.
Subramanyam Dogiparthi …. అలుగుటయే యెరుంగని ఆడవాళ్లు అలిగిన నాడు కొంపలు కొల్లేరు కాక మానవు , పస్తుల వర్షం కురవక మానదు . హల్లో మగాళ్ళలారా ! గుర్తుంచుకోండి . సుఖశాంతులతో వర్ధిల్లండి . ఆడవారికి క్షమాపణలతో నా మాటలు తప్పుగా అనిపిస్తే .
ఎర్ర సినిమాలే కాదు ; చక్కటి పచ్చ కాపురాల సినిమాలను తీయగలనని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్న వేజెళ్ళ సత్యనారాయణ . మంచి ఫీల్ గుడ్ మూవీ . ఉమ్మడి కుటుంబాల మీద , ఆదర్శ కుటుంబాల మీద ఎన్ని సినిమాలు వచ్చాయో ! ఆల్మోస్ట్ అన్ని సినిమాలూ హిట్టయ్యాయి . అలా బాగా ఆడిన సినిమా 1983 డిసెంబర్లో వచ్చిన ఈ ఆడవాళ్ళే అలిగితే సినిమా .
Ads
సినిమాలో అయిదు జంటలు . గుమ్మడి- దేవిక , నూతన్ ప్రసాద్- పి ఆర్ వరలక్ష్మి , రంగనాధ్- వేజెళ్ళ రాజేశ్వరి అంటే డైరెక్టర్ గారి భార్య , రాజేంద్ర ప్రసాద్- రాజ్యలక్ష్మి , సాయిచంద్- వనిత శ్రీ . ఇంటికి పెద్ద దిక్కు గుమ్మడి . పెద్దన్నయ్య మాత్రమే కాదు ; పిల్లలు పుడితే తమ్ముళ్ళ పిల్లల్ని బాగా చూసుకోలేమో అని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్న తండ్రి లాంటి గొప్ప పాత్ర .
ఈ పచ్చని కుటుంబానికి నిత్యం వాలిపోయే పాత్ర సుత్తి వేలుది . ఈ అన్యోన్య కుటుంబాన్ని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు . చాలా సినిమాల్లోలాగా ఏడ్చినా దుష్టుడు కాదు ; హితోభిలాషే . గుంటూరు జిల్లా అమ్మాయిని , అందులో ఫిరంగిపురం అమ్మాయిని చేసుకున్నానని , ఫిరంగుల వాన కురిపిస్తూ ఉంటుందని మా గుంటూరు జిల్లా మీద చెణుకులు వేయించాడు వేజెళ్ళ సుత్తి వేలు చేత .
వేజెళ్ళది కూడా గుంటూరు జిల్లాయే . అందుకనే స్వతంత్రం తీసుకుని ఉంటాడు . అయిదుగురు కోడళ్ళు అయిదు జిల్లాల నుండి వస్తారు . ఆయా జిల్లాల యాసలను వినిపిస్తుంటారు ప్రేక్షకులకు . సరదాగా ఉంటుంది .
టూకీగా కధ ఏంటంటే…. అన్యోన్యంగా సాగిపోయే కుటుంబంలో ఒక రోజు ఒకే తల్లికి పుట్టిన అయిదుగురు అన్నదమ్ములు కలిసి మెలిసి ఉండటం గొప్పా లేక ఎక్కడెక్కడ నుంచో వచ్చిన అయిదుగురు తోడి కోడళ్ళు కలిసి మెలిసి ఉండటం గొప్పా అని సంవాదం రేగుతుంది .
ఇంకేముంది . ఆడవాళ్లు అయిదుగురు తమ విశ్వరూపాన్ని చూపి అన్నదమ్ముల్ని అదరగొట్టేసి ఆడవాళ్ళే గొప్పోళ్ళు అని తేలుస్తారు .
కృష్ణ- చక్ర సంగీత దర్శకత్వంలో పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . ముఖ్యంగా గుమ్మడి షష్టి పూర్తి పాట . సీతమ్మ బుగ్గల్లో సింధూరం మెరిసింది పాట చాలా బాగా చిత్రీకరించబడింది . ఆ పాటలో షష్టి పూర్తి చేసుకునే జంట ఫీలింగ్స్ , ఎమోషన్స్ , మురిసిపోవటం ఎలా ఉంటాయో అద్భుతంగా చూపాడు వేజెళ్ళ .
గుమ్మడి చాలా చక్కగా నటించాడు . షష్టి పూర్తి చేసుకున్న వాడిగా ఆ అనుభూతి నాకు తెలుసు . మరో శ్రావ్యమైన పాట తూరుపు దిశలో తొలి కిరణం వెలుగుతు ఉంది వేసే ముగ్గు .
గణేష్ పాత్రో డైలాగ్స్ బాగుంటాయి . ఈ సినిమాలో ఆమ్మ , పెద్దమ్మ , దొడ్డమ్మ పదప్రయోగాల గురించి ఉంటుంది . చిన్నప్పుడు మా స్కూల్లో నేను ఆమ్మ అంటే మా సంస్కృతం మాస్టారికి అర్థం కాలేదు . వాళ్ళు పెద్దమ్మ అంటారట . ఆ సంగతి నాకు తెలియదు . అప్పుడే తెలుసుకున్నాను . అలాగే చిన్నమ్మ- పిన్ని , పెద నాన్న- ఆయ్య పదాలు . ఒకే భాషలో ఎన్ని యాసలో , ఎన్ని మాటలో !
సినిమా యూట్యూబులో ఉంది . చూసి ఉండకపోతే తప్పక చూడండి . అన్నదమ్ములు , అక్కచెల్లెళ్ళు , తోడి కోడళ్ళు తప్పక చూడాల్సిన ఫీల్ గుడ్ సరదా సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article