భంగ్ క రంగ్ జమాహొ చకాచక్!…. గంజాయిరాక్షసీకరణ
ఇవ్వాళ్టి పరిస్థితుల్లో గంజాయి [Cannabis] ఘనతను చెప్పడం అంటే కొరివితో తల గోక్కున్నట్లే! నేను టేకప్ చేసి రాసిన అంశాల్లో అత్యంత వివాదాస్పదమైంది బహుశా ఇదే అవ్వొచ్చు! ఫర్వాలేదు, ఇది నచ్చని వాళ్లెవరైనా తిట్టినా కూడా సహిస్తాను, కానీ గంజాయి గత వైభవాన్ని మాత్రం చెప్పి తీరుతాను!
మీలో ఎవరైనా అమితాబ్ బచ్చన్ Don సినిమాలోని ఒ కైకే పాన్ బనారస్ వాలా.. ఖులిజాయ్ బంద్ అకల్ కా తాళా.. అన్న పాట విన్నారా? ఒకవేళ వింటే, ఆ సాంగ్ ఇంట్రోలో ‘అరె, భంగ్ క రంగ్ జమాహొ చకాచక్’ అంటూ గంజాయి ప్రస్తావన ఉంటుంది!
Ads
అదిగో.. మనిషి మేధస్సు తాళం తెరిచే ఆ గంజాయిదే ఈ దీనగాధ! ప్రకృతి సిద్ధమైన ఆ చిన్న చెట్టును నిషేధిత జాబితాలో చేర్చిన పాశ్చాత్య వలస పాలకుల దుర్మార్గపు క్రీడా కథానిక! శునకానికి పిచ్చి కుక్క ముద్రవేసి చంపాలనే కోవలోనే అచ్చంగా జరిగిన గాంజా రాక్షసీకరణ కథా కమామీషు! మానసిక వేదనా విముక్తికర్త [Liberator] గా, భారతీయ మేధస్సుకు ఇంధనంగా, హైందవుల ఆనందకారకంగా పేరును పొంది అతి ఘనమైన గతమున్న పవిత్రగుల్మం [SacredHerb] ఛరస్ ప్రాచీన చరిత!
అనేక సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలకు ఈ వేద భూమి పుట్టినిల్లని మనకు తెలుసు! సైన్స్ పుట్టుక, ఆ పేరిట మానవుని పరిసరాలు, భూమి, సౌరవ్యవస్థ, విశ్వం వాటి ఆవిర్భావం తదితర విషయాలపై జరుగుతున్న పరిశీలనలు, పరిశోధనలది కేవలం కొన్ని వందల ఏళ్ల నేపథ్యమే! కానీ, వైదిక విజ్ఞాన వికాసం జరిగి కొన్ని వేల ఏళ్లు ఔతోంది! అది, పాశ్చాత్యుల కంటే ముందే, ప్రకృతిలోని ప్రతి చిన్న విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి, అనేక మర్మాలను ఛేదించింది! ఏయే సహజ వనరులు మానవాళికి మేలు చేస్తాయి, వేటి వల్ల కీడు సంభవిస్తుందని నిగ్గు తేల్చే మహత్తర, బృహత్తర కార్యాన్ని సనాతనధర్మం ఏనాడో తన భుజస్కంధాలపై ఎత్తుకొంది! ఒక స్పష్టమైన అవగాహన, అంచనాలతో ఆ విజ్ఞానాన్ని వేద వాఙ్మయాల రూపంలో భవిష్యత్తు తరాలకు అందించింది!
గాంజా లేదా ఛరస్ లేదా హషిష్! అంటే ఎండిన పూల మొగ్గలు, సటైవా [Sativa] మొక్క ఆకుల మిశ్రమం! అదొక నొప్పి నివారిణి [PainRelaxant], ప్రశాంత చిత్త [PeaceOfMind] ప్రదాయిని! అంతెందుకు, పండితుల నుంచి పామరుల వరకు పీల్చే నశ్యం పొడి మనిషి అభిజ్ఞతాశక్తి [CognitivePower] ని పెంచి, మెదడు చురుగ్గా పని చేయడానికి దోహద పడుతుందంటే నమ్ముతామా! అందుకే, భారతీయుల మేధస్సు అనితర సాధ్యమైందంటే విశ్వసిస్తామా! ఖచ్చితంగా ఒప్పుకోం!
ఎందుకంటే గంజాయి మీద మనకు ఏర్పడిన తప్పుడు అభిప్రాయం మనను అలా చేయనీయదు! సరే, కాసేపు దాని మీద మనకున్న దురాభిప్రాయాన్ని పక్కన పెడితే, గంజాయి అనేది సంపూర్ణారోగ్యం, పునరుజ్జీవనం కలిగించే ఒక మహత్తర రసాయనం అన్నది పూర్వీకుల ఉవాచ! అది మనిషిలో ఉత్సాహాన్ని నింపి దీర్ఘాయువును ప్రసాదించే మూలిక అంటారు వాళ్లు! జంబూద్వీపం భరతఖండంలో గంజాయిది ఒక సంక్లిష్టమైన చరిత్ర! ప్రాచీన కాలంలో గాంజాను ఔషధ విలువలున్న పవిత్రమైన మూలికగానే పరిగణించారు! సాంప్రదాయక వైద్యంలో దాని పాత్ర విశిష్టమైనది! ఎన్నో మంచి లక్షణాలు కలిగిన ఆ మొక్కకు ఆ రోజుల్లో ఆధ్యాత్మిక గౌరవం కూడా దక్కింది!
అధర్వణవేదం, గంజాయిని ఎన్నో బాధలకు విముక్తికర్తగా, సంతోషాతిరేక [Euphoria] కారకంగా గుర్తించింది! తలనొప్పి, అలసట, ఇతర రుగ్మతలతో సహా వివిధ వ్యాధుల చికిత్సకు గంజాయి మంచి మందు అని సుశ్రూత సంహిత, ఆయుర్వేదగ్రంథాలు పేర్కొన్నాయి! ప్రాచీన వాఙ్మయాలు గంజాయి దానివల్ల ఒనగూరే లాభాలను స్పష్టంగా ప్రస్తావించాయి!
అలాంటి గంజాయి రాక్షసీకరణ పోర్చుగీసు వాళ్ల పాలనతో మొదలైంది! సాంప్రదాయ భారతీయ వైద్య విధానంలో గాంజాది ప్రత్యేక పాత్రే ఐనా, కలోనియల్ రూలర్స్ దాన్ని మనిషిలో నైతికక్షీణతను పురిగొల్పే, అతనిలో ఉత్పాదకతను తగ్గించడానికి దారి తీసే ఒక డ్రగ్ గా మాత్రమే చూశారు! ఆ కాలంలో హషిష్ వినియోగం పెరిగి, ప్రజలు విందులు వినోదాల్లో మునిగి తేలుతున్నారనీ, అది వస్తుత్పత్తి మీద తీవ్ర ప్రభావం చూపుతోందనే మిషతో పోర్చుగీసు కంపెనీ దాని వాడకాన్ని నిషేధించింది! అలా, గాంజాను బ్యాన్ చేసిన మొదటి రాష్ట్రంగా గోవా కూడా చరిత్ర పుటలకు ఎక్కింది!
ఆ తరవాత భారత్ కు వచ్చిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా అదే పంథాను అవలంభించింది! వాళ్లకు ఇక్కడ అతి చవకగా లభిస్తున్న శ్రామికశక్తి పై గాంజా తీవ్ర ప్రభావం చూపి ప్రొడక్టివిటీ తగ్గుముఖం పడుతుందని ఆందోళన పడ్డ బ్రిటిషర్లు, ఆ మొక్క దుర్వినియోగం ఔతోందనీ, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతోందనే నెపం మోపి దాన్ని బ్యాన్ చేశారు. ఇక అది మొదలు, ఆ నిషేధం అలా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది!
ఇక, భంగ్ [గంజాయి బై ప్రొడక్ట్] అనేది గంజాయి మొక్క ఆకులు, పువ్వుల నుంచి తయారుచేసే ఒక సాంప్రదాయిక పానీయం. వైదిక ధర్మంలోని త్రిమూర్తుల్లో ఒకరైన శివుడిని లార్డ్_ఆఫ్_భంగ్ అని సంబోధించడం కద్దు! గంజాయి మొక్క ఉనికిని, దానిలోని ఔషధ గుణాలను మొట్టమొదట కనుగొన్నది శివుడు అని అంటారు! ఆ సంకేతంగా త్రినేత్రుడి చేతిలో ఎప్పుడూ భంగ్ ఆకు ఉంటుందట! ఈ పానీయాన్ని మహేశ్వరునికి నైవేద్యంగా కూడా పెడతారు! సిద్ధులు, సన్యాసులు భంగ్ సేవించడం, గంజాయి పీల్చడం మనం రోజూ చూస్తూనే ఉంటాం! చిక్కటి పాలు, అల్లం, యాలకుల వంటి సుగంధ ద్రవ్యాలతో భంగ్ ను కలిపి హోళీ పండగ, శివరాత్రి మహా పర్వాల సందర్భంగా సేవించడం ఆనవాయితీ! మనసును ఉత్తేజపరిచి, శారీరకబడలికను మటుమాయం చేసి ప్రశాంతతను కలగ జేయడం భంగ్ ప్రధాన లక్షణం!
అలా పాతుకుపోయిన చారిత్రక నేపథ్యం కారణంగా గంజాయికున్న మెడిసినల్ ఇమేజ్ రానురాను పూర్తిగా పడిపోయింది! అదొక చెడు ప్రకృతివనరుగా చెలామణీలో ఉండిపోయింది! ఇంతా అంతా అని కాదు, ఛరస్ ఎంత కన్జ్యూం చేసినా అది నేరమే, శిక్షార్హమైన అన్న స్థితి వచ్చేసింది! అలా, తులసి వనంలో గంజాయి మొక్క లాంటి నానుడులు సైతం పుట్టుకొచ్చాయి! వాస్తవానికి గాంజాలో కూడా తులసిలో ఉన్న ఔషధ గుణాలే ఉన్నాయన్నది శాస్త్రాల పరిశీలన!
కాకపోతే, మోతాదు మించితే గంజాయి ప్రమాదకరం, ఆరోగ్యానికి హానికరం! భారత్ మినహా ప్రపంచంలోని అనేక దేశాల్లో గంజాయి వాడకంపై నిషేధం లేదు! అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు నిషేధాన్ని ఎత్తేశాయి. హైయెస్ట్ మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఛరస్ లాంటి వాటిపై ఇల్లీగల్ ముద్రవేసి, వాటిని చట్టబద్ధంగా బ్యాన్ చేసిన తెల్లదొరలు, పొద్దున్నే ఛాయ్ సేవించే అవలక్షణాన్ని, జాఢ్యాన్ని, బ్యాడ్ కల్చర్ ను మాత్రం భారతీయులపై రుద్ది పోయారు! అసలు ఛాయ్ లాంటి పానీయాల్లోనే డ్రగ్ కంటెంట్ అధికంగా ఉంటుంది అనేది శాస్త్రీయంగా నిర్ధారణ ఐన అంశం! అది మరచి అస్తమానం మన అలవాట్లను, సాంప్రదాయాలను మనమే కించపరుచుకుంటూ నిందిస్తుంటాం!
హెచ్చరిక :: భారతీయ శిక్షాస్మృతి ప్రకారం గంజాయి సేవించడం హానికరం, దాని సాగు చట్టరీత్యా నేరం! ఇది ప్రోత్సహించే కథనం కాదు, అకడమిక్ వ్యాసం మాత్రమే #SurajVBharadwaj
Share this Article