ఒక మలయాళ సినిమా… మంచి క్రైమ్ థ్రిల్లర్… రెండేళ్ల క్రితం సినిమా అది, కానీ ఇప్పుడు తెలుగు వెర్షన్ ఈటీవీ విన్‌లో కనిపించింది… ప్రధాన కథానాయిక అపర్ణ బాలమురళి… సినిమా చూస్తుంటే సినిమాకన్నా మరో అంశం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది… మామూలుగా మన హీరోయిన్లు ఎలా ఉండాలని నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఆశిస్తారు… పోనీ, మన తెలుగు ప్రేక్షకులు..?
కలర్, సౌష్టవం, అందం, ప్రత్యేకించి బక్క పలుచగా ఉండాలని చూస్తారు… పెళ్లయి తెర వీడిపోయిన వారిని వదిలేయండి, ఒక అనుష్క బరువు పెరిగి తన కెరీరే కోల్పోయింది.,. ఒక నిత్యామేనన్ చేజేతులా కెరీర్ చెడగొట్టుకుంది… ఇలా చాలా ఉదాహరణలు, బరువు పెరిగితే చాలు, ఇండస్ట్రీ ఇక చాలు అంటుంది… పెద్దగా మలయాళ ఇండస్ట్రీ ఈ లక్షణాలను పట్టించుకోదు… (ఐనా సరే నిత్యామేనన్ అవకాశాల కోసం ఎందుకు ఇబ్బంది పడుతుందో తెలియదు…) మొటిమల సాయిపల్లవిని కూడా మొదట్లో ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేసింది కూడా… మరి మనం చెప్పుకుంటున్న అపర్ణ..?
ఆకాశం నీ హద్దురా అని అప్పట్లో సూర్య సినిమా ఒకటి వచ్చింది గుర్తుంది కదా… ఆ హీరోయిన్… పెద్ద అందగత్తె ఏమీ కాదు, కానీ నటనలో మెరిట్ ఉంది… తరువాత లావయింది… కొద్దిగా విమర్శలు, జాలి వ్యక్తమయ్యాయి… ‘నా బాడీ నాకు ఇబ్బందిగా లేదు, నా నిర్మాతలకు సమస్య లేదు, నడుమ మీకొచ్చిన కష్టమేమిటి..?’ అన్నట్టుగా, సేమ్, నిత్యామేనన్ తరహాలో మాట్లాడింది… ఇప్పుడు అదృశ్యం సినిమా చూస్తుంటే ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే..?
Ads
లావుగా ఉంది… ఇండస్ట్రీ ఆమెను ఇగ్నోర్ చేయలేదు… 2022లో అయిదు సినిమాలు, 2023లో ఏడు సినిమాలు… ఈ సినిమాలో కూడా కొన్నిచోట్ల కనీసం పౌడర్ కూడా పూసుకున్నట్టు లేదు… ఈ పాత్రకు నిజానికి గ్లామర్ కూడా అక్కర్లేదు… చాలా సటిల్డ్‌గా చేసుకుంటూ పోయింది… ఎంతైనా మలయాళ ఇండస్ట్రీ టేస్ట్, పోకడ చాలా డిఫరెంట్…
ఇక సినిమాకు వద్దాం… మలయాళ ఇతర క్రైమ్ థ్రిల్లర్లలాగే… ఎక్కడా డీవియేషన్ లేదు… సోకాల్డ్ తెలుగు సినిమా బాపతు కమర్షియల్ వాసనలూ లేవు… స్ట్రెయిట్ కథ… అక్కడక్కడా ట్విస్టులు… జానకి పేరున్న కథానాయిక ఓ హత్యను తనదైన శైలిలో తవ్వుతూ పోతుంది… చివరిదాకా సస్పెన్స్… ఒక మహిళ నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్లి నేనో హత్య చేశాను అని లొంగిపోతుంది… రండి, పాతేసిన స్థలం చూపిస్తాను అంటుంది…
మొదట పోలీసులు నమ్మరు, తరువాత ఆ స్థలం వెళ్లి తవ్వితే రెండు శవాలు… ఆమె చెబుతున్న వ్యక్తి శవం వాటిల్లో లేదు, మరి ఎవరివి అవి..? పోలీసులు, రాజకీయ నాయకులు పాత్రలేమిటి..? ఒకరినొకరు సహకరించుకునే ఆ నిందితులకు హీరోయిన్ ఎలా ఫిక్స్ చేసింది, తనకు ఎవరు సహకరించారు అనేదే కథ… స్టోరీ లైన్ ఇంట్రస్టింగ్ కదా… ఎస్, నిజం చెప్పాలంటే ఆ పాత్రకు అపర్ణ తక్కువ చేయలేదు, ఎక్కువ చేయలేదు… ఆప్ట్ పర్‌ఫామెన్స్… మిగతావాళ్లంతా మనకు తెలియదు, తెలియాల్సిన పని లేనట్టుగా సినిమా నడుస్తుంది…
Share this Article