Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలే రెండు సింహాలు… రెండు సివంగులు… చింపాంజీ డబులాక్షన్…

April 9, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……… ఓ చింపాంజీ చేత ద్విపాత్రాభినయం చేయించిన ఏకైక దర్శకుడు ప్రపంచ సినిమా చరిత్రలో ఒక్కడే ఒక్కడు దర్శకుడు రాఘవేంద్ర రావేనేమో !

1983 ఏప్రిల్ 28 న రిలీజయిన ఈ అడవి సింహాలు సినిమాలో ఈ ప్రయోగాన్ని చేసారాయన . అంతేనా ! డబుల్ పోజులో ఉన్న చింపాంజీలకు రొమాన్స్ , శుభం కార్డు అప్పుడు కృష్ణ- శ్రీదేవి, కృష్ణంరాజు- జయప్రదల జంటలతో పాటు మూడో జంటగా లిప్ లాక్ కూడా పెట్టాడు మహానుభావుడు . అడవిరాముడు అంత సూపర్ డూపర్ హిట్ కాలేదు కానీ సక్సెస్ అయింది .

Ads

12 కేంద్రాలలో వంద రోజులు అడింది . ఒకటి రెండు సెంటర్లలో షిఫ్టులతో 175 రోజులు కూడా ఆడింది . 75 లక్షలు పెట్టుబడి పెడితే అశ్వినీ దత్తుకు మూడు కోట్లకు పైగా వసూలు అయిందట . మద్రాస్ , మధుమలై అడవులు , విశాఖపట్నం భీమిలిలలో షూటింగ్ చేయబడిన ఈ సినిమా ఏకకాలంలో హిందీలో కూడా జానీ దోస్త్ అనే టైటిలుతో తీయబడింది . కృష్ణ పాత్రను జితేంద్ర , కృష్ణంరాజు పాత్రను ధర్మేంద్ర , జయప్రద పాత్రను పర్వీన్ బాబీ , శ్రీదేవి తన పాత్రను తానే వేసారు . హిందీలో కూడా సక్సెస్ అయింది .

ఫక్తు రాఘవేంద్రరావు మార్క్ 100% ఎంటర్టయిన్మెంట్ సినిమా . విధి బాధితులు అయిన ఇద్దరు బాలురు స్నేహితులవుతారు . అందులో ఒకరిని మరొకడు కష్టపడి పెంచుతాడు . వారిలో ఒకరు పోలీస్ ఆఫీసర్ . మరొకరు ఆవేశపరుడు . అడవి సింహాల అవతారం ఎత్తి అటవీ సంపదను దోచుకుంటున్న విలనాసురుల ఆట కట్టిస్తారు ఇద్దరు కలిసి . చేజింగులు , ఫైటింగులు , చింపాంజీలు , ఏనుగులు , పులులు , వెరశి కోబ్రా సర్కస్సే ఉంటుంది సినిమాలో .

రాఘవేంద్రరావు మార్క్ పాటల చిత్రీకరణ అందంగా ఉంటుంది . ఫలపుష్పాలు , డప్పులు , బిందెలు అయిపోయాక ఈ సినిమాలో బెలూన్లు వస్తాయి . వందలాది బెలూన్ల మధ్య రెండు జంటల డాన్స్ పాట చాలా ఊపుతో ఉంటుంది . పిల్లా నచ్చింది పెళ్ళి కుదిరింది పాట . రెండు జంటలూ కలిసి వేసిన ఈ డాన్స్ పాట ఇద్దరు హీరోల , హీరోయిన్ల అభిమానులకు పండగే పండగ . అగ్గిపుల్ల భగ్గుమంటది అనే క్లబ్ డాన్సుని సిల్క్ స్మిత , కృష్ణలు అదరగొట్టేస్తారు .

క్షేమమా ప్రియతమా సౌఖ్యమా నా ప్రాణమా పాట కృష్ణంరాజు , జయప్రదల మీద సాహిత్యపరంగా కూడా చాలా బాగుంటుంది , సంసారపక్షంగా ఉంటుంది . వేటూరిని అభినందించాలి . సినిమాలో అన్ని పాటల్నీ వేటూరే వ్రాసారు . చక్రవర్తి సంగీతంలో అన్నీ బాగుంటాయి .

కృష్ణ , కృష్ణంరాజుల కాంబినేషన్లో ఇది రెండో సినిమా . మొదటిది మనుషులు చేసిన దొంగలు . ఈ సినిమాలో సత్యనారాయణ పాత్రకు ఓ వెరైటీ పెట్టాడు రాఘవేంద్రరావు . రోజుకో మారువేషం వేస్తుంటాడు . వేటగాడులో హేట్ నుంచి బూట్ల దాకా ఒకే రంగు ఆహార్యం లాగా ఇంకో వెరైటీ . రావు గోపాలరావు మరో ప్రధాన విలనాసురుడు . ఇతర పాత్రల్లో అల్లు రామలింగయ్య , కృష్ణకుమారి , ప్రసాద్ బాబు , మాడా , పి జె శర్మ , ప్రభృతులు నటించారు .

100% వినోదాత్మకంగా ఉండే ఈ సినిమా ఇంతకుముందు చూడకపోతే వాచ్ లిస్టులో పెట్టేసుకోవచ్చు . హీరోయిన్లు ఇద్దరూ చాలా అందంగా కనబడతారు . ఇద్దరు హీరోల హీరోయిజం అభిమానులకు బాగా నచ్చుతుంది . సినిమా యూట్యూబులో ఉంది . సినిమా అంతా చూసే ఓపిక , టైం లేని కళారాధకులు యూట్యూబులో పాటల వరకు మిస్ కాకండి . హుషారుగా ఉంటాయి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టైటిల్‌లో అగ్ని ఉంటే చాలు… ఆ సినిమా మండిపోయి మసి..!
  • అమెరికా- ఇజ్రాయిల్ ప్లాన్లు ఎక్కడ బెడిసికొట్టాయి..? నెతన్యాహూ సేఫేనా..?
  • హనుమంతు జగన్నాయకుల దొర… తెలుగు పోలీసుల్లో ఓ చరిత్ర…
  • నో…! మెగా క్యాంపుకీ బన్నీకి నడుమ గ్యాప్ అలాగే ఉందన్నమాట..!!
  • విధిలేదు… సొంత భర్త ప్రాణాలే తీసేసింది… ఈమె కథ ఇప్పుడెందుకంటే..?
  • కొత్త సెన్సార్ రూల్స్..! నిర్మాతల గుండెల్లో కొత్త గుబులు..!!
  • చేతుల విరిచి కట్టి, గడ్డిమోపులు చుట్టూ పేర్చి… కాలబెట్టారు…
  • శుష్క రాజకీయ మూసీ వ్యూహాలకు… అసలు నిజాల వెల్లడితో సీఎం అడ్డుకట్ట…
  • శృంగేరీ పీఠం ఉత్తరాధికారి నకిలీ శంకరాచార్యుడా..? ఏంటీ రచ్చ..?!
  • శివధర్‌రెడ్డి దగ్గర తుపాకీ లేదా..? దాంట్లో బుల్లెట్లు లేవా మాజీ కామ్రేడ్ దేవ్‌జీ..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions