.
ప్రధాని మోడీ అమెరికా పర్యటనవేళ కీలక పరిణామం. ఇది యాదృచ్ఛికమో…లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయేమో తెలియదు కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు.
ఈ ఆర్డర్స్ దేశంలోనే పేరు గాంచిన పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీకి ఎంతో ఊరట కల్పించేవి కావటం విశేషం. ప్రధాని మోడీ , గౌతమ్ అదానీల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని… ఆయన అండతోనే అదానీ దేశంలో ఏ పారిశ్రామికవేత్త ఎదగనంత వేగంగా ఎదిగారు అని విపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
Ads
తాజాగా డోనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏమిటి అంటే 1977 నాటి విదేశీ అవినీతి విధానాల చట్టం (ఎఫ్‌సిపీఏ) అమలును నిలుపుదల చేస్తూ ఆదేశించారు. గత ఏడాది ఇదే చట్టం కింద అదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికాలో అభియోగాలు నమోదు అయిన విషయం తెలిసిందే.
విద్యుత్ ప్రాజెక్టులు దక్కించుకునేందుకు అదానీ గ్రూప్ కంపెనీలు ప్రభుత్వంలోని పెద్దలకు.. అధికారులకు ఏకంగా వేల కోట్ల రూపాయల లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. అమెరికాలో కొత్తగా నియమితురులైన అటార్నీ జనరల్ పామ్ బొండిని ఈ చట్టం అమలును నిలిపివేయాల్సిందిగా ట్రంప్ ఆదేశించారు.
ఈ చట్టం కింద అమెరికాలో నిధులు సమీకరించే సంస్థలతో పాటు వివిధ కంపెనీలు ప్రాజెక్టులు, కాంట్రాక్టులు పొందటానికి లంచాలు ఇవ్వటాన్ని నిషేధిస్తుంది. తాజాగా ట్రంప్ ఆర్డర్ అదానీ గ్రూప్ తో పాటు పలు ఇతర కంపెనీలకు ఊరట కల్పించే నిర్ణయంగా చెప్పుకోవచ్చు.
ఎఫ్‌సిపీఏను అతిగా ఉపయోగించటం వల్ల అమెరికా కంపెనీలు ఇతర అంతర్జాతీయ సంస్థలతో సమానంగా అవకాశాలు దక్కించుకోలేకపోతున్నాయి అని వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేయటం విశేషం.
ఆరు నెలలపాటు ఎఫ్‌సిపీఏను సమీక్షించనున్నారు. ఈ సమీక్ష తర్వాత ఈ చట్టం విషయంలో ఎలా ముందుకు పోవాలో నిర్ణయం తీసుకుంటారు. అదానీ గ్రూప్ తమపై వచ్చిన అవినీతి ఆరోపణలను తోసిపుచ్చుతున్నా కూడా యూఎస్ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌లో నమోదయిన కేసులను డీల్ చేయటం కోసం కొద్ది రోజుల క్రితం లీగల్ టీమ్స్ కూడా నియమించుకున్నట్లు వార్తలు వచ్చాయి.
ఈ తరుణంలో ట్రంప్ నిర్ణయం అదానీ గ్రూప్‌కు పెద్ద ఊరటగానే చెప్పుకోవచ్చు. తాజాగా పరిణామాలతో రాబోయే రోజుల్లో అదానీ కేసు పెద్దగా ముందుకు కదిలే అవకాశాలు ఉండవు అనే ఉద్దేశంతో మంగళవారం నాడు మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసినా కూడా అదానీ ఫ్లాగ్ షిప్ కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు మాత్రం 31 రూపాయల లాభంతో 2322 రూపాయల వద్ద ముగిశాయి.
ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ఒక్క అదానీ గ్రూపుకే కాకుండా సెకీతో ఒప్పందంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి కూడా ఊరట కల్పించే నిర్ణయం అనే చెప్పుకోవచ్చు. అమెరికాలోనే ఈ కేసు లేకుండా పోతే ఇండియాలో అదానీపై కేసు ఏ మాత్రం ముందుకు వెళ్ళదు అనే విషయం తెలిసిందే…
మీకు ఓ సామెత తెలుసా..? ఏడ్చేదాని మొగడు తిరిగొస్తే నా మొగుడు కూడా వస్తాడు, నేనెందుకు ఏడ్వడం..! ఇది జగన్‌కు సరిగ్గా వర్తిస్తుంది… అదానీ సేఫ్ అయితే నేనూ సేఫ్… ఖేల్ ఖతం… – వాసిరెడ్డి శ్రీనివాస్…
Share this Article