.
(నటి సోనా 2001 నుంచి సినిమాల్లో ఉన్నారు. తెలుగులో ‘ఆయుధం’, ‘విలన్’, ‘ఆంధ్రావాలా’, ‘వీడే’ తదితర సినిమాల్లో నటించారు. తమిళంలో ‘మిరుగం’(తెలుగులో ‘మృగం’) సినిమాలో వేశ్య పాత్ర ఆమెకు విశేషమైన పేరు తెచ్చింది.
గ్లామర్ పాత్రలు, సాంగ్స్‌కి పేరుపొందిన ఆమె నిర్మాతగా మారి ‘కనిమొళి’ అనే చిత్రాన్ని నిర్మించారు. గాయకుడు, నిర్మాత ఎస్పీ చరణ్‌పై ఆమె చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాలివి).
Ads
***
స్త్రీల మీద వేధింపులనేవి అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. సినిమాల్లో జరిగినవాటి మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి వాటి గురించి ఎక్కువగా చెప్పుకుంటారు. నాకు ఐదారు సార్లు అలా జరిగింది.
2001లో ఓ షూటింగ్ కోసం కేరళ వెళ్లాను. నేను, నా అసిస్టెంట్ ఓ లాడ్జిలో ఉన్నాం. మధ్యరాత్రి 2 గంటలకు వచ్చి తలుపు తట్టారు. అంత రాత్రిలో ఎందుకు వచ్చారో అర్థమై నేను తలుపు తీయలేదు. కాసేపయ్యాక ఇంకా గట్టిగా తలుపులు బాదారు. అయినా తెరవకపోతే ఫోన్ చేశారు. ఎత్తలేదు.
వాళ్లు ఇంకా తలుపులు కొడుతున్నారు. ఉన్నది ఒక్కటే తలుపు. బయటికి వెళ్లేందుకు మరో దారి లేదు. ఏం చేయాలి? తలుపు తీయకుండా, బయట ఉన్నవాళ్లతో నైసుగా మాట్లాడి, అరగంట తర్వాత రండి అని చెప్పి పంపించేశాను.
ఆ అరగంట నాకు టైం దొరికింది. వెంటనే, నేను నా అసిస్టెంట్ బాల్కనీలోనుంచి మెల్లగా కిందకు దిగి, బయటకు వచ్చి, రోడ్డు మీద బస్సు పట్టుకొని చెన్నై వచ్చేశాం. ఇదంతా ఓ పెద్ద మలయాళ హీరో చేయించారు. అప్పట్లో నాలాగే ఆయన కూడా ఇండస్ట్రీకి కొత్త.
ఇలాంటి రకరకాల అనుభవాలతో 25 సినిమాల నుంచి బయటకు వచ్చేశాను. కొందరు దర్శకులకు నేను ఓకే చెప్పకపోయినా సరే, బయట మాత్రం నేను వాళ్లకు ఓకే చెప్పి, వారితో గడిపినట్లు ప్రచారం చేసుకున్నారు. హీరోయిన్లకు 90 శాతం సమస్యలు డైరెక్టర్లు, నిర్మాతల నుంచే వస్తాయి.
నిజానికి మంచి ప్రొడక్షన్ కంపెనీలు, పేరున్న డైరెక్టర్స్ నుంచి ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం తక్కువ. కొత్త కంపెనీలు, కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్లు ఇలాంటివి ఎక్కువగా చేస్తారు. డబ్బుంది కాబట్టి హీరోయిన్లు తమతో గడపాలి అని ఆలోచిస్తారు.
కొందరు హీరోలు మనల్ని అప్రోచ్ అవుతారు. ఇష్టం లేదు అని చెప్తే, ఓకే అని వెళ్లిపోతారు. ఆ తర్వాత పెద్దగా ఫోర్స్ చేయరు. కానీ ఒక మలయాళ హీరో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన బతికి లేరు కానీ, ఆయన గురించి అందరికీ తెలుసు.
అమ్మాయిల కోసం వాళ్ల కాళ్ల మీద పడి మరీ బతిమాలుతాడు. ఇది నాకు మాత్రమే జరిగిందని మొదట్లో అనుకున్నాను. కానీ నాలాగే మరో నాలుగైదు మందికి జరిగిందని తెలిశాక, ఇది అతని అలవాటని అర్థమైంది. మనం ఇలాంటి వేధింపుల్ని గట్టిగా ఎదుర్కొంటే, మనకు పొగరు అని, టైంకి రాదు అని, మనం సరిగా నటించలేమని ఏవేవో ప్రచారాలు చేస్తుంటారు.
నేను సినిమాలకు వచ్చిన కొత్తల్లో ఒక సినిమాలో నన్ను హీరోయిన్‌గా బుక్ చేశారు. అందులో నేను పైట లేకుండా జాకెట్‌తో నటించే సీన్ ఒకటి ఉంది. దానికి చాలా భయపడ్డాను. కానీ డైరెక్టర్, కెమెరామెన్ నన్ను సముదాయించి, ఆ సీన్ ఎలా తీస్తారో కెమెరాలో చూపించారు.
స్ట్రెయిల్ యాంగిల్‌లో తీసిన కొన్ని షాట్స్ చూసినప్పుడు పెద్ద తేడా ఏమీ అనిపించలేదు. దీంతో ఆ సీన్ చేశాను. అదే షాట్ కుడి, ఎడమ, టాప్ యాంగిల్స్ తీశారు. వాటిని చెక్ చేయకపోవడం నా తప్పు.
ఆ సినిమా విడుదలయ్యాక మా అమ్మ, చెల్లి, చెల్లికి కాబోయే భర్త.. అందర్నీ తీసుకొని థియేటర్‌కి వెళ్లాను. సరిగ్గా ఆ సీన్ రాగానే, టాప్ యాంగిల్‌లో ఆ షాట్ చూసి అందరూ అప్‌సెట్ అయ్యారు. అమ్మ ఏమీ అనకుండా బయటకు వచ్చేసింది.
రెండు, మూడు నెలల తర్వాత నాతో మాట్లాడుతూ ‘అవసరమా ఇదంతా?’ అని అడిగింది. అప్పుడే తనను ఓ షూటింగ్‌కి తీసుకెళ్లి, రొమాంటిక్ సీన్స్, అలాంటి సెక్సీ సీన్స్ ఎలా చేస్తారో చూపించాను. ఇదంతా కేవలం నటనే అని చెప్పి తన అనుమానాలన్నీ పోగొట్టాను………… సేకరణ, అనువాదం: విశీ (వి.సాయివంశీ)
Share this Article