Bharadwaja Rangavajhala….. చందమామ కావాలా, ఇంద్రధనువు కావాలా… అమ్మ నవ్వు చూడాలా, అక్క ఎదురు రావాలా, ఆ అక్క పేరు మాధవి. ఈ రోజు మాధవి బర్త్ డే.
బాలచందర్ అపూర్వరాగంగళ్ తెలుగులోకి రీమేక్ చేసేప్పుడూ…. ఒరిజినల్ లో జయసుధ చేసిన కారక్టర్ కు తగ్గ నటి కోసం వెతుకుతున్నారు దాసరి. అనుకోకుండా రవీంద్రభారతిలో జరిగిన ఓ డాన్స్ ప్రోగ్రామ్ కు వెళ్లారాయన. నాట్య ప్రదర్శన ఇస్తున్న కనక విజయలక్ష్మిని చూసి ఓకే అనేసుకున్నారు.
విజయలక్ష్మి అనే పేరును మార్చారు. అలా తూర్పుపడమర చిత్రంతో తెరంగేట్రం చేసింది మాధవి. తూర్పు పడమరలో మాధవి నటన చూసిన వాళ్లెవరూ కొత్తమ్మాయిగా ఫీలవలేదు. డైలాగ్ డెలివరీతో సహా చాలా అనుభవం ఉన్న ఆర్టిస్ట్ గా అనిపించింది. అదే బాలచందర్ ను ఎట్రాక్ట్ చేసింది.
Ads
తన మరో చరిత్రలో ఓ ప్రధాన పాత్ర కోసం మాధవిని అప్రోచ్ అయ్యారు. కమల్ హసన్ కాంబినేషన్ లో మాధవి నటన నిజంగా అద్భుతం. ముఖ్యంగా స్వప్నను బాలు అపార్థం చేసుకున్నాడని తెల్సినప్పుడు తన రియాక్షన్ మాధవి చక్కగా పలికించింది. అలాగే అన్న తప్పు చేశాడని తెల్సినప్పుడు కనపరచిన నటన…
ఆ సినిమా తర్వాత స్వయంగా కమల్ హసనే చాలా సినిమాలకు మాధవిని రికమండ్ చేశారు. నటిగా తానేమిటో ప్రూవ్ చేసుకున్న మాధవికి తొలిరోజుల్లో తెలుగు ఇండస్ట్రీ హీరో చెల్లి పాత్రలు ఆఫర్ చేసింది.
బాపుగారి స్నేహంలో అందమైన పాత్ర చేసింది. చంద్రమోహన్ లాంటి హీరోలతో కనిపించేది. నెమ్మదిగా చట్టానికి కళ్లు లేవు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య మూవీలతో మాధవి బిగ్ హీరోయిన్ అయ్యింది. ఖైదీలో చిరంజీవితో పోటీ పడి మాధవి చేసిన విశ్వామిత్ర తపోభంగం డాన్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మాధవిలోని డాన్సింగ్ టాలెంట్ ప్రపంచానికి అర్ధం అయ్యింది.
చిరంజీవితో పాటు కృష్ణ, శోభన్ బాబు తదితర హీరోలతోనూ జోడీ కట్టింది మాధవి. కమల్ హసన్ తో భారతీరాజా దర్శకత్వంలో మాధవి చేసిన టిక్ టిక్ టిక్ మాధవికి గ్లామరస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. అలాగని ఆ తరహా పాత్రలతోనే కంటిన్యూ కాలేదు. సీరియస్ రోల్సూ చేసింది.
మాధవిలోని నటిని పూర్తి స్థాయిలో ఆవిష్కరించిన చిత్రం మాత్రం మాతృదేవో భవ. ఆ తర్వాత బిగ్ బాస్, తదితర చిత్రాల్లో నటించిన మాధవి 1996 లో వ్యాపారవేత్త శర్మను పెళ్లాడి న్యూజెర్సీలో స్థిరపడింది. తన ముగ్గురు పిల్లలను పెంచుతూ భర్తకు వ్యాపారంలో తోడ్పాటును అందిస్తోంది. సినిమాల నుండి నిష్క్రమించినా మంచి సినిమాలను చూసినప్పుడు ఇప్పటికీ నటించాలనే కోరిక కలుగుతుందంటారు మాధవి…
Share this Article