పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్… ఐఏఎస్… ప్రస్తుతం ట్రైనీ… ఈమెను నేను మనసారా అభినందిస్తున్నాను… ఆమె తలతిక్క పోకడలకు కాదు, మన ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకు ఎంపికల విధానం ఎంత డొల్ల వ్యవహారమో పూజ స్పష్టంగా లోకానికి తెలియజెబుతోంది గనుక… ఇప్పటికైనా ఓ మంచి మార్పు అవసరమని ఆమె మంచి పాఠం చెబుతోంది గనుక…
1) ఆమె తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించింది… 2) ఆమె ఆడి కారు మీద 27 వేల చలాన్లు పెండింగ్… 3) సొంత కారుకు ఎర్ర బల్బు కావాలని మంకుపట్టు పట్టింది… 4) ఆరుసార్లు ఆరోగ్య పరీక్షలకు హాజరు కాలేదు… 5) తక్షణం ఐఏఎస్ అధికారికి అర్హమైన సౌకర్యాలన్నీ సమకూర్చాలని డిమాండ్ చేసింది… 6) ఎవరో ఆఫీసర్ చాంబర్ ఆక్యుపై చేసుకుని నేమ్ ప్లేట్ తగిలించేసుకుంది…
అంతేనా..? ఆమె ఓబీసీ ప్లస్ వికలాంగురాలినని క్లెయిమ్ చేసుకుంది, అంధత్వ సమస్యలు, మానసిక రుగ్మతలు ఉన్నాయి కాబట్టి వికలాంగురాలట… మానసిక రుగ్మత కనిపిస్తూనే ఉంది… కానీ మానసిక సమస్యలుంటే ఫిజికల్లీ చాలెంజ్డ్ కేటగిరీలోకి వస్తారా..? ఆమె నాన్ క్రీమీలేయర్ అని క్లెయిమ్ చేసుకుంది, అదీ తప్పే… ఆమె తండ్రికి 40 కోట్ల ఆదాయం ఉందట, లోకసభకు పోటీచేశాడు… ఆమె తల్లి పిస్టల్ పట్టుకుని రైతుల్ని బెదిరిస్తున్న వీడియో తాజాగా వైరల్ ఇప్పుడు..
Ads
841 ర్యాంకు వస్తే ఐఏఎస్ ఎలా ఇచ్చారనే సందేహాలు కూడా వస్తున్నాయి… ఇప్పుడు ఆమె సంగతి తేల్చడానికి సపరేట్‌గా ఓ ప్యానెల్ వేశారట…
టోటల్‌గా మన యూపీఎస్సీ పరీక్షలు, ర్యాంకులు, ఎంపికలు, శిక్షణలు అంతా ఒక డొల్ల… అసలు పరీక్షలే అభ్యర్థులు భట్టీయం ప్రతిభ, మెమొరీలకు పరీక్ష… అంతేతప్ప నిజమైన అడ్మినిస్ట్రేటివ్ మెరిట్‌కు పరీక్ష కాదు, చివరకు ఇంటర్వ్యూలలోనూ అంచనా వేయలేకపోతున్నారు, పోనీ, శిక్షణలోనైనా సరైన అంచనాలు వేసి, ఫైనల్ పోస్టింగుల్లో నిర్ణయాలు తీసుకుంటున్నారా అంటే అదీ లేదు…
ఇంకేం, ఒకసారి ఐఏఎస్, ఐపీఎస్ ట్యాగ్ తగిలితే చాలు… ఇదుగో ఇదే కథ… ఇంకా నయం, ఈమె ఓ కీలక శాఖకే ముఖ్యాధికారిగా వెళ్లాక ఇంకెన్ని కథలు పడేదో… అసలే రాజకీయ నాయకులు, ఇండస్ట్రియలిస్టులు, మీడియా అధినేతలకన్నా సీనియర్ బ్యూరోక్రాట్ల అవినీతే ఇప్పుడు దేశానికి పెద్ద విపత్తుగా మారింది… బోలెడు ఉదాహరణలు… ఇంకా ఇలాంటోళ్లే వస్తుంటే..?
మొత్తం ఫెయిల్యూర్ యూపీఎస్సీది… ఖచ్చితంగా..! ఎంతమంది అంగీకరిస్తారో తెలియదు గానీ… ఈ యూపీఎస్సీ ఎంపికలు వేస్ట్… అన్ని రాష్ట్రాల్లో సొంతంగా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఉంది… ఆల్రెడీ సర్వీసులో ఉన్నవాళ్ల నుంచి మెరికల్ని ఏరి, దానికీ శాస్త్రీయ ప్రామాణికాల్ని రూపొందించుకుని… కన్‌ఫర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపిక చేయడం చాలా బెటర్…
అవసరమైతే వాళ్లకు పరీక్షలు పెట్టొచ్చు… నెగ్గితేనే తుది ఎంపిక… అప్పటికే వాళ్ల పాలన సామర్థ్యాల మీద రిపోర్టులుంటాయి… సర్వీస్ రికార్డుల్లో మచ్చలుంటే పూర్తిగా పక్కన పెట్టేయొచ్చు… రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు కూడా తీసుకోవచ్చు… ప్రస్తుత యూపీఎస్సీ దిక్కుమాలిన పరీక్షలు, ఎంపికలన్నా పైన చెప్పిన విధానమే శ్రేయస్కరం, జాతికి ఉపయోగకరం… అవసరమైతే సర్టిఫికెట్ల నిశిత పరిశీలన మళ్లీ చేయొచ్చు కూడా… అబ్బే, మోడీ ప్రభుత్వం ఈ సాహసం, ఈ మంచి చేస్తుందని ఊహించలేం అంటారా..? అది వేరే సంగతి..!!
Share this Article