.
రామాయణం సినిమాలో… హవ్వ, సీత చేత ఆయుధమా..? ఆమె కత్తి యుద్దమా..? అంటూ కొందరు తెగ చించేసుకుంటున్నారు… ఏడ్చేస్తున్నారు… రాసిన రచయితను బట్టి, కాలాన్ని బట్టి, ఆయా దేశాలను బట్టి, ఆయా సంస్కృతులను బట్టి, కళారూపాలను బట్టి అనేక రకాలుగా మార్పులకు లోనవుతూ వచ్చింది రామాయణం… అందులో అనేక ప్రక్షిప్తాలు, అనేక జోడింపులు, అనేక మార్పులు… ఉదాహరణకు లవకుశ…
అంతెందుకు..? మీకు తెలుసా..? అద్భుత రామాయణం గురించి… అందులో సీత ఒక రావణుడిని చంపేస్తుంది… (మైరావణుడు కాదు, అది మరో కథ)… ఈ రావణుడికి పది కాదు, ఏకంగా వెయ్యి తలలు… అంటే సహస్ర కంఠుడు… ఒక దశలో రాముడు స్పృహతప్పితే సీతే యుద్ధం చేస్తుంది… సత్యభామ కథ తెలుసు కదా, అలా… అద్భుత రామాయణానికీ, వాల్మీకి రామాయణానికీ నడుమ అసలు పొంతనే దొరకదు… ఓసారి అలా సంక్షిప్తంగా చెప్పుకుందాం…
Ads

రామాయణం అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది వాల్మీకి రామాయణం… రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు… ఈ పాత్రలతో సాగే కథ మనకు తరతరాలుగా పరిచయం… అయితే రామాయణం అనేది ఒకే రూపంలో, ఒకే కథనంతో, ఒకే వ్యాఖ్యానంతో వేల సంవత్సరాలుగా కొనసాగిన ఇతిహాసం కాదు… కాలగతిలో రామకథ అనేక మార్పులకు, చేర్పులకు, పునర్వ్యాఖ్యానాలకు లోనవుతూ వచ్చింది…
అందుకే మనకు వాల్మీకి రామాయణంతో పాటు ఎన్నో రామాయణాలు కనిపిస్తాయి… కొన్ని మూలకథకు దగ్గరగా ఉంటే, మరికొన్ని కొత్త పాత్రలను పరిచయం చేస్తాయి… ఇంకొన్ని పాత్రల స్వభావాన్నే మార్చేస్తాయి… ప్రక్షిప్తాలు, అనుసరణలు, స్థానిక కథనాలు, జానపద గాథలు… ఇలా రామాయణం ఒక నిరంతర సాహిత్య, సాంస్కృతిక ప్రవాహంగా మారింది…
ఉదాహరణకు లవకుశుల కథనే తీసుకుందాం… వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండలో సీతారాముల కుమారులుగా లవకుశుల ప్రస్తావన వస్తుంది… కానీ రామాయణం ఆధారంగా రూపొందిన అనేక జానపద, రంగస్థల, చలనచిత్ర రూపాల్లో ఈ ఘట్టానికి మరింత నాటకీయతను జోడించారు… రాముడికే ఎదురునిలిచి యుద్ధం చేసే బాల యోధులుగా వారి పాత్రలను తీర్చిదిద్దారు… మూలకథకు కొత్త భావోద్వేగాలను, కొత్త మలుపులను జోడించారు…
ఇలాంటి వైవిధ్యానికి మరో ఆసక్తికరమైన ఉదాహరణ అద్భుత రామాయణం… రావణుడిని మించిన మరో రావణుడు! వాల్మీకి రామాయణంలో రావణుడు ప్రధాన ప్రతినాయకుడు… సీతను అపహరించడం, రాముడితో యుద్ధం, చివరకు రావణ సంహారం… ఇదే ప్రధాన కథ… కానీ అద్భుత రామాయణం ఇక్కడితో కథను ముగించదు…
రావణుడి కంటే కూడా భయంకరమైన సహస్రకంఠ రావణుడు అనే మరో రాక్షసుడిని పరిచయం చేస్తుంది… వెయ్యి తలలతో ఉండే ఈ రావణుడు మరింత శక్తిమంతుడు… పది తలల రావణుడిని సంహరించిన తర్వాత కూడా రాముడికి మరో పెద్ద సవాలు ఎదురవుతుంది…
అయితే ఈ యుద్ధంలో రాముడే తట్టుకోలేని పరిస్థితి వస్తుంది… సహస్రకంఠ రావణుడి పరాక్రమానికి రాముడు మూర్ఛిల్లుతాడు. అప్పుడు రంగంలోకి దిగేది సీత!

సీతలోని మహాకాళి ఆవిష్కారం! ఇదే అద్భుత రామాయణంలోని అత్యంత ఆసక్తికరమైన మలుపు… అప్పటివరకు రాముడి పక్కన నిలిచిన సీత ఒక్కసారిగా తనలోని అపారమైన శక్తిని ఆవిష్కరిస్తుంది… సాధారణ స్త్రీ రూపాన్ని విడిచి మహాకాళి స్వరూపాన్ని ధరిస్తుంది… భయంకరమైన శక్తితో సహస్రకంఠ రావణుడిపై విరుచుకుపడి అతడిని సంహరిస్తుంది…
వాల్మీకి రామాయణంలో రావణుడిని సంహరించిన రాముడు… అద్భుత రామాయణంలో మరో రావణుడి చేతిలో మూర్ఛిల్లితే, సీత అతడిని అంతం చేస్తుంది… ఇక్కడ సీత కేవలం బాధితురాలు కాదు… ఎవరి రక్షణ కోసం ఎదురుచూసే పాత్ర అంతకంటే కాదు… అవసరమైనప్పుడు విశ్వరూపం ప్రదర్శించి దుష్టశక్తులను అంతం చేయగల ఆదిపరాశక్తి… ఇది శాక్త రామాయణం…
సీత జన్మకథలోనూ మరో కోణం! అద్భుత రామాయణం సీత పాత్రను మరో విధంగానూ ప్రత్యేకంగా చూపిస్తుంది… వాల్మీకి రామాయణంలో జనకుడు యజ్ఞం కోసం భూమిని దున్నుతున్నప్పుడు నాగేటి చాలులో సీత లభిస్తుంది… అందుకే ఆమె భూమిపుత్రి… కానీ అద్భుత రామాయణంలోని కథనంలో సీతకు రావణుడితో సంబంధం ఉన్న మరో జన్మవృత్తాంతం కనిపిస్తుంది… రావణుడి కుమార్తెగా ఆమెను చిత్రించే సంప్రదాయం కూడా ఇందులో భాగంగా వస్తుంది…
ఇలాంటి కథనాలు రామాయణం కాలక్రమంలో ఎన్ని రకాలుగా రూపాంతరం చెందిందో తెలియజేస్తాయి… ఎవరి రామాయణం వారిది!
అద్భుత రామాయణం వాల్మీకి రామాయణానికి మరో పేరేమీ కాదు… వాల్మీకి పేరుతో ప్రచారంలో ఉన్నప్పటికీ, అదే మహర్షి రచించిన గ్రంథమని నిర్ధారించే చారిత్రక ఆధారాలు లేవు… ఇది శాక్త సంప్రదాయ ప్రభావంతో రూపుదిద్దుకున్న ప్రత్యేక రామాయణ కథనం… ఇందులో రాముడితో పాటు సీతలోని దైవిక శక్తికి ప్రాధాన్యం ఇచ్చారు…
ఇదొక్కటే కాదు. భారతదేశంలోని వివిధ భాషల్లో, ప్రాంతాల్లో అనేక రామాయణాలు వెలిశాయి… తమిళంలో కంబ రామాయణం, తెలుగులో రంగనాథ రామాయణం, బెంగాలీలో కృత్తివాస రామాయణం, మలయాళంలో ఆధ్యాత్మ రామాయణం… ఇలా ఒక్కో రచనలో ఒక్కో ప్రత్యేకత కనిపిస్తుంది… భారతదేశం దాటి థాయ్లాండ్, కంబోడియా, ఇండోనేషియా వంటి దేశాల సంస్కృతుల్లోనూ రామకథ కొత్త రూపాలను సంతరించుకుంది…
ఎక్కడో ఒకచోట రాముడు ప్రధానమైతే, మరోచోట హనుమంతుడికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది… ఇంకొన్ని కథనాల్లో రావణుడి వ్యక్తిత్వానికి కొత్త కోణాలు కనిపిస్తాయి… మరికొన్ని చోట్ల సీతే కథకు కేంద్ర బిందువవుతుంది…
అంతిమంగా చెప్పాలంటే రామాయణం అనేది ఒక పుస్తకంలో ముగిసిపోయిన కథ కాదు… తరతరాలుగా సమాజం తన ఆలోచనలను, విశ్వాసాలను, విలువలను, ఊహాశక్తిని జోడిస్తూ చెప్పుకుంటూ వస్తున్న మహాకథ… వాల్మీకి రామాయణం దానికి ప్రాచీనమైన ప్రధాన ఆధారం కావచ్చు… కానీ రామకథ ప్రయాణం అక్కడితో ఆగిపోలేదు… అందుకే రామాయణాలు ఎన్నెన్నో!
Share this Article