పొన్నియిన్ సెల్వన్… ఇప్పుడు అందరి నోళ్లలోనూ నానుతున్న సినిమా పేరు… బ్రహ్మాస్త్రంకు 400 కోట్లు పెడుతున్నారంటేనే అబ్బురపడుతున్నాం కదా… పొన్నియిన్ సినిమాకు మరో 100 కోట్లు ఎక్కువే… అన్నింటికీ మించి ఇది మణిరత్నం కలల ప్రాజెక్టు… ట్రెయిలర్లు చూస్తేనే అర్థమవుతోంది అదెంత గ్రాండియర్‌గా ఉందో… అఫ్‌కోర్స్, ఇప్పుడు దేశంలో ఉన్న దర్శకుల్లోకెల్లా దృశ్యచిత్రీకరణలో మణిరత్నం అంటే మణి, రత్నం… అంతే… వంక పెట్టడానికి వీల్లేదు…
సహజంగానే ఇది పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది… విక్రమ్, జయం రవి, ఐశ్వర్య రాయ్, ఐశ్వర్య లక్ష్మి, త్రిష, కార్తి, ప్రభు, శోభిత ధూళిపాళ్ల, శరత్ కుమార్, పార్తిబన్… చెబుతూ పోతే చాంతాడంత జాబితా… అందరూ ప్రసిద్ధులే… భారీ ఖర్చుతో గ్రాఫిక్స్, రెహమాన్ సంగీతం… ఇంకేం కావాలి..? పైగా సౌతిండియా పాన్ ఇండియా సినిమాలు ఈమధ్య కుమ్మేస్తున్న ట్రెండ్ ఉండనే ఉంది… అయితే తమిళ ప్రేక్షకులకు మినహా ఇది మిగతా భాషల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా..? సందేహమే… చెప్పుకుందాం ఆ కారణాలేమిటో కూడా…
ముందుగా సంక్షిప్తంగా, సూటిగా సినిమా కథా నేపథ్యం తెలుసుకోవాలి… పొన్నియిన్ సెల్వన్ అనేది ఓ పెద్ద నవల… రాసింది ప్రఖ్యాత తమిళ రచయిత ఆర్.కృష్ణమూర్తి… తననే కల్కి కృష్ణమూర్తి అంటారు… ఆయన స్థాపించిన కల్కి అనే వీక్లీకి 1950లోనే 70 వేల సర్క్యులేషన్ ఉండేది… తను రాసిన నవలలు ఆ వీక్లీలోనే ధారావాహికలుగా వచ్చేవి… ముఖ్యమైనవి మూడు నవలలు, అన్నీ తమిళ రాజవంశాల గురించే… వాళ్ల వీరగాథల గురించే… నిజానికి ఇదేమీ చారిత్రక నవల కాదు, బోలెడంత ఫిక్షన్ జతచేశాడు ఆయన… చరిత్రలో లేని పాత్రల్నీ సృష్టించాడు…
Ads
తమిళ రాజుల పేర్లు చదివేకొద్దీ మనకు పెద్దగా మింగుడుపడవు కాబట్టి ఆ కథ జోలికి పోవడం లేదు… ఇంకా సంక్షిప్తంగా చెప్పాలంటే శతృ భీకరమైన మహాచోళ సామ్రాజ్య స్థాపన కథే ఈ పొన్నియిన్ సెల్వన్ కథ.,. రెండు వేల పేజీల పుస్తకం… కొత్త వరద, సుడిగాలి, మృత్యుఖడ్గం, మణిమకుటం, త్యాగశిఖరం పేర్లతో ఐదు సంపుటాలు… పల్లవ, పాండ్య, చోళ రాజవంశాలు, ఆ స్నేహాలు, బంధుత్వాలు, పోరాటాలు, శతృత్వాలు… ఒక్క పేరూ మనకు కనెక్ట్ కాదు… అయితే 2 వేల పేజీల నవలను రెండు భాగాల సినిమాకు సరిపడా, బిగి సడలకుండా కుదించడం అనేది పెద్ద టాస్క్…
పైన ఇచ్చిన వంశవృక్షం ఏమైనా జీర్ణమయ్యేట్టు ఉందా..? ఎస్, అదే ఈ సినిమాకు మైనస్ కాబోతోంది… బాగా ఆలోచించండి… ఒక రుద్రమదేవి కథ, ఒక కృష్ణదేవరాయల కథ మనకు ఇట్టే ఎక్కుతాయి… చిన్నప్పటి నుంచీ ఆ కథలు, పాత్రలు వింటున్నాం కాబట్టి… కానీ ఈ పరాంతచోళుడు, గండరాదిత్యుడు, ఆరింజయచోళుడు, ఆదిత్య కరికాలుడు, వందియదేవన్, ఆరుళ్ మొళివర్మ, … ఇవన్నీ మనం ఎప్పుడూ విన్నది లేదు, వాళ్ల గురించి పరిచయం చేస్తూ వెళ్తే సినిమా కథలో బిగి ఉండదు, ఆ పేర్లు పలకడమే పెద్ద పరీక్ష… ఉదాహరణకు కణిమొళి అని రాస్తాం కదా, అందులో ణ, ళ అనేవి నిజానికి అలా పలకరు, వాళ్లు పలికేతీరుకు సరిపడా అక్షరాలు తెలుగులో లేవు… మరి ఈ ప్రధాన పాత్రల పేర్లలో ఎక్కువగా అలా పలికేవే… వాయిస్ ఓవర్‌లో వేరే భాషల్లో ఆ పేర్లను ఎలా పలికిస్తాడో మణిరత్నం… అదేకాదు తనకు పెద్ద టాస్క్ ఏమిటంటే… ఇతర భాషల ప్రేక్షకులకు ఈ కథను ఎలా చెబుతాడు అనేదే…
నిజానికి 1958లోనే ఎంజీఆర్ ఈ సినిమా తీస్తున్నట్టు ప్రకటించాడు… కుదరలేదు… వైజయంతిమాల, జెమిని గణేషన్, పద్మిని, సావిత్రి, సరోజాదేవి వంటి స్టాల్‌వర్ట్స్‌ను ఎంపిక చేసేసుకున్నాడు… వర్కవుట్ కాలేదు, ఖర్చుకు భయపడి, తమిళంలో ఎవరూ ఆ కథ జోలికి పోలేదు… కానీ 1994 నుంచి మణిరత్నం ఆలోచనల్లో కూర్చుండిపోయింది ఈ సినిమా… 2010 నుంచి సీరియస్ వర్క్ స్టార్ట్ చేశాడు కూడా… ప్రియాంకచోప్రా, మహేష్‌బాబు, కమల్‌హాసన్, అనుష్కశెట్టి, సూర్య, జ్యోతిక… ఇలా చాలామందితో సంప్రదింపులు సాగాయి… తనతోపాటు కమల్‌హాసన్, విజయకాంత్, శ్రీదేవి ప్రధాన పాత్రలుగా ఈ సినిమా తీయాలని అనుకున్నట్టు రజినీకాంత్ చెబుతున్నాడు… వెరసి ఇదొక క్రేజీ ప్రాజెక్టు…
ఎట్టకేలకు సినిమా అనేక అవాంతరాల్ని దాటి షూటింగు ముగించుకుంది… పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి… కానీ ముందు చెప్పుకున్న సమస్యే… తమిళం సరే, వాళ్లకు ప్రిస్టేజియస్ కథ… పైగా చాలామంది తమిళ టెక్నీషియన్లు, ఆర్టిస్టులే… ఆ కథ తెలుగు, మలయాళం, కన్నడ ప్రేక్షకులకు ఎక్కడమే పెద్ద టాస్క్ అనుకుంటే, హిందీ ప్రేక్షకులు ఆ పాత్రల పేర్లు వింటూ జుత్తు పీక్కోవాల్సిందే… పాత్రల పేర్లు మార్చడం కుదరదు… చాన్నాళ్లుగా మనకు తెలిసిన ఆ పాత మణిరత్నం ‘‘కనిపించడం లేదు’’… దీన్నెలా చూపిస్తాడో చూడాలిక…!!
Share this Article