తెర నిండుగా ఉంటుంది… బోలెడు పాత్రలు ఫోటోషూట్ కోసం నిలబడ్డట్టుగా వరుసగా నిలబడతారు… పెద్ద ఆసక్తికరంగా ఉండదు కథ… ఏవో నాలుగు సీన్లు… చాలాసార్లు కృతకంగా……. ఏమిటి, టీవీ సీరియళ్ల గురించి చెబుతున్నారా అని అడక్కండి… నేను అచ్చం ఆ టీవీ సీరియల్ వంటి ఓ సినిమా గురించే చెబుతున్నాను… సర్లే, టీవీల్లో వచ్చినప్పుడో, ఓటీటీల్లో ఇచ్చినప్పుడో చూసేస్తాం లెండి అని మూసేయకండి… అరె, వాళ్లు థియేటర్లలో రిలీజ్ చేశారు… చెప్పుకోకపోతే ఎట్లా..?
సరే, చెప్పు, చెప్పు…. మస్తు మంది కనిపిస్తరు సినిమాలో… అప్పటి హీరోయిన్లు రాధిక, ఖుష్బూ, ఊర్వశి ఎట్సెట్రా… ఈమధ్య పెద్దగా కనిపించని ఝాన్సీ, సత్య కృష్ణన్ కూడా… మధ్యమధ్యలో ప్రజెంట్ హీరోయిన్ రష్మిక కూడా కనిపిస్తుంది… హీరో కాబట్టి శర్వానంద్, ప్రజెంట్ సినిమా అన్నాక ఉండకతప్పని వెన్నెల కిషోర్… మరి ఇందరున్నారు కదా, ఇంకా కథ దేనికి అంటారా..? అవును, దర్శకుడు అదే అనుకున్నాడు… ఉండీలేనట్టున్న ఓ కథను వదిలాడు…
నిజానికి ఇన్ని ఆడ పాత్రలతో ఓ సినిమా అనేది ఓ మంచి సంకల్పమే… రొటీన్ పిచ్చి ఫార్ములా కథలతో, అతి హీరోయిజం పోకడలతో మూలుగుతున్న తెలుగు సినిమాకు అప్పుడప్పుడూ ఇలాంటివే రిలీఫ్… పైగా శర్వా మంచి నటుడు… ఓవరాక్షన్ అస్సలు చేతకాదు, పాత్రకు అవసరమైనంత మాత్రమే నటిస్తాడు… ఢాం ఢుష్‌లు, డిష్యూం డిష్యూంలు లేకపోయినా ప్రేక్షకుడిని మెప్పిస్తాడు… కానీ ఫాఫం, ఉన్న పిడికెడు కథలో తను మాత్రం ఏం చేస్తాడు..?
Ads
అప్పట్లో ఉన్నది ఒకటే జిందగీ అని కాస్త చూడబుల్ సినిమానే తీసినట్టున్నాడు ఈ సినిమా దర్శకుడు తిరుమల కిషోర్… మరేమిటో పాపం, ఈ సినిమాను ఇలా తీశాడు… దేవిశ్రీప్రసాద్ మొన్నమొన్ననే కదా పుష్పతో బంపర్ హిట్ కొట్టాడు, అప్పుడు చల్లబడిపోయాడు ఎందుకో మరి..! అంటే సినిమా చూడబుల్ అంటారా లేదా అనేది స్ట్రెయిట్ ప్రశ్న… ఊర్వశి, శర్వా బాగా చేశారు, మిగతావాళ్లు సినిమాలో ఉన్నారు… ఒక రాధిక, ఒక ఖుష్బూను తీసుకున్నప్పుడు ఎంత బలమైన ఘర్షణ ఉండాలి కథలో… అబ్బే, అవేమీ లేవు… ముందే చెప్పుకున్నాం కదా, టీవీ సీరియల్‌ను పెద్ద తెరపై చూపించారు అని…
ఫాఫం శర్వాకు బొత్తిగా మంచి పాత్రలు దొరకడం లేదు… దొరికితే దున్నేస్తాడు… రష్మికకు ఏ సినిమా అయినా ఒకటే… ఏ పాత్ర అయినా ఒకటే… కాకపోతే సినిమాలో బాగా నచ్చేది ఏమిటంటే… ఎక్కడా అశ్లీలం లేదు, కావాలని అసభ్య సీన్లను పెట్టలేదు… దర్శకుడు దారితప్పలేదు… కాకపోతే తను నమ్ముకున్న ఫన్, కామెడీ సీన్లు పండలేదు, అంతే… కాస్త ఆ కామెడీ సీన్లు పేలి ఉంటే సినిమా కూడా భలే పేలి ఉండేది… కానీ ఒక్కటంటే ఒక్క సీనూ కాస్త లోతుగా లేదు, దాంతో సినిమా ఉత్త తోకపటాకులా మారిపోయింది… ఐనా పర్లేదు, టీవీల్లో ఎలాగూ రాకపోదు, చూసేద్దాం… హేమయ్యా, నిర్మాతా… వచ్చే ఉగాదికి ప్లాన్ చేసెయ్… అయితే ఓటీటీ, లేదా టీవీ… ఎలాగూ టీవీకే పర్‌ఫెక్ట్ ఫిట్ కదా ఈ సినిమా…
Share this Article