గల్ఫ్‌లో ఉపాధి కోసం ఆశ… ఏజెంట్ల మోసాలు… అక్కడి పనిచేయించుకునే ఆసాములు పెట్టే ఆంక్షలు, బాధలు… తప్పించుకునే వీల్లేక, అక్కడే కడతేరిపోయిన బోలెడు జీవితాలు… ఒక్క కేరళ ఏం ఖర్మ..? తెలంగాణలో లేరా..? కొన్ని చేదు అనుభవాలు బయటికొస్తాయి, కొన్ని ఆ ఎడారి దిబ్బల్లో కప్పబడిపోతాయి…
అలా ఉపాధి కోసం నైన్టీస్‌లో వెళ్లిన ఓ కేరళ యువకుడు ఎదుర్కొన్న కష్టాలు, తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నమే గోట్ లైఫ్… అనగా ఆడుజీవితం… ఇదే పేరుతో బెన్యామిన్ అనే రచయిత కొన్ని స్వీయ అనుభవాలతో పాటు కొంత క్రియేషన్ తో ఓ పుస్తకం రాశాడు… దాని పేరే ఆడుజీవితం… చాలా పాపులర్ నవల… దానికి కొంత క్రియేటివ్ ఫ్రీడం తీసుకుని, సినిమాకు సరిపడా స్క్రీన్ ప్లే రాసుకుని దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమా తీశాడు… ఆడు అంటే మేక… సినిమాకు కూడా బకరా అనో మరో పేరో పెడితే సరిపోయేది, ఆడుజీవితం అనే మలయాళీ టైటిల్ తెలుగు వెర్షన్‌కు ఆడ్‌గా ఉంది…
అక్కడక్కడా అరబ్ యజమానులు మాట్లాడుకునే సంభాషణలకు సబ్ టైటిల్స్ వేశారు, కొన్నిచోట్ల లేవు, ప్రేక్షకుడికి అక్కడ ఏమీ అర్థం కాదు… ఆరేడేళ్లు చిత్రీకరించారట… ఈకాలంలో ఊఁ అంటే గ్రాఫిక్స్‌కు వెళ్తున్నారు కదా, ఈ నిర్మాతలు జోర్డానో మరో దేశమో వెళ్లి సహజమైన భౌగోళిక వాతావరణంలో ఎడారి సీన్లను తీశారట… ఈ సినిమాకు సంబంధించి మనకు బాగా అనిపించే మైనస్ పాయింట్… సాగదీత… అందుకే పలుచోట్ల సినిమా బోర్ అనిపిస్తుంది… మరీ రెగ్యులర్ సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు అస్సలు ఎక్కదు… ఏదో మలయాళీ సినిమాను సగం సగం డబ్ చేసి మన మొహాన కొట్టినట్టు అనిపిస్తుంది… ఇది ఒక కోణం…
Ads
మరో కోణం ప్రస్ఫుటంగా కొందరిని మెచ్చుకోవాలనిపించేలా ఉంటుంది… నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ మనకు పెద్దగా తెలియదు, కానీ సినిమాలో ఇరగదీశాడు… మరీ అతిశయోక్తి కాదు గానీ తన కెరీర్‌లో మళ్లీ ఇలాంటి పాత్ర తనకు వస్తుందనేది అనుమానమే… మలయాళ క్రియేటర్స్ గతంలో వేరు… షకీలా బాపతు సినిమాల్ని హడావుడిగా రీళ్లు చుట్టేసి చీప్ టేస్ట్, చీప్ కాస్ట్‌తో రిలీజ్ చేసిపారేసేవారు… కమర్షియల్ రేంజ్ కూడా తక్కువే ఒకప్పుడు… కానీ ఇప్పుడు..?
సాహసించి కొత్త ప్రయోగాలు చేస్తున్నారు… కొత్త కథలకు వెళ్తున్నారు… మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి వెటరన్ సూపర్ స్టార్లు సైతం కొత్త కొత్త చాలెంజింగ్ పాత్రల్ని పోషిస్తున్నారు… ట్రూ లవర్స్ ఆఫ్ సినిమాా… వాళ్లకు సినిమా ఓ ప్యాషన్, ఓ తపస్సు కొందరికి… సరే, అన్నీ క్లిక్ కావాలనేమీ లేదు… కానీ భ్రమయుగం వంటి సినిమాల్ని తెలుగులో ఊహిాంచగలమా..? మన వెటరన్ స్టార్లలో ఒక్కరైనా మమ్ముట్టి పాత్ర చేయగలరా..? నాలుగే పాత్రలు, బ్లాక్ అండ్ వైట్, అడవిలో ఓ పెంకుటిల్లు… ఈ ఆడుజీవితానికి వస్తే… కథ మంచిదే, పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేశారు సరే… కానీ…
ఏఆర్ రెహమాన్ తన ప్రతిభనంతా రంగరించాడు బీజీఎం కోసం… పృథ్విరాజ్ సుకుమారన్ కష్టం తెరపై కనిపిస్తుంది… తన ఆకారం, ఆహార్యం గట్రా పర్‌ఫెక్ట్‌గా కుదిరాయి ఆ పాత్రకు… ఇలాంటి పాత్రలకు తమిళ, మలయాళ నటులే సాహసిస్తారేమో… బహుశా ఈసారి జాతీయ అవార్డుకు మమ్ముట్టితో పోటీపడతాడేమో… ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఓ లెవల్‌కు తీసుకెళ్లారు… దర్శకుడి తపన బాగుంది… చాలా సీరియస్ సబ్జెక్టు కాబట్టి కామెడీ ఉండదు, కాస్త రొమాన్స్ అమలాపాల్‌తో ఉంది… ఇక ఎంతసేపూ ఆ ఎడారి కష్టాలు, కన్నీళ్లు, బాధ, తప్పించుకునే ప్రయత్నాలతో సినిమా సా-గు-తూ ఉంటుంది… అదీ బోరింగ్…
ఇది ఎప్పుడో 2010లో రాజస్థాన్ ఎడారుల్లో తీయాలని అనుకున్నారు… అప్పటి నుంచీ సాగుతోంది సినిమా ప్రస్థానం… చివరకు 2018లో గానీ స్టార్ట్ కాలేదు షూటింగ్… అడ్డంకులకు అనేక కారణాలు… ఒకసారి సినిమా టీం మొత్తం జోర్డాన్‌లోనే చిక్కుకుపోతే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అందరినీ తీసుకొచ్చింది… సినిమాలో హీరోకు ఎన్నికష్టాలున్నాయో, మొత్తం సినిమా నిర్మాణానికి దర్శకనిర్మాతలు అంతకన్నా ఎక్కువ కష్టాలే అనుభవించారు…
Share this Article