.
శివజ్యోతి… నిన్నటి నుంచీ వార్తల్లో నలుగుతున్న పేరు… తిరుమలలో ప్రసాదం తీసుకుంటున్నప్పుడు ఆ క్యూలైన్‌లో నిలబడి ఏవో నవ్వులాట వ్యాఖ్యలు చేసింది… అది వెంకన్నకు అపచారం చేసినట్టేననే భావన వేగంగా వ్యాపించింది…
ఆమె ఈ వ్యతిరేకత ఊహించలేదు… తరువాత పశ్చాత్తాపం ప్రకటిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది… ఇక్కడి వరకూ జరిగింది వేరు… ఎవరో గానీ ఆమె ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసిందనీ, ఇక జన్మలో తిరుమల దేవుడిని దర్శించుకోలేదనీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు… ఇదేదో ఇంట్రస్టింగుగా ఉందని యూట్యూబ్ చానెళ్లు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దాన్నే ప్రసారం చేసేశాయి…
Ads
తిరుమలకు, ఆ దేవుడి పట్ల తృణీకార భావనను కనబరిస్తే లేదా అపహాస్యం చేస్తే ఆధార్ కార్డును బ్లాక్ చేస్తే తప్పేమీ లేదని, సరైన శిక్షే అనీ రాసుకొచ్చారు కొందరు… కానీ ఇలా ఆధార్ కార్డును బ్లాక్ చేయడం గతంలో ఎప్పుడైనా జరిగిందో లేదో తెలియదు గానీ… శివజ్యోతి ఆధార్ కార్డు బ్లాక్ అనేది ఫేక్ న్యూస్ అని టీటీడీయే క్లారిటీ ఇచ్చినట్టు కొన్ని వాట్సప్ న్యూస్ గ్రూపుల్లో కనిపించింది…
ఆమె మీద ఎవరు ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు, ఆమెపై కోపం ఏమిటనేది పక్కన పెడితే… యూట్యూబ్ చానెళ్ల పైత్యం ఓసారి గమనించాలి మనం… శివజ్యోతి గర్భం ధరిస్తే దాన్ని కూడా ఓ పెద్ద వార్తగా ఫోటోలు పెట్టి మరీ వీడియోలు చేశారు… సరే, వాళ్ల బాధ వాళ్లది అనుకుందాం…
నిజంగా టీటీడీకి తిరుమల వెంకన్న సన్నిధిని భ్రష్టుపట్టించేవాళ్లపై యాక్షన్ తీసుకోవాలనుకుంటే… పెద్ద పెద్ద అపచారాలు, ద్రోహాలు చేసే పెద్ద తలకాయలు బోలెడు… ఆఫ్టరాల్ ఓ యాంకర్ ఎంత..? పైగా పశ్చాత్తాప ప్రకటన కూడా రిలీజ్ చేసింది… ఇది ఆమెకు సమర్థన…
ఓసారి ఈ దర్శనం నేపథ్యంలోకి వెళ్దాం… పదేళ్లయినా పిల్లల్లేరు ఆమెకు… ఎవరో చెబితే విని, మిత్రుల అనుభవాలు విని ఏడు శనివారాల వ్రతం చేసింది… ఆరో వారమో, ఏడో వారమో గర్భ నిర్ధరణ జరిగాక… వెంకన్న దగ్గరకు వస్తానని మొక్కుకున్నాను కదా అని 3 నెలల కడుపుతోనే తిరుమల బయల్దేరింది…
మిత్రులు కారులో, ఆమె, తన భర్త ఫ్లయిటులో వెళ్లారు… ముందుగా ప్లాన్ చేసుకుని పోనట్టుంది… సమయానికి విమానాశ్రయంలో శ్రీవాణి టికెట్లూ దొరకలేదు… తెలిసిన నాయకులు, అధికారులను సంప్రదించారు ఆ టీమ్ సభ్యులు… వర్కవుట్ కాలేదు…
ఎలాగూ వచ్చాం, దర్శనం చేసుకున్నాకే వెళ్దాం అనుకుని అక్కడే టూ త్రీ డేస్ ఉన్నారు… చివరకు శ్రీవాణి టికెట్లు దొరికాకో లేక ఆ టికెట్ల క్యూలైన్‌లోనో… ఉచిత ప్రసాదం తీసుకుని, ఏదో జోక్స్ వేసుకున్నారు… దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం ఆమెపరంగా జరిగిన తప్పు, బ్లండర్…
దర్శనం సమయంలో కూడా అడ్డంకి… వీళ్ల ముందున్నవాళ్ల దర్శనం అయిపోగానే తెరవేశారుట… తరువాత కాసేపటికి దర్శనం… ఇదీ కథ… నిజానికి ఆధార్ బ్లాక్ అనేది తప్పుడు వార్తే కావచ్చు, కానీ నిజమే అయి ఉంటే అది సరైన చర్య కూడా కాదు…
వెంకన్న బోలెడు మంది అన్యమతస్తులతో పనిచేయించుకుంటున్నాడు… ఎవరికీ దర్శనాన్ని నిరాకరించడు… అన్యమతస్తులు కూడా బోలెడు మంది దర్శనానికి వెళ్తారు… ప్రముఖులైతే డిక్లరేషన్ తీసుకుంటారు, అంతే… సో, దర్శనాన్ని నిరాకరించడం సరైన చర్య అనిపించుకోదు…
అన్నట్టు... ప్రతి ఏటా సుపథం దర్శనానికి వీలు కల్పించే (ఐదుగురికి మించకుండా) లక్ష రూపాయల విరాళం కూడా చెల్లించింది ఆమె... ఇవీ ఆమె తిరుమల వివాదం పూర్వాపరాలు..!!
Share this Article