పార్ధసారధి పోట్లూరి …… డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పతనం! సోషల్ మీడియాలో మరియు న్యూస్ ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియాలో డాలర్ తో రూపాయి విలువ పతనం మీద చేస్తున్న విమర్శలు, విశ్లేషణలు అర్ధవంతంగా ఉండడం లేదు. ఎవరికి తోచిన లేదా వాళ్ళ రాజకీయ అజెండాతో విశ్లేషణలు చేస్తున్నారు కానీ అసలు విషయం మాత్రం ఎవరూ చెప్పట్లేదు.
1. మనకి స్వాతంత్ర్యం వచ్చిన 1947 లో ఒక రూపాయికి ఒక డాలర్ విలువగా ఉండేది.
2. 2008 లో వచ్చిన రీసెషన్ లేదా ప్రపంచ ఆర్ధిక మందగమనం వలన అప్పటి నుండి డాలర్ బలపడుతూ వస్తూనే ఉన్నది ఇప్పటివరకు. డాలర్ తో పోలిస్తే ఒక్క రూపాయి విలువ మాత్రమే పడిపోవట్లేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల కరెన్సీలు క్రమంగా పడిపోతూ వస్తున్నాయి.
Ads
3. 2008 లో ఒక డాలర్ తో ఒక యూరో [EURO] విలువ 50% ఎక్కువగా ఉండేది అంటే ఒక యూరో కి ఒకటిన్నర డాలర్ వచ్చేది. ఈ రోజున యూరో తన విలువని డాలర్ తో పోలిస్తే సమానంగా ఉంది అంటే ఒక డాలర్ కి ఒక యూరో దగ్గర ట్రేడ్ అవుతున్నది.
4. 2008 లో గ్రేట్ బ్రిటన్ పౌండ్ [GBP] తో రెండు డాలర్ల కంటే ఎక్కువే కొనవచ్చు. ఈ రోజున అదే అదే బ్రిటన్ పౌండ్ కి కేవలం 1.2 డాలర్లు కొనవచ్చు. సగానికి సగం విలువ పడిపోయింది పౌండ్ డాలర్ తో పోలిస్తే.
5. అలాగే డాలర్ తో కాకుండా ఇతర విదేశీ కరెన్సీలతో పోలిస్తే రూపాయి పటిష్టంగానే ఉంది. యూరో, బ్రిటన్ పౌండ్ లతో పోలిస్తే రూపాయి విలువ బలంగానే ఉంది ఇప్పుడు.
6. 2014 లో ఒక యూరో విలువ 83 రూపాయలుగా ఉండేది. ఈ రోజున యూరో విలువ 80 రూపాయలు అంటే 3 రూపాయలు బలపడ్డది రూపాయి.
7. 2014 లో ఒక బ్రిటన్ పౌండ్ విలువ 104 రూపాయలుగా ఉండేది. ఈ రోజున అదే పౌండ్ విలువ 93 రూపాయలుగా ఉంది. అంటే రూపాయితో పోలిస్తే పౌండ్ విలువ 11 రూపాయలు పడిపోయింది. రూపాయి పౌండ్ తో పోలిస్తే బలంగా ఉంది.
8. 2014 లో ఒక ఆస్ట్రేలియా డాలర్ 55 రూపాయలుగా ఉండగా ఈ రోజున కూడా అదే 55 రూపాయలుగా ఉంది అంటే స్థిరంగా ఉంది అన్నమాట.
9. అభివృద్ధి చెందిన మార్కెట్లు అయిన జపాన్ యెన్, కెనడియన్ డాలర్, దక్షిణ కొరియా WON, న్యూజీలాండ్ డాలర్ లతో పోలిస్తే గత 8 ఏళ్లుగా రూపాయ విలువ స్థిరంగానే ఉంది.
అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు అయిన దేశాల కరెన్సీ తో పోలిస్తే రూపాయి విలువ బలపడింది. అదెలా ఉంది చూద్దాం.
10. 2014 లో ఒక బ్రెజిలియన్ రియాల్ తో 26 రూపాయలు కొనవచ్చు కానీ ఈ రోజున కేవలం 14 రూపాయలు మాత్రమే కొనవచ్చు. ఇక్కడ 12 రూపాయలు బలపడ్డది.
11. 2014 లో టర్కీకి చెందిన ఒక లీరాతో 28 రూపాయలు కొనవచ్చు అదే ఈ రోజున ఒక లీరాతో 5 రూపాయలకంటే తక్కువ కొనవచ్చు అంటే టర్కీ లీరాతో రూపాయి [23 రూపాయలు] బలపడ్డది.
12. పదేళ్ళ క్రితం ఒక రష్యన్ రూబుల్ ధర రెండు రూపాయల వరకు ఉండేది కానీ ఈ రోజున రూబుల్ ధర ఒక రూపాయి 40 పైసలుగా ఉంది. అదీ ఈ మార్పు ఎందుకొచ్చింది అంటే గత 4 నెలలుగా అంతర్జాతీయ ముడి చమురు ధర భారీగా పెరగడం వలన మాత్రమే… లేకపోతే ఒక రూబుల్ కి ఒక రూపాయిగా ఉండేది ఈ రోజున…
13. 2014 ఒక సౌత్ ఆఫ్రికన్ రాండ్ విలువ 6 రూపాయలుగా ఉండేది కానీ ఈ రోజున దాని విలువ పడిపోయి కేవలం 4.46 దగ్గర ఉంది.
14. 2014 లో ఒక నైజీరియన్ నైరా విలువ 0.35 పైసలుగా ఉండేది ఈ రోజున అది 19 పైసలుగా ఉంది.
15. ఇక మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ టాకా ధర ఒక రూపాయికి 82 పైసలు గా ఉండేది 2014 లో ఇప్పుడు మూడు పైసలు పెరిగి అది 85 పైసల దగ్గర స్థిరంగా ఉంది. ఈ మూడు పైసలు పెరగడానికి కారణం కోవిడ్ సమయంలో బంగ్లాదేశ్ టెక్సటైల్ రంగం అంటే రెడీ మేడ్ దుస్తుల పని ఆగకుండా కొనసాగించడం వలన సాధ్యపడింది. ఇది కేవలం మారకం విలువ మాత్రమే కానీ ఇప్పుడు క్రమంగా జిడిపి వృద్ధి రేటు పడిపోయే అవకాశాలు ఉండడంతో అక్కడి ప్రభుత్వం పొదుపు చర్యలు తీసుకుంటున్నది ఇంధనం విషయంలో.
16. ఇక శ్రీలంక, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల కరెన్సీ విషయాలని ఇక్కడ ప్రస్తావించడం అవివేకం ఎందుకంటే ఇప్పటికే పాకిస్థాన్ రూపాయి ఒక డాలర్ కి 226 రూపాయలుగా ఉంది ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది.
ప్రధానులు చేయగలిగేది ఎంత..?
ఇక చివరగా….. 2004 లో మన్మోహన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఒక డాలరు విలువ 45 రూపాయలుగా ఉంది. 2014 లో మన్మోహన్ ప్రధానిగా దిగిపోయే సమయానికి ఒక డాలర్ విలువ 62 రూపాయలుగా ఉంది. అంటే రూపాయి విలువ పతనం 37% అన్నమాట.
2014 లో ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇప్పటి వరకు డాలర్ తో రూపాయి విలువ పతనం 29% గా ఉంది. ఇది 2024 కి దాదాపుగా 35% గా ఉండవచ్చు ఇదే రీతిన రూపాయి విలువ పడిపోతూ ఉంటే…. ఇది మన్మోహన్ 10 ఏళ్ల కాలంలో ఉన్న 37% శాతానికి సమానంగా లేదా కొద్దిగా తక్కువగా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్ధికవేత్తగా పరిగణించే మన్మోహన్ పాలన కాలానికి ఒక చాయ్ వాలా అయిన మోడీ పాలన కాలానికి పెద్దగా వ్యత్యాసం ఉండబోదు. ఇక్కడ రాజకీయ పార్టీల మధ్య పోటీ లేదు ఉండబోదు.
అమెరికా ఏం చేస్తోంది..?
అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడం మూలానా అమెరికా డాలర్ ని ప్రింట్ చేసి మార్కెట్లోకి వదిలింది గత మూడు నెలులుగా… కానీ అది ఫలితాలని ఇవ్వకపోవడంతో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లని పెంచింది.. దాంతో అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు నష్టాలని చవిచూశాయి. ఎందుకంటే వివిధ దేశాల స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు తమ పెట్టుబడులని ఉపసంహరించుకొని ఆ డబ్బుని ఫెడరల్ రిజర్వ్ లో డిపాజిట్ చేశారు ఎక్కువ వడ్డీ వస్తుందని…. మరో వైపు బంగారం మీద పెట్టుబడులు పెట్టినవాళ్ళు కూడా పెరిగిన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల వలన బంగారం మీద పెట్టిన పెట్టుబడులు ఉపసంహరించుకొని వాటిని ఫెడరల్ రిజర్వ్ లో డిపాజిట్ చేశారు దాంతో బంగారం ధర పడిపోయింది అంతర్జాతీయంగా… అయితే బంగారం ధర పడిపోవడానికి మరో కారణం కూడా ఉంది.. అది పెరిగిన ముడి చమురు ధరలు. ముడి చమురు షేర్ల మీద బంగారం అమ్మిన డబ్బుని ఇన్వెస్ట్ చేశారు. ఇది కూడా బంగారం ధర పడిపోవడానికి ఇంకో కారణం…
రూపాయి నిజంగానే బక్కిచిక్కిందా..?
ఏతావాతా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే అంతర్జాతీయంగా అన్ని దేశాల కరెన్సీ విలువ పడిపోతున్నది క్రమంగా. ఇది డాలర్ బలపడడం వలన జరుగుతున్నది కానీ మన రూపాయి విలువ మాత్రమే పడిపోవడం వలన కాదు. డాలర్ అనేది అంతర్జాతీయ మారక ద్రవ్యం కాబట్టి అది బలపడుతూనే ఉంటుంది… అలా చెప్పుకునే కరెన్సీలు ఏవన్నా ఉన్నాయా అంటే అది పాకిస్థాన్, శ్రీలంక లాంటి దేశాల కరెన్సీ విలువ. వాళ్ళ అసమర్ధత వలన విపరీతంగా పడిపోయాయి. మన రూపాయి ఒక్క డాలర్ తో తప్ప మిగతా అన్ని అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే క్రమంగా బలపడుతున్నట్లు పైన చెప్పిన గణాంకాలు రుజువు చేస్తున్నాయి. అలాగే ఇతర అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు కూడా డాలర్ తో పోలిస్తే విలువ పడిపోతున్నాయి.
అదుగదుగో ప్రపంచ ఆర్థిక మందగమనం…
2008 లోలాగా మరో ప్రపంచ ఆర్ధిక మందగమనం వచ్చే సూచనలు కనపడుతున్నాయి. బహుశా వచ్చే రెండేళ్ళు ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేటు బాగా పడిపోవచ్చు. చాలా దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలిపోయే అవకాశాల్ని కొట్టిపారవేయలేము. శ్రీలంక, పాకిస్థాన్ లు ఒక చిన్న ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి దేశాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి వాటి ప్రభావం ఇతర దేశాల మీద కూడా పడుతుంది.
ఈ మధ్యన బాగా వినపడుతున్న నినాదం స్వదేశీ ముద్దు విదేశీ వద్దు. బాగుంది కదా ? ఒక ఉదాహరణ చెప్పుకుందామా ? మన దేశ కార్లనే కొందాము విదేశీ బ్రాండ్ల కార్ల ని అసలు కొనవద్దు. మరి హ్యూండాయ్ లాంటి కొరియా సంస్థ మన దేశంలో లాభాలు లేవని మూసేసి కొరియాకి వెళ్లిపోతే వాళ్ళు మన దేశంలో పెట్టిన పెట్టుబడులని డాలర్ల రూపంలో మన దేశం నుండి తీసుకెళ్ళి పోతారు. ఆ డాలర్లు వెనక్కి ఇవ్వాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానిదే కదా ? అదే సమయంలో వేలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలని కోల్పోతారు. కాబట్టి సమతూకం పాటించాలి. అంతే కానీ విదేశీ వద్దు అంటే నష్టాలు కూడా ఉంటాయి. విదేశీ వద్దు అంటే అమెజాన్ లో విదేశీ వస్తువులు కొనకుండా ఉండాలి. దాని స్థానంలో మన దేశ వస్తువులు కొనాలి. మీరు అమెజాన్ లో కొనే విదేశీ వస్తువులకి మన రూపాయలలో చెల్లిస్తామా, అదే సమయంలో అమెజాన్ వాటిని డాలర్ల రూపంలో మార్చుకొని బయటి దేశాలకి ఇస్తుంది. అర్ధమవుతున్నదా…?
Share this Article