ఇన్ సెన్సిటివ్ అయిపోతున్నామా..? నిజంగా చర్చించాల్సినవి, ఆందోళన పడాల్సినవి వదిలేసి… పక్క దోవల్లో పడి, కీలకాంశాల నుంచి తప్పించుకుని చాటుచాటుగా వెళ్లిపోతున్నామా..? మొన్నటి ఓ వార్త చదివితే అలాగే అనిపించింది… సొసైటీకి పెద్ద జాడ్యం- పిల్లలపై అత్యాచారాలు… మన దిక్కుమాలిన సినిమాల పుణ్యమాని… స్కూల్ ఏజ్ నుంచే కామాన్ని ఎక్కిస్తున్నామ్… ‘ఆ పని’ కోసం దేనికైనా తెగించాలనే ‘కుతి’ని దట్టిస్తున్నామ్… అది ఆడపిల్లల పాలిట నరకం అవుతోంది… కానీ దోషులను మనం శిక్షించగలుగుతున్నామా..? ఉన్న చట్టాలకే కొత్త బాష్యాలు చెబుతూ, స్పూర్తిని పక్కదోవ పట్టిస్తూ కాపాడే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయా..? కేరళలో ఓ కేసు… ఒకడు ఓ అమ్మాయికి నీలి చిత్రాలు చూపిస్తూ, ఆమె జననేంద్రియాలను తాకడానికి ప్రయత్నిస్తూ, బెదిరిస్తూ ఉండేవాడు…
ఓసారి అదుపు తప్పాడు… పెద్దలకు తెలిసింది, కేసు పెట్టారు… దిగువ కోర్టు లైంగిక దాడి అని నిర్ధారిస్తూ, తనను దోషిగా ఖరారు చేసి శిక్ష విధించింది… కేసు హైకోర్టుకు వచ్చింది… అసలు నేను రేప్ చేయలేదు, నా పురుషాంగం ఆ పిల్ల తొడలకు మాత్రమే తగిలింది, అది అత్యాచారం ఎలా అవుతుంది అనేది నిందితుడి వాదన… నో, నో, సెక్షన్ 375 ప్రకారం ‘‘అంగప్రవేశం’’ జరిగితేనే అత్యాచారం అంటారు తన లాయర్లు… థాంక్ గాడ్, హైకోర్టు దీనిపై సరిగ్గా స్పందించింది… సంభోగానికి పురుషుడు ఎంచుకునే నోరు, యోని, పాయువే గాకుండా… శరీరంపై ఎక్కడ తాకినా అది లైంగిక దాడే అని తేల్చింది… పురుషాంగాన్ని శరీరభాగాలకు కోరికతో తాకించడం ద్వారా అది లైంగిక సంతృప్తిని పొందడమే కదా అని వ్యాఖ్యానించింది…
Ads
ఆమధ్య మీకు గుర్తుందా..? ఒక పోక్సో కేసులో బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ ఓ చిత్రమైన తీర్పు ఇచ్చింది… స్కిన్-స్కిన్ టచ్ లేకపోతే అది లైంగిక దాడి కాదని చెప్పింది… దుస్తులు వేసుకుని ఉన్న బాలిక ఛాతీని తాకితే అది లైంగిక దాడి ఎలా అవుతుందని ప్రశ్నించింది… సో, పోక్సో చట్టం వర్తించదు అని పేర్కొంది… చర్మాలు తగిలితేనే లైంగిక దాడి అనే నిర్వచనాన్ని, ఈ తీర్పును అటార్నీ జనరల్ కూడా వ్యతిరేకించాడు… సుప్రీంకోర్టుకు వచ్చింది కేసు… ఇప్పుడు ఈ కేసులో తమకు సహకరించడానికి సుప్రీం అమికస్ క్యూరీని నియమించింది… చట్టంలో అస్పష్టతను తొలగించడానికి ఈ కేసు ఉపయోగపడుతుందేమో చూడాలి… ఆమధ్య మరో కేసులో ‘‘రేప్ బాధితురాలిని’’ పెళ్లి చేసుకుంటానంటే బెయిల్ ఇస్తానన్నది ఓ కోర్టు… అప్పటికే తను వివాహితుడు… పైగా రేప్ ఓ తీవ్ర నేరం అయినప్పుడు, బాధితురాలిని పెళ్లి చేసుకుంటే అది క్షమార్హంగానో, కేసు తీవ్రత తగ్గించతగిన పశ్చాత్తాపంగానో పరిగణించవచ్చా..? ఒక రేపిస్టు వ్యక్తిగతంగా ఆయా బాధితులకు మాత్రమే కాదు, సమాజానికి శత్రువు కదా… తమ క్లయింట్లను కాపాడేందుకు లాయర్లు ఆయా చట్టాల్లోని అస్పష్టతల్ని వాడుకునే ప్రయత్నం చేయడం సహజం… ఇలాంటి సందర్భాల్లో కోర్టులు వాటిని నివారిస్తూ, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలి… కొన్నింటిపై సొసైటీలోనూ చర్చ జరగాలి… స్కిన్-స్కిన్ టచ్ వంటి తీర్పులు వచ్చినప్పుడు డిబేట్ జరగకపోతే ఇక సామాజిక చైతన్యానికి అర్థమే లేదు… విషాదం ఏమిటంటే..? ఇలాంటి తీర్పుల్ని, కేసుల్ని, విచారణల్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాకే పట్టడం లేదు… సబ్ జుడీస్ అవుతుందనే జంకు కాదు… అసలు వాటి కవరేజీ పట్లే అనాసక్తి…!!
Share this Article