.
Subramanyam Dogiparthi …… 1985 లోకి వచ్చేసాం . రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి సోలో హీరోగా నటించిన మొదటి సెన్సేషనల్ హిట్ మూవీ ఈ అడవిదొంగ . దీనికి ముందు రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోసగాడు సినిమాలో చిరంజీవి నటించినా అందులో సీనియర్ నటుడు శోభన్ బాబు ఉన్నారు .
చిరంజీవి-రాఘవేంద్రరావు సినీ జైత్రయాత్రలో మొదటి మజిలీ 1985 నవంబర్లో వచ్చిన ఈ అడవి దొంగ సినిమాయే . మా చిన్నప్పుడు హిందీలో టార్జాన్ సినిమాలు వచ్చేవి . మన తెలుగులో తక్కువే .
Ads
ఈ సినిమా మొదటి హాఫ్ అంతా చిరంజీవికి డైలాగులు ఉండవు . Of course . రొమాంటిక్ డ్యూయెట్లు ఉన్నాయనుకోండి . టార్జానుగా సింహంతో పోరాటం , పాత సినిమాల్లో యన్టీఆర్ , కాంతారావుల్లాగా మొసలిని చంపేయటం వంటి సీన్లకు బాల్కనీలో కూర్చున్న ప్రేక్షకులు కూడా చప్పట్లు కొడతారు .
పరుచూరి బ్రదర్స్ బ్రహ్మాండమైన కధను నేసారు . కధ రొటీన్ దుష్టశిక్షణ కధయినా టార్జాన్ పాత్ర సృష్టించాలనే ఆలోచన అద్భుతం . అడవుల్లో ఏనుగులతో పెరగటం , నాగరికత తెలియకపోవటం , అడవి మనిషి కావటం , వగైరా సూపర్బ్ . కధకు తగ్గ డైలాగులు . రాఘవేంద్రరావు బిర్రయిన స్క్రీన్ ప్లే , దర్శకత్వం సినిమాను సూపర్ డూపర్ హిట్టుని చేసింది .
వీటిని మించి చక్రవర్తి సంగీతం , వేటూరి వారి పాటలు , సలీం నృత్య దర్శకత్వం , బాలసుబ్రమణ్యం , సుశీలమ్మల గాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అవటానికి కారణాలు అయ్యాయి . నాకు ఈ సినిమాలో చాలా బాగా నచ్చే పాట శారద చిరంజీవిని సకల కళా పారంగతుడిగా తీర్చిదిద్దే క్రమంలో వచ్చే ఓం నమశ్శివాయ పాట .
శారద అభినయం , వ్యక్తిత్వ పరిణామ క్రమంలో చిరంజీవి నటన హేట్సాఫ్ . ముఖ్యంగా చిరంజీవి నటన అద్భుతం . వీరిద్దరితో పాటు ప్రియురాలు రాధ కూడా గురువై హార్స్ రైడింగ్ , పిస్టల్ షూటింగులను నేర్పడం చాలా బాగా చిత్రీకరించారు దర్శకుడు .
రొమాంటిక్ డ్యూయెట్లలో మొదటగా వీర విక్రమ ధీర దిగ్గజ నీకే స్వాగతాలు చెప్పుకోవాలి . చిరంజీవి , రాధ డాన్స్ , చిత్రీకరణ , అన్నీ బ్రహ్మాండంగా వచ్చాయి . వానా వానా వందనం వయసా వయసా వందనం వాన పాట చిరంజీవి అభిమానుల చేత గంతులు వేయిస్తుంది . (అప్పట్లో హీరోలందరికీ వానపాట మస్ట్... పాటలో ఇంధనం పదం దగ్గర సెన్సార్ ఏదో కొర్రీ పెట్టినట్టు గుర్తు...)
రాఘవేంద్రరావు వాన పాట సెంటిమెంట్ బాగానే వర్కవుట్ అయింది . అలాగే అడవి రాముడు ఘన విజయం ఛాయలో అడవి అనే పదాన్ని ఈ సినిమాకూ సెంటిమెంటుగా జోడించి ఉంటాడు .
ఇది ఒక నందనవనము మనసులు కలిసిన దినము , వచ్చె వసంతకాలం , చల్లగాలి కొట్టిందమ్మా ఒక్క దెబ్బ డ్యూయెట్లు కూడా ప్రేక్షకులను ఊపేసాయి . సలీం నృత్య దర్శకత్వంలో చిరంజీవితో ధీటుగా నృత్యించగల నటి రాధ . పోటాపోటీగా నృత్యించారు ఈ సినిమాలో కూడా . ఈ సినిమా ఘనవిజయానికి అవీ కారణమే .
చిరంజీవి తర్వాత చెప్పుకోవలసింది శారద నటనే . విషాద శారదను రౌద్ర శారదగా మార్చిన ఘనత పరుచూరి బ్రదర్సుదే . ఆమె పాత్రలను బాగా ఎలివేట్ చేస్తారు . ఈ సినిమాలో ఆమె పాత్ర , ఆ పాత్రలో ఆమె నటన అద్భుతం . ముఖ్యంగా అడవి మనిషిగా ఉన్న తన కొడుకుని సంపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దే క్రమంలో ఆమె నటన బాగుంటుంది .
రాధ గ్లామర్ స్పేసుని ఫిల్ చేయడమే కాకుండా చలాకీ యువతిగా కూడా బాగా నటించింది . విలనుగా రావు గోపాలరావు , ఫాదరే అనే కొడుకుగా చిన్న విలనుగా నూతన్ ప్రసాద్ , ఆస్థాన అవధానిగా అల్లు రామలింగయ్యలు బాగా నటించారు . ఈ విలన్ల డెన్ బాగుంటుంది . డెన్లోకి పోవటానికి గనుల్లోలాగా ఓ ట్రాం . ఇవన్నీ సాధ్యమేనా అని ప్రేక్షకుడు అనుకోకుండా మాయ చేసాడు రాఘవేంద్రరావు . ఇతర పాత్రల్లో జగ్గయ్య పి యల్ నారాయణ , శ్రీధర్ , చలపతిరావు , పి జె శర్మ , నర్రా , ప్రభృతులు నటించారు .
It’s a great sensational romantic , musical , action , entertainer . ఖైదీ సినిమా తర్వాత ఆ లెవెల్లో ఒక ఊపు ఊపేసిన సినిమా అని చెప్పుకోవచ్చు . చలసాని గోపి నిర్మించిన ఈ సినిమా వచ్చి నలభై ఏళ్లు అయినా ప్రేక్షకుల బుర్రల్లో ఇంకా ఫ్రెష్ గానే ఉంది ఈమధ్యనే వచ్చిందా అన్నట్లుగా . బహుశా ఈతరంలో కూడా చూడని వారు ఉండరేమో ! ఒకరూ అరా ఉంటే అర్జెంటుగా చూసేయండి . యూట్యూబులో ఉంది .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు
Share this Article