ఫేస్‌బుక్‌లోనే ఓ మిత్రుడు ఓ ఫోటో పెట్టాడు… ఈ ఎమ్మెల్యేలు ఏ పార్టీ పేరు చెప్పుకుని వోట్లు అడిగారు, ఇప్పుడు ఎవరి పంచన ఉన్నారు..? టీఆర్ఎస్ నాయకులు పదే పదే ఈటల రాజీనామా చేయాలని లొల్లి చేస్తున్నారు కదా, మరి వీళ్ల నైతికత గురించి ఎందుకు మాట్లాడరు..? ఈటల కూడా రాజీనామా ఇచ్చేసి, నైతికంగా ఓ మెట్టు పైకి ఎక్కాడు కదా… రాజకీయంగా ఏ సవాళ్లకైనా రెడీ, ప్రజల తీర్పుకు రెడీ అంటున్నాడు కదా… మరి ఇప్పుడు వీళ్లు కూడా రాజీనామాలు చేసి, టీఆర్ఎస్ ప్రబోధించే నైతిక విలువల్ని ప్రదర్శిస్తారా..? ప్రజల తీర్పుకు సిద్ధపడతారా..? కేసీయార్ పట్ల ప్రజల ఆదరణ మస్తు గట్టిగా ఉంది కదా, వీళ్లందరినీ గెలిపించుకుని, తన సత్తా ఏమిటో ప్రదర్శిస్తాడా..? నిజంగా టీఆర్ఎస్ దగ్గర జవాబుల్లేని ప్రశ్నలు ఇవి… ఈ ఫిరాయింపుల్ని ‘రాజకీయ శక్తుల పునరేకీకరణ’ అని ఓ పడికట్టుపదంతో సమర్థించుకునే కేసీయార్ కూడా వీళ్లను ప్రజాక్షేత్రంలో నిలబెట్టి, గెలిపించి, తన రాజకీయ శక్తిని ప్రదర్శించుకోవచ్చు కదా…
ఈటల బీజేపీలోకి వెళ్లిన తీరును ఎవరూ అభ్యంతరపెట్టలేరు… ఆక్షేపించలేరు… కాలర్ ఎగరేసి, తల ఎత్తి మరీ, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, హుందాగా, గౌరవంగా వెళ్లిపోతున్నాడు… పైగా ఏ పార్టీలోకి వెళ్లాలనేది కూడా తనిష్టం… తన సాధకబాధకాల్ని తను చూసుకోవాలి కదా… పాలిటిక్స్ అంటే గుడ్డెద్దు చేలో పడటం కాదు కదా… సరే, ఆయన లెక్కలు ఆయనవి, ఆయన అడుగులు ఆయనిష్టం… కానీ తను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఉండాల్సిందేమో… ఏమయ్యేది..? స్పీకర్ తనపై అనర్హత వేటు వేసేవాడా..? వేచి చూడాల్సింది… అనర్హత వేటు అంత వీజీ కాదు… ఈలోపు అధికారికంగా బీజేపీలో చేరకుండా ఉంటే పాయె… డి.శ్రీనివాస్‌ను టీఆర్ఎస్ ఏం చేయగలిగింది..? పోనీ, అనర్హత వేటు వేస్తే, మంచిదేగా… వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరి, మంత్రి పదవుల దాకా వచ్చిన వాళ్ల నైతికత మాటేమిటో అడగడానికి, బజారులో చర్చ పెట్టడానికి స్కోప్ ఉండేది… తెలంగాణ సమాజంలో బాగా డిబేట్ జరిగేది… ఈటల పదే పదే చెబుతున్న ‘గులాబీ జెండా ఓనర్షిప్’ చర్చ రక్తి కట్టేది… (కేసిఆర్ తనపై ఒక సీఐడీ కేసు పెట్టించి, కొట్టిస్తాడని మాత్రం అనుకోలేం…)
Ads
ఇప్పుడంత మునిగిపోయింది ఏముంది..? కథ ఇలా కొన్నాళ్లు సాగేది కదా… కేసీయార్ కక్షసాధిస్తాడు అనేది ఓ సందేహం… సో వాట్..? ఇప్పుడు బీజేపీలో చేరగానే వదిలేస్తాడా..? బీజేపీ కృష్ణచక్రాన్ని అడ్డం వేస్తుందా..? డౌటే…! పైగా ఇప్పుడు హుజూరాబాద్‌లో వార్డుకో ఇన్‌ఛార్జిని పెట్టి ఎన్నికకు వెళ్తాడు కేసీయార్… గెలిస్తే ఇక ఈటల జీరో అవుతాడు కొన్నాళ్లు… కేసీయార్ అభ్యర్థి ఓడిపోయి ఈటల గెలిస్తే… అసెంబ్లీలో బీజేపీ సంఖ్యకు ప్లస్ వన్ యాడ్ అవుతుంది… అంతే… రఘునందన్ గెలిచాడు, ఏమైంది..? కేసీయార్ రెండు రోజులకే దులిపేసుకున్నాడు ఆ పరాభవాన్ని… రేప్పొద్దున ఈటల గెలిచినా అంతే, తనకేమీ నష్టం లేదు, తను పట్టించుకోడు… ప్రజల్లో దాని ప్రభావం అంత బలంగా ఉంటుందని అనుకోవడమూ సరైన అంచనా కాదు… సో, ఇది ఈటలకే అగ్నిపరీక్ష… బీజేపీకి కూడా ఓ పరీక్ష… బలం, వయస్సుడిగిన కాంగ్రెస్‌కు వచ్చేదీ లేదు, పోయేదీ లేదు అక్కడ… పైగా అయిదేళ్ల నుంచే నాకూ కేసీయార్‌కూ గ్యాప్ ఉంది అనడంతోనే ఈటల ఆత్మాభిమానం అనే నినాదం క్రెడిబులిటీ పోయింది… ఏదో వాళ్లిద్దరికీ పడలేదు, అందుకే పార్టీ నుంచి కేసీయార్ పంపించేశాడు తప్ప, ఇదేదో పర్సనల్ వార్ తప్ప ఇందులో విస్తృత ప్రజాప్రయోజనం ఏముంది అనుకుంటాడు సగటు మనిషి… ఈ కురుపాండవ సంగ్రామం వంటి డైలాగులతో ఏ పనీ కాదు, సో, పార్టీకి, ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయకుండా… టీఆర్ఎస్లోకి ఫిరాయించిన వారిని చూపిస్తూ, సర్కారు తప్పుడు నిర్ణయాల్ని ప్రశ్నిస్తూ, కొన్నాళ్లు ఆడుకుంటే బాగుండేదేమో…!! పోనీ… ఈటల ఇప్పుడైనా ఈ ఎన్నికల్లో… “నాకు దమ్ముంది, ఈ 12 మందితో రాజీనామాలు చేయించి, ఎన్నికల్లో నిలబెట్టగలవా, ఆ నైతికత నీకుందా” అని నేరుగా ప్రశ్నిస్తూ… అదే ఒక ఎజెండా అంశం చేస్తే ఎలా ఉంటుంది..!!
Share this Article