సినిమా నటుడు ఆలీ… ఇండస్ట్రీలో అందరికీ ఇష్టుడే… చిన్నప్పటి నుంచీ కష్టపడ్డాడు… కుటుంబాన్ని ఆదుకున్నాడు… పదిమందికీ సాయం చేస్తాడు… నవ్వుతూ, నవ్విస్తూ సాగిపోతున్నాడు… కానీ ఒక్కసారిగా తనకు తీవ్ర అసంతృప్తి… అదీ జగన్ వైపు నుంచి..! అసలు జగన్ పట్ల మద్దతుగా నిలిచిన సినిమావాళ్లు ఎవరున్నారు..? పోసాని వంటి ఒకటీరెండు కేరక్టర్లు తప్ప… పవన్ కల్యాణ్‌కు సన్నిహితుడైనా, చంద్రబాబుతో సత్సంబంధాలు ఉన్నా ఆలీ జగన్‌కు మద్దతుగా ఉన్నాడు, పార్టీలో చేరాడు… మరి ఆ ఆలీకి జగన్ ఏం ఇవ్వగలిగాడు..?
ఇవ్వడానికి ఏ పదవీ లేకపోతే అత్యంత ఉదారంగా ఓ సలహాదారు పోస్టు పడేస్తాడు కదా జగన్… ఇక్కడా అదే జరిగింది… ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అట… నెలకు 3 లక్షల దాకా ఇస్తారట… కొన్ని అలవెన్సులు కూడా… అది ఆలీకి పెద్ద విషయం కాదు… పోనీ, ఏదో గుర్తింపు అనుకుందామా..? అదేం గుర్తింపు అసలు..? ఆ పోస్టులో తనేం చేయాలి..? జగన్ మీద తెల్లారిలేస్తే ట్యాంకర్ల కొద్దీ విషం కక్కే ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 చానెళ్లను మేనేజ్ చేయాలా..? వాటి తాట తీయడం ఎలాగో జగన్‌కు సలహాలు ఇవ్వాలా..?
‘నీకెందుకు, నీ గురించి నాకు వదిలెయ్’ అన్నాడట జగన్ తను కలిసినప్పుడు… అప్పటి నుంచీ బోలెడు ఊహాగానాలు… రాజ్యసభ ఇస్తారని కొన్నాళ్లు… మండలి సభ్యత్వం ఇస్తారని కొన్నాళ్లు… మండలి అధ్యక్షుడిగా చేస్తారని కూడా కొందరు… వక్ఫ్ బోర్డు అధ్యక్ష పదవి ఇస్తారని మరికొన్నాళ్లు ప్రచారాలు సాగాయి… ఫాఫం, ఎదురు చూసీ చూసీ చివరకు ఓ సలహాదారు పోస్టు తీసుకోవాల్సి వస్తోంది ఆలీ… అదే నాగార్జున వంటి హీరోలు తమ సొంత ప్రాపర్టీల గొడవలకు జగన్ సాయం తీసుకుంటారు… చిరంజీవి వంటి వాళ్లు వాళ్ల కోరికల్ని నెరవేర్చుకుంటారు… మరి బహిరంగంగా వైసీపీ వెంట నిలిచిన ఆలీకి దక్కిందేమిటి..?
Ads
అర్హతల గురించి మాట్లాడకండి… ఆలీకి లేని అర్హత ఏమిటి..? అసలు తనతో ఏమైనా వర్క్ చేయించుకుండా పార్టీ ఇన్నాళ్లు..? అసలు తమ పార్టీలోనే ఉన్నాడని గుర్తించిందా..? చివరకు సలహాదారు… వందల మంది సలహాదార్లలో తనూ ఒకడు… ఏం చేయాలో, తన విధి ఏమిటో కూడా తెలియని పోస్టులో… ఎవరో అడిగితే… ‘‘ఆకలితో ఉన్న వారికి పులిహోర పెట్టినా, దద్దోజనం పెట్టినా, పప్పన్నం పెట్టినా, బిర్యానీ పెట్టినా తినాలి… వద్దనకూడదు… వద్దంటే కడుపు మాడుతుంది… అందుకే తనకు ఈ పదవి చాలు, దీని పట్ల సంతృప్తిగా ఉన్నాను’’ అన్నాడట… స్పష్టంగా తన అసంతృప్తి కనిపిస్తూనే ఉంది…
వచ్చే ఎన్నికల్లో పార్టీ గనుక ఆదేశిస్తే పోటీ చేస్తానని అంటున్నాడు ఆలీ… గుడ్… అర్హుడే… మనిషి మంచివాడే కాబట్టి, రాజకీయాలకు అలాంటివాళ్ల అవసరం కూడా ఉంది… కానీ ఏదో ఆశిస్తే చివరకు ఓ సలహాదారు పోస్టు పడేసిన జగన్ ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇస్తాడా..? టాలీవుడ్ నుంచి జగన్‌కు బహిరంగంగా మద్దతుగా నిలిచిన వాళ్లలో థర్టీ ఇయర్స్ పృథ్వి సుబ్బారెడ్డి దెబ్బకు చివరకు పార్టీ నుంచే పరార్… పోసాని ఇన్‌యాక్టివ్… జగన్ నా బంధువు అని చెప్పుకునే మంచు మోహన్‌బాబు కూడా రీసెంటుగా అసంతృప్తితోనే ఉన్నాడు… మరి జగన్ వెంట ఉండి, సంతృప్తిగా ఉన్న టాలీవుడ్ సెలబ్రిటీ ఎవరు..?!
Share this Article