పంజా వైష్ణవ్ తేజ్… మెగా క్యాంప్ అనబడే ఓ హీరోల ఉత్పత్తి కర్మాగారం నుంచి బయటికి వచ్చిన ప్రొడక్ట్… పర్లేదు, మరీ అంత తీసిపారేయదగిన కేరక్టర్ ఏమీ కాదు… అప్పట్లో ఉప్పెన సినిమా చేసి మంచి మార్కులు సంపాదించాడు… తరువాత..? మళ్లీ ఏమీ లేదు…
ఎవరెవరో ఫీల్డ్‌కు వచ్చేసి మాస్ మసాలా సినిమాలు తీసి హీరోలుగా వర్దిల్లుతుంటే, మెగా ముద్ర ఉన్న తను మాత్రం ఎందుకు ఊరుకోవాలి అనుకున్నట్టున్నాడు… ఈసారి మాస్ మసాలా కమర్షియల్ రొటీన్ టెంప్లేట్‌ను నమ్ముకున్నాడు… తెలుగు సినిమాకు బాగా అలవాటైన సీమ నేపథ్యాన్ని, నరుకుడు స్ట్రాటజీని పట్టేసుకున్నాడు…
పైగా ‘‘నేను హీరోను కాను, నేను నటుడిని’’ అనే ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు మొన్న… ఉత్తదే… నిజానికి తనకు మనస్సులో ఉన్నదే హీరోగా వెలగాలనే కాంక్ష… (మన సౌత్ ఇండస్ట్రీలో హీరోయిజానికీ నటనకూ పెద్ద సంబంధం ఏమీ ఉండదు అని తెలిసిందే కదా…) హీరోకు తగిన నిర్మాత దొరికాడు… కాదు, దర్శకుడు దొరికాడు… చాలా జాగ్రత్తగా టెంప్లేట్ ప్రకారమే వెళ్లిపోయాడు, ఎక్కడ పొరపాటున కొత్తదనం కనిపిస్తుందేమో అనే భయభక్తులతో రొటీన్ రూట్‌లో వెళ్లిపోయాడు…
Ads
నిజానికి ఏముంది ఈ సినిమాలో..? కథను కాసేపు వదిలేయండి… శ్రీలీలను పెట్టుకున్నారు హీరోయిన్‌గా… ఇప్పుడు ట్రెండీ హీరోయిన్ కదా… ఆమె బలం డాన్స్… ఇందులోనూ బాగానే చేసింది… కానీ శ్రీలీలను ఓ నటిలా గాకుండా కేవలం డాన్సర్‌గా మాత్రమే చూస్తూ పోతుంటే ఆమె కెరీర్ ప్రమాదంలో పడ్డట్టే లెక్క… లెక్కకుమిక్కిలి ఆఫర్లు, వచ్చినవన్నీ పట్టేసుకుంటోంది, గాలివీస్తున్నప్పుడే కదా డబ్బు తూర్పార పట్టుకునేది… కానీ ఇలాంటి రొటీన్ పిచ్చిగెంతుల పాత్రల్నే నమ్ముకుంటే ఆమెకు ప్రమాదమే…
(భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ కాజల్… కానీ ఆమెకు ఏ ప్రయారిటీ లేదు, అసలు ఆ పాత్ర లేకపోయినా పోయిందేమీ లేదు… సినిమాలో హీరోకు దత్తు బిడ్డ పాత్రే ఐనా శ్రీలీల మెరిసింది… ఆ పాత్ర ఎంపిక మాత్రం శ్రీలీలకు ప్లస్… సో, ఏది ఒప్పుకోవాలో ఏది వద్దనాలో ఆమె తెలుసుకోవాలి…)
సుత్తి కామెడీ, బోరింగ్ యాక్షన్ సీన్లు… పెద్దగా ఆకట్టుకోని లవ్ ట్రాక్… సినిమా చాలాసేపు బోర్ కొడుతుంది… సంగీతం హోప్‌లెస్… హీరో ఒక చేతిలో పెద్ద గన్ను (తుపాకీ కాదు, రాళ్లు పగులగొట్టే పెద్ద సుత్తి) ఏమిటో, మరో చేతిలో భారీ వేటకత్తి ఏమిటో… లోగోలో త్రిశూలం కూడా ఉంటుంది… మన వాళ్లకు హీరోయిజం ఎలివేషన్ అనే పైత్యం ఉంది కదా… క్లైమాక్స్ ఫైట్ మరీ బోెయపాటి స్టయిల్‌లో ఉంది… ష్, పలుచోట్ల శ్రీలీల మెరుపుల ముందు హీరో వెలవెలబోయినట్టు కనిపించింది… ప్రత్యేకించి పాటల్లో… కథ, కథనం మన పాత సినిమాలనే గుర్తుతెస్తూ దర్శక రచయితల మీద జాలిని కలగజేస్తాయి…
చివరగా… స్టార్ హీరోలే ఇలాంటి టెంప్లేట్ సినిమాలు చేస్తే ప్రేక్షకులు లైట్ తీసుకుంటున్నారు… తోటి హీరోలను అరువు తెచ్చుకుని కాంబినేషన్ సినిమాలతో మాస్ ఊరమాస్ పోకడలు పోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు… ఈ దశలో నీకెందుకు ఈ సూపర్ హీరో ఎలివేషన్ తాపత్రయం నీకు పీవీటీ… అనగా పంజా వైష్ణవ్ తేజ్…!!
Share this Article