.
Subramanyam Dogiparthi
….. అడవి నేపధ్యంలో శోభన్ బాబు నటించిన ఈ అడవి రాజా సినిమా సూపర్ హిట్ సినిమా . 20 కేంద్రాలలో వంద రోజులు ఆడింది . పిల్లలు , మహిళలు , శోభన్ బాబు అభిమానులు ఇరగబడి చూసిన సినిమా .
ఈ సినిమా వచ్చేటప్పటికి అడవి రాముడు , అడవి సింహాలు , అడవి దొంగ బాగా హిట్టయ్యాయి . ఆ కోవలోనే కైకాల సత్యనారాయణ , ఆయన కుటుంబ సభ్యులు ఈ అడవి నేపధ్య సినిమాను ఎంచుకున్నారు .
Ads
సినిమా కధ చాలా వరకు రాజేష్ ఖన్నా హాథీ మేరీ సాథీ సినిమాకు దగ్గరగా ఉంటుంది . మక్కీకి మక్కీ కాదు . మా చిన్నప్పుడు టార్జాన్ సినిమాలు వచ్చేవి . పిల్లలంగా ఉన్నప్పుడు భలే చూసేవాళ్ళం . ఆ తర్వాత మన తెలుగులో కూడా పొట్టేలు పున్నమ్మ వంటి సినిమాలు హిట్టయ్యాయి . అలాగే షాడో చిన్నప్ప దేవర్ సినిమాలు కూడా . మొత్తం మీద జంతువులతో తీసిన సినిమాలన్నీ ప్రేక్షకుల ఆదరణ పొందాయి .
ఈ సినిమాలో కూడా ప్రధాన పాత్ర రాముడు అనే పేరుతో ఏనుగుది . తర్వాత ఓ కోతిది , కాసేపు గెస్ట్ అప్పియరెన్స్ చిలకది . బహుశా ఇప్పట్లో నిజమైన జంతువులతో సినిమాలు తీయటానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వదేమో !
ఈ సినిమాలో ఈ జీవాలతో పాటు ఓ బాల నటుడి పాత్ర కూడా ప్రాధాన్యత కలదే . సినిమాలో హీరోహీరోయిన్లు శోభన్ బాబు , రాధలతో పాటు వీరందరూ ప్రధాన పాత్రధారులే . అనాధగా పెరిగి ఫారెస్ట్ ఆఫీసరయిన రాజా అటవీ సంపదని , మూగజీవాలను పట్టి అమ్ముకునే విలన్లను తుదముట్టించేందుకు అడవికి వస్తాడు .
అడవికి వచ్చిన విలన్ బంధువులమ్మాయి రాధ హీరోతో ప్రేమలో పడటం , తండ్రిని కాదనుకుని ఇంట్లోంచి బయటకొచ్చి హీరో గారిని పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కంటుంది . అంతా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఆఫీసర్ మీద కోపంతో ఏనుగు ఆహారాన్ని పాయిజన్ చేయడంతో ఏనుగు ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి హీరో గారి కొడుకుని గాయపరుస్తుంది .
ఆ కోపంతో కొడుకుని తీసుకుని తండ్రి వద్దకు వెళ్ళిపోతుంది తల్లి . స్నేహితుడయిన ఏనుగుతో హీరో గారి కొడుకు , కోతి అడవిలోకి పారిపోతారు . విలన్లు హీరో గారి కొడుకుని కిడ్నాప్ చేస్తారు . హీరోహీరోయిన్లని బందీలను చేసి బ్లాక్ మెయిల్ చేస్తారు . అందరినీ ఏనుగు కాపాడి , ఆఫీసర్ గారి కాపురాన్ని చక్కదిద్దుద్ది . ఏనుగు దిద్దిన కాపురం అన్న మాట .
ఏనుగుని , కోతిని ట్రైన్ చేసిన శిక్షకులను అభినందించాలి . తర్వాత కాలంలో రాజేంద్రప్రసాద్ , యస్వీ కృష్ణారెడ్డి కాంబినేషనుతో మనకు మరో హిట్ సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు కూడా ఉంది .
విలన్లుగా సత్యనారాయణ , గిరిబాబు , గొల్లపూడి , నూతన్ ప్రసాదులు నటించగా ఇతర పాత్రల్లో చలపతిరావు , రాళ్ళపల్లి , ప్రభాకరరెడ్డి , శ్రీలక్ష్మి , కాకినాడ శ్యామల , మాడా , చిట్టిబాబు , ప్రభృతులు నటించారు .
చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వేటూరి పాటలనన్నీ వ్రాయగా బాలసుబ్రమణ్యం , సుశీలమ్మలు పాడారు . అడవికి వచ్చిన ఆండాళమ్మ ఏమైపోయిందో , ఉక్కిరి ఉక్కిరి నా మొగుడో , జాజి పూలు జడకు పెట్టనా మల్లెపూల మంచమేయనా , మేనత్త మేనక సొంతత్త ఊర్వశి అంటూ సాగే నాలుగు డ్యూయెట్లు హుషారుగా ఉంటాయి. (ఈ మేనత్త పాట రాసిన మహాద్భుత కలం ఎవరిదో గానీ కేంద్ర సాహిత్య అవార్డు గానీ, జాతీయ అవార్డు గానీ రాకపోవడం శోచనీయం..!!)
చిలకమ్మకిస్తాను చిగురాకు చీరె సీమంతం పాటలో హీరో , ఏనుగు , కోతి , చిలుక , పనివాడు రాళ్ళపల్లి అమ్మ గారి సీమంతాన్ని కలిసి చేస్తారు . హృద్యంగా ఉంటుంది . ఈ పాట సాహిత్యం కూడా బాగుంటుంది , సంసారపక్షంగా ఉంటుంది . ఐటమ్ సాంగ్ నాటు మనిషి బాబయా అంటూ సాగే పాట అనూరాధ మీద హుషారుగా ఉంటుంది .
సత్యానంద్ డైలాగ్స్ కూడా బాగుంటాయి . తమిళనాడులోని మసినగుడి ఫారెస్టులో చిత్రీకరించబడింది . కె మురళీమోహన రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1986 అక్టోబరులో వచ్చింది . సినిమా యూట్యూబులో ఉంది . మంచి కాలక్షేపం . చూడకపోతే తప్పక చూడండి . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు
Share this Article