.
పదేళ్ళుగా డిజిటల్ మీడియా ఆకాశం అంచులు దాటి ఇంకా ఇంకా పైపైకి వెళుతోంది. చేతి గడియారం, క్యాలిక్యులేటర్, స్టిల్ కెమెరా, వీడియో కెమెరా, డెస్క్ టాప్, టార్చ్ లైట్… ఇలా అనేక వస్తువులను స్మార్ట్ ఫోన్ మింగేసింది. ఇప్పుడు సెల్ ఫోనే బ్యాంక్, సెల్ ఫోనే పర్స్. సెల్ ఫోనే రేడియో. సెల్ ఫోనే టీ వి. సెల్ ఫోనే మీటింగ్ వారధి. సెల్ ఫోనే మనిషిని నడిపే సారథి.
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతివారికి తాము డిజిటల్ మీడియాలో ఏదో ఒకటి చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది. తమ మొహం అందంగా ఉండడం వల్ల లోకానికి చూపించాలని అనిపిస్తూ ఉంటుంది. లోపలనుండి తన్నుకొచ్చే జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టా, వాట్సాప్, యూ ట్యూబుల్లో పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది.
Ads
వాటికి జనం పెట్టే కామెంట్లను పదే పదే చదవాలనిపిస్తూ ఉంటుంది. క్షణక్షణానికి అందగించే తమ ముఖారవిందాలను వెను వెంటనే డిపిలుగా పెట్టుకుని లోకాన్ని అనుగ్రహించాలనిపిస్తూ ఉంటుంది. లక్షల వ్యూస్, లైకులు, షేర్లు రావాలనిపిస్తూ ఉంటుంది.
వ్యక్తిగతం, దాపరికం ఏమీ లేదు. డిజిటల్లో అంతా ఓపెన్. పెళ్లి, శోభనం, చావు, ఇంటా బయటా ఏదయినా లోకానికి చెప్పాలి. ఒకరిని చూసి ఒకరు… నువ్ తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటా అన్నట్లు డిజిటల్ కంటెంట్ లో పోటీలు పడుతున్నారు.
ఇంటర్నెట్ మొదలైనప్పటి నుండి జనం ఎదుటి మనిషి కంటే కంప్యూటర్ ముందే ఎక్కువ సమయం గడుపుతున్నారు.
సాధారణ ఫోన్ దాటి స్మార్ట్ ఫోన్ వచ్చాక అందులోనే వీడియోలు చూడడం ఎక్కువయ్యింది.
టిక్ టాక్, ఫేస్ బుక్ , ట్విట్టర్, ఇన్స్టా, వాట్సాప్ లలో రోజూ కోట్ల మంది రోజా కనీసం మూడు, నాలుగు గంటలకు తక్కువ కాకుండా వీడియోలు చూస్తున్నారు.
మద్యపానం, ధూమపానం లాంటి వ్యసనాల్లా సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూడడం కూడా ఒక దుర్వ్యసనంగా తయారయ్యింది.
పొట్టి వీడియోలు చూసే వ్యసనం బారిన పడ్డవారి మెదడు మొద్దుబారిపోతోందని, వారిలో జ్ఞాపకశక్తి తగ్గిపోతోందని న్యూరాలజిస్టులు శాస్త్రీయంగా విశ్లేషించి చెబుతున్నారు.
మద్యం సేవించినప్పుడు, జూదమాడుతున్నప్పుడు మెదడులో ఏ రసాయనిక చర్యలు జరుగుతున్నాయో… షార్ట్ వీడియోలు గంటలు గంటలు చూస్తున్నప్పుడు కూడా అదే రసాయనిక చర్యలు జరుగుతున్నాయని పరిశోధనల్లో తేలింది.
ప్రపంచానికి రీల్స్ పెను ప్రమాదంగా పరిణమించనున్నాయి.
-డిజిటల్ డిస్టెన్స్
-డిజిటల్ డివైడ్
-డిజిటల్ డిటాక్సేషన్
-డిజిటల్ ఇమ్యూనిటీ
-డిజిటల్ డీ అడిక్షన్
అని కొత్త డిజిటల్ పరిభాష కూడా పుట్టుకొచ్చింది. మాదక ద్రవ్యాలు, లిక్కర్ ఎక్కువగా తీసుకునే వారికి డీ అడిక్షన్ కేంద్రాలు ఉన్నట్లు… మన మెదళ్ళలో, శరీరాల్లో డిజిటల్ వైరస్ ను డీ టాక్స్ చేసి… డిజిటల్ ఇమ్యూనిటీని పెంచడానికి ఇక రావాల్సినవి “డిజిటల్ డీ అడిక్షన్ కేంద్రాలే”!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article