ్యకరం ..
కోపం వస్తే బూతులు వస్తాయి అనే వాదన మీద నాకు కొంత అభ్యంతరం ఉంది …
ఎంచేతంటే కోపం వేరు…
ఆగ్రహం వేరు అనుకుంటాన్నేను.
ఆలోచన ప్లస్ కోపం ఆగ్రహం అని చెప్పుకోవచ్చేమో …
ఇది శుద్ద తప్పని అనుకుంటే బూతులు తిట్టకుండా చెప్పండి …
తిట్టినా పర్లేదు … నేను అలవాటు పడిపోయేసాను.
Ads
ఇక మళ్లీ టాపిక్కులోకి వస్తే …
బూతులు మన జీవితంలో చాలా భాగమైపోయాయని ఆ మధ్య ఓ సినిమా రచయిత తన తెలివితేటలు ఒలకబోశాడు.
పాలబూతు, పోలింగ్ బూతు, టెలిఫోన్ బూతు ఇలా…అని కాదుగానీ
మన జీవితంలో భాగమైన బూతును అనవసరంగా పలుచన పరుస్తున్నామనేదే నా ఆవేదన.
శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రిగారు ఓ అరుగుమీది సంగీత విద్వాసుడికి క్లాసు పీకుతారు.
అక్షరాన్ని నీ ఇష్టమొచ్చినట్టు విరిచేసి పాడడమేనటయ్యా సంగీతం?
ఒక్కో రాగానికీ నిర్ధిష్టమైన లక్షణం ఉంది…
భావం ఉంది…
ఇలా సాగుతాయి డైలాగులు.
ఆ మాటలు అప్పట్లో నాకు అర్ధం కాలేదు. కానీ ..ఇప్పుడు బూతు కాంటెక్ట్స్ లో మాత్రం విపరీతంగా అర్ధం అయ్యాయి.
పిల్లలు బూతులు మాట్లాడుతున్నారని పెద్దోళ్లు కొట్టేస్తారు.
అది తప్పు.
బూతు యొక్క గొప్పతనం తెలుసుకో అని వాళ్లకి వివరంగా చెప్పాలి.
అంతే తప్ప బూతులు మాట్లాడుతున్నారని వాళ్లని బూతులు తిట్టకూడదు.
చాలా ఆదర్శాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఉదాహరణకు ఆ మధ్య టీవీలో అమీర్ ఖాన్ అనే ప్రముఖ బాలీవుడ్ నటుడు కనిపించి వీధుల్లో మూత్రించే వాళ్లని పట్టుకుని వాళ్లేదో దేశద్రోహులుగా మాట్లాడేస్తారు.
అది చూడగానే మా మనసు చివుక్కుమంది.
ఏదో పనిమీద వీధిలోకి వెడతాం.
బస్సులు దొరకవు..
రెండు బస్సులు మారి వెళ్లాల్సి వస్తుంది.
ఒక్కో బస్సు కోసం చాలా సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది.
ఫైనల్ గా దిగేప్పుడు కడుపు ఉబ్బిపోయి ఉంటుంది.
చేయాల్సిన పని ప్రశాంతంగా చేసుకోవడానికి అవకాశం ఇవ్వదు.
అప్పుడు ఎక్కడో అక్కడ జానెడు జాగా చూసుకుని పని కానిస్తే తప్ప మన అసలు పని ప్రశాంతంగా అవదు.
ఈ ఆదర్శవంతులైన సినిమా నటులకేమో పెద్ద పెద్ద కార్లుంటాయి.
వాళ్లు వెళ్లాల్సిన చోటికి అరగంటలో వెళ్లిపోతారు. అక్కడ హాయిగా పనులు చూసుకుంటారు.
వీధుల్లో పోయాల్సిన అవసరమే వాళ్లకు ఉండదు. కనుక వాళ్లు ఆ లెవెల్లో ఆదర్శం చెప్తారు.
ప్రతి సందులోనూ…
సామాన్యులకు అందుబాటులో ఏర్పాట్లు చేసి అప్పుడు ఆదర్శాలు చెప్పాలనేదే నా ఆవేదన.
అది మానేసి ఆదర్శం మాత్రమే చెప్తే కుదరదు.
అనుకోకుండా వేరే గొడవలోకి వెళ్లిపోతున్నాను … అది కాదు …
విషయం ఏమిటంటే … బూతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతగా పెరిగిపోతోందో చెప్పాలనేదే నా యీ ప్రయత్నం.
అందులో భాగంగా ముందు అసలు బూతు అంటే ఏమిటి?
దానికున్న ప్రాధాన్యత ఏమిటి అనేది ఓ సారి చూద్దాం.
మహాకవి శ్రీశ్రీ దొంగ లంజకొడుకులసలే మెసలే ఈ ధూర్తలోకంలో అని రాశారు.
మరీ కవిత్వంలోకి బూతులు తెచ్చేస్తున్నాడని ఆయన్ని అప్పటి పెద్దలు కేకలేశారు.
అలాగే దిగంబర కవుల కవిత్వంలో బోల్డు బూతులున్నాయని కూడా పెద్దలు మండిపడ్డారు. కవిత్వానికి కాని కాలం వచ్చిందని పెద్ద బోల్డు ఏడ్చారు కూడా.
అప్పుడు మళ్లీ మహాకవి శ్రీశ్రీయే కల్పించుకుని అయ్యా దిగంబర కవిత్వంలో అంత బూతు ఉండడానికి కారణం ఇదీ అని వివరించారు.
విన్నోళ్లు విన్నారు… విననోళ్లు విన్లేదు.
ఇంతకీ ఆయనేం చెప్పారంటే….
ఇప్పుడు ఆ మధ్య ఎప్పుడో మన స్వాతి వడ్లమూడి రాసిన కవితలో బూతు వాడారంటే విషయం అల్లా చెప్తే తప్ప కుదరదనే పాపం …
దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు …
శ్రీశ్రీకీ దిగంబర కవులకూ వర్తించిన సూత్రమే ఇక్కడానూ …
బూతు అనేది ఓ ఎమోషన్ తాలూకు ఎక్స్ ప్రెషన్. ఓ భావావేశాన్ని ప్రకటించే బాష.
ఆగ్రహం పరాకాష్టకు చేరినప్పుడు ఆ భావాన్ని ప్రకటించే భాషే బూతు.
సమాజం మీద తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తీకరించడానికి దిగంబర కవులు బూతును ఆశ్రయించారని…
అంతే తప్ప వాళ్లు కావాలని బూతు రాయలేదని బల్ల చరిచి మరీ ప్రకటించారు.
అది బూతు దర్శనమంటే.
అదే ఈ తరంలో లోపించింది.
ఆ ఎరుకను కలిగించడమే ఈ వ్యాస పరమార్ధం.
ప్రతి మాటలోనూ బూతు…
ఎక్కడ పడితే అక్కడ బూతు వాడేస్తే… బూతు కామనైపోదా అని నేను జాతిని ప్రశ్నించదల్చుకున్నాను.
ఇందాక మనం చెప్పుకున్న విషయాన్నే మరోసారి చెప్పుకుందాం.
శంకరాభరణం శంకరశాస్త్రిగారు చెప్పినట్టు ఒక్కో భావానికి ఒక్కో భాష ఉంటుంది.
కోపం యొక్క అగ్రేసివ్ నెస్ చెప్పడానికి బూతును ఒక భాషగా భగవంతుడు మానవాళికి దయచేశాడు.
ఇక బూతు అవసరం లేకపోయినా వాడేవాళ్లు ఆధిపత్యభావజాలం బాగా బలిసిన వాళ్లు.
ఇప్పుడు ఇళ్లల్లో పెళ్లాలపై ఉత్తి పుణ్యానికి బూతు వాడతాడు భర్త.
ఎందుకంటే జీవితం పట్ల వాడి అసంతృప్తి … ఆగ్రహంగా మారి … అది ఆవిడ చెప్పే సమస్యలు విని పరాకాష్టకు చేరి … తన బలహీనతలను కప్పిపుచ్చుకోడానికి ఆమెపై బూతులతో ముందూ తన్నులతో తర్వాతా దాడికి దిగుతాడు.
ఇక్కడ వాడు కూలీ అయినప్పటికీ … అణచివేతకు గురయ్యేవాడే అయినప్పటికిన్నీ … వాడు ఏ అధికారంతో భార్య పైనా పిల్లలపైనా బూతు వాడుతున్నాడు …?
భర్త తండ్రి అనే రెండు ఆధిపత్య పదవులు తన కిందున్నాయనే కాన్ఫిడెన్సుతో ..
సరిగ్గా …
ఇదే కొందరు పురుషుల్లో వ్యక్తమౌతుంది.
ఆడవాల్లు కనిపించగానే లేదూ ఆడవాళ్ల గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడూ అదీ అని వాడేస్తూంటారు …
చాలా చిన్న పిల్లలు అంటే ఇంటరూ అవీ చదివే మగ పిల్లల్లో కూడా ఈ ధోరణి చూశాన్నేను.
స్కూల్లో టీచర్లు కొట్టిన సందర్భాల్లో వాళ్లు ఫ్రెండ్స్ మధ్య ఆ టీచర్ గురించి పరమ దరిద్రమైన బూతు భాషలో మాట్లాడుకోవడం విని ఖంగుతిన్నానోసారి …
అప్పుడూ ఆ పిల్లాడిలో పని చేసింది నేను మగాణ్ణి నన్ను ఒక్క ఆడుది కొట్టుటయా అనే ఆధిపత్య భావజాలమే …
నేను మగాణ్ణి ఆడవాల్లని తిట్టుట కొరకూ … కొట్టుట కొరకూ మాత్రమే పుట్టి ఉంటిని అనే ఓబీ పాజిటివ్ అనే వ్యాధి ముదిరిపోవడం వల్ల ఉత్పన్నమైన సమస్య అది.
ఇక పోతే …
ఆ బూతును అంతే పవిత్రంగా కాపాడుకోవాల్సి ఉంది.
రోజూ రాత్రి పూట టీవీ ఛానళ్లలో హాస్యం పేరుతో బోల్డు బూతు ప్రసారం అవుతోంది.
గురజాడ వారి కన్యాశుల్కంలో హాస్యాన్నే శబ్దాశ్రయ హాస్యం అని విమర్శకులు ఆ రోజుల్లో తూర్పారపట్టారు.
అంటే ఇంగ్లీషు, తెలుగు పదాల కలయికతో విచిత్రమైన శబ్దాన్ని పుట్టించడం ద్వారా హాస్యం పుట్టించారు తప్ప అందులో నిజమైన నిఖార్సైన హస్యం లేదని వారి తాత్పర్యం.
నిజానికి ప్రస్తుతం టీవీల్లో ప్రసారమౌతున్న హాస్యకార్యక్రమాలతో పోలిస్తే అది ఎంతో గొప్ప విషయం.
బూతాశ్రయ హాస్యాన్ని గురించి ఎవరూ పట్టించుకోకపోవడం దారుణం.
ఎంతో ఉన్నతమైన బూతును హాస్యం కోసం పలచన చేయడం బూతాభిమానులను కలచివేస్తున్న అంశం.
బూతును విచ్చలవిడిగా వాడేస్తే అది పలచపడిపోయి…
అయిన దానికీ కానిదానికీ ప్రతి ఒక్కరూ బూతు మాట్లాడేస్తే….
బూతు ఏమైపోవాలి?
బూతుకు విలువిచ్చిన రోజుల్లో మహాకవి శ్రీశ్రీ సమాజం మీద తనకున్న కసిని చెప్పడానికి దొంగ లంజకొడుకులసలే మెసలే అంటే సరిపోయింది.
ఇప్పుడు పాపం ఎవరావిడ స్వాతి … పాపం దానికి నాలుగొందల రెట్లు ఎఫెక్టివ్ బూతు వాడితే కాని కుదరని పరిస్థితి ఏర్పడింది .
టీవీ ఛానళ్లలో వస్తున్న ఈ బూతు హాస్య కార్యక్రమాలకు జడ్జ్ లు కూడా బూతులు అలవోకగా మాట్లాడేస్తూ… అదేంటంటే … ప్రజాస్వామ్యం అనేస్తున్నారు.
బూతాశ్రయ హాస్యంతో కార్యక్రమాలు నిర్వహించాల్సి రావడం ఛానళ్లు తమ దౌర్భాగ్యంగా భావించనంతకాలం ఇవి తప్పకపోవచ్చు.
కానీ వీటిని అడ్డుకోవాల్సిన అవసరం మాత్రం బూతు ప్రేమికులుగా అందరి మీదా ఉంది.
ఒక ఎక్స్ ప్రెషన్ కోసం కేటాయించిన భాషను మరో ఎక్స్ ప్రెషన్ కోసం వాడడం భాషాధర్మశాస్త్ర విరుద్దం. ఎంటర్ టైన్ మెంట్ అంటే బూతు కాదనే విషయం ముందుగా ఎంటర్ టైన్ మెంట్ ఛానళ్ల యజమానులు గుర్తించాలి.
ఈ బూతాశ్రయ హాస్య కార్యక్రమాన్ని ప్రసారం చేసే చానల్ యజమానికి తెలుగు భాషను ఉద్దరించే మహత్తర కర్తవ్యం కూడా ఉంది.
అందుకోసం ఆయన పాత భారతి లెవెల్లో ఓ పత్రిక కూడా నడుపుతున్నట్టుగా చెప్పుకుంటారు .
మళ్లీ ఈ బూతు వెలుగేమిటి తండ్రీ?
కేవలం రేటింగ్స్ కోసం ఇలా బూతును వీధిపాలు చేయడం దారుణం అనే విషయం వారు గుర్తించగలగాలి.
నిజానికి ఎవరూ చదవలేని వినలేని బూతులతో ఆగ్రహాన్ని వ్యక్తం చేయాల్సి ఉండి కూడా…
అందరూ బూతైపోతున్న వేళ మనమూ బూతుల్ని అపవిత్రం చేయడం భావ్యం కాదని భావించి మాత్రమే ఇలా చాలా బ్యాలెన్స్ డ్ గా రాస్తున్నాను.
ప్రపంచ బూతు ప్రేమికులంతా ఏకమై…
బూతు పరిరక్షణోద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.
అలాగే ఈ పురుషాధిక్య బూతును గట్టిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ..
మగ పిల్లల నుంచీ మగ రచయితల వరకు అందరూ కూడా కాస్త ఏమనుకోకుండా సైకియాట్రిస్టులను కలసి తగు వైద్య సహాయం తీసుకోవాలని నా విజ్ఞప్తి.
గృహాల్లో భార్యల మీదా , పిల్లల మీదా వాడే మధ్య దిగువ మధ్యతరగతి అంతకన్నా అధమ స్థాయి భర్తలు కూడా బూతు వాడకం తగ్గించడం మీద కాస్త దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది.
ఏదేమైనా ఓబీ పాజిటివ్, అదేనండీ ఒళ్లు బలుపు పాజిటివ్ తో బూతు వాడితే మాత్రం కాస్త ఖండించాల్సిన అవసరం ఉందనేది వాస్తవం… పాతదీ కొత్తదీ కలిపి చాలానే రాస్సేను … క్షమించండి …
ఆధిపత్య బూతును ఏ రూపంలోనూ క్షమించకూడదు అని మాత్రం ఘట్టిగా చెప్పదల్చుకున్నానండీ … అదీ సంగతి …
ఇప్పుడూ మనం సీరియస్ గా వ్యతిరేకించాల్సింది .. ఆధిపత్య బూతును మాత్రమే …
ప్రేమ బూతు కూడా ఉంటుంది…
అంటే … పిల్లల్ని ప్రేమగా తిట్టే కొన్ని బూతులుంటాయి.
.. అలాగే భార్యా భర్తల మధ్య ఆధిపత్యానికి తావులేకుండా అలాగే ప్రేమికుల మధ్యా దొర్లే కొన్ని ప్రేమ బూతులుంటాయి..
వాటితో మనం ఇబ్బంది పడకూడదు ..
ఆధిపత్య బూతు ఎక్కడున్నా దాన్ని చీల్చి చండాలన్నదే నా ఉద్దేశ్యమని చెప్పడమైనది… హమ్మయ్య ఇది కూడా చెప్పేశాను …
Share this Article