ఆమే… అవును, ఆమే… వైష్ణవి చైతన్య… ఎందుకు లేరు తెలుగులో..? సరిగ్గా పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేయాలే గానీ తెరపై బాగా రాణించగల సత్తా మన తెలుగమ్మాయిల్లో ఎందుకు లేదు..? ఉంది… కాకపోతే మన నిర్మాతలకు, డైరెక్టర్లకు కనబడి చావరు… వాళ్లకు ఎంతసేపూ తెల్లతోలు, ఎక్స్‌పోజింగ్, కమిట్మెంట్లు కావాలి… తెల్లతోలు తారలకు నటన రాకపోయినా పర్లేదు, పాత్ర ఎలా ఉన్నా పర్లేదు, డబ్బు అడిగినంత ఇస్తే సరి…
ఈ అమ్మాయే చూడండి… విజయవాడ… వైష్ణవి… అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ సోదరిగా చేసింది… ఇప్పుడు బేబీ అనే సినిమాలో హీరోయిన్… డబ్‌స్మాష్‌లు, టిక్‌టాక్‌లు, షార్ట్ ఫిలిమ్స్‌తో ఇప్పుడు ఏకంగా ఓ సినిమాలో హీరోయిన్… గుడ్, మంచి ప్రోగ్రెస్… బేబీ సినిమాలో బాగా చేసింది… అందరి ప్రశంసలూ అందుకుంటోంది…
నిజానికి ఈ సినిమాలో దేవరకొండ ఆనంద్, విరాజ్ అశ్విన్‌లకన్నా ఈమే బాగా చేసింది… రకరకాల వేరియేషన్స్ పలికించింది… కొన్ని సీన్లలో బాగానే చేసినా ఆనంద్ దేవరకొండ కొన్ని క్లిష్టమైన సీన్లు వచ్చేటప్పటికి తన అనుభవరాహిత్యాన్ని చాటుకున్నాడు… తను నటన కోణంలో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది… వైష్ణవిలో ఆ కొత్త తాలూకు తడబాటు ఏమీ లేదు… అలవోకగా చేసుకుంటూ పోయింది సీన్లు… వెన్ను తట్టాలే గానీ ఎందుకు ఎదగరు మనవాళ్లు..? ఈ పిల్లకు ఒక్కటే కాస్త మైనస్… మరీ హీరోయిన్ సరుకు అనే భాషలో చెప్పలేను గానీ, అందంగా ఉంది, ముద్దుగా ఉంది… కానీ హైట్ తక్కువ… 5.2 నుంచి 5.3 వరకు ఉంటుందేమో…
Ads
ఈ అమ్మాయి గురించి వదిలేస్తే… సినిమా కథ యువతను టార్గెట్ చేసుకుని నడిపించిన కథ… ఆధునిక యువత ప్రేమలు, కోపాలు, అపార్థాలు, తద్వారా చేసే పారపాట్లు, తప్పులు, వాటితో విపరిణామాలు… ముక్కోణపు ప్రేమకథ… నిజానికి ప్రేమకథను ఈరోజుల్లో ఆకట్టుకునేలా తీయడం కష్టమైన పని… దర్శకుడు, రైటర్ సాయి రాజేష్ కొంతమేరకు సక్సెస్ అయినట్టే…
ఫస్టాఫ్ కాస్త సాగదీసినట్టు, రొటీన్ బాటలో వెళ్తున్నట్టు అనిపించినా… సెకండాఫ్‌లో కాస్త కొత్తదనాన్ని చూపించగలిగాడు… కాకపోతే లెంతీ సినిమా… ఓ అరగంట కోసేస్తే సినిమా ల్యాగ్ తగ్గి స్పీడ్ పెరిగేదేమో… ఎడిటింగ్ లోపం ఇది… సంగీతం గట్రా పర్లేదు, అంత ఇంప్రెసివ్ ఏమీ కాదు… వాస్తవానికి ప్రేమకథలకు పాటలే ప్రాణం… ఇది కొంచెం సినిమాకు మైనస్…
ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి… ఇవ్వాళారేపు నిజంగా యువత థియేటర్ వెళ్లి మరీ సినిమా చూస్తున్నారా..? వాళ్లకు అరచేతిలో ఓటీటీలు, కాదంటే ఏవైనా కాపీ, పైరసీ వెబ్‌సైట్లు… ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ కాసేపు చూడటం, మూసేయడం… ఎవరూ అంత సీరియస్‌గా సినిమాల్లో లీనం కావడం లేదు, పర్స్ ఖాళీ చేసుకుని థియేటర్ల దోపిడీకి తలవంచడం లేదు… సో, బేబీ సినిమా మీద మంచి మౌతటాక్ వచ్చినా సరే, థియేటర్లలో వసూళ్ల మీద మాత్రం డౌటే… పాపం శమించుగాక…
Share this Article