లండన్… అప్పట్లో, అంటే స్వతంత్రం వచ్చిన కొత్తలో ప్రతి కీలక విషయానికి లండన్ మీదే ఆధారపడేవాళ్లం… మొన్నమొన్నటిదాకా కరెన్సీని కూడా అక్కడే ప్రింట్ చేయించాం తెలుసు కదా… అప్పట్లో అమెరికాను పెద్దగా ఎవరూ దేకేవాళ్లు కాదు, మన రూపాయి, వాడి డాలర్ సేమ్ వాల్యూ… మన సైనిక పరికరాలు, అవసరాల సరఫరాకు కూడా లండనే ఆధారం… ఓరోజు మన సైనికాధికారి లండన్‌లోని సైనిక దుస్తుల సప్లయర్ దగ్గరకు వెళ్లాడు… మాటామంతీ మధ్యలో…
మీ దాయాది పాకిస్థాన్ ‘‘అత్యంత శీతల వాతావరణానికి అనువైన దుస్తులు కావాలని ఆర్డర్ పెట్టింది… బూట్లు, కళ్లద్దాలు అన్నీ ప్రత్యేకమే..’’ అని చెప్పాడు ఆ సప్లయర్… మన సైనికాధికారి ఆలోచనల్లో పడ్డాడు… ఇటు పంజాబ్, అటు బంగ్లా సరిహద్దుల్లో మరీ శీతల వాతావరణం ఉండదు… పాకిస్థాన్ ఇంకేదో ప్లాన్‌లో ఉందనుకుని, రకరకాల గూఢచర్య సమాచారాన్ని సేకరించి, క్రోడీకరించుకున్నాడు… తెలిసిపోయింది… పాకిస్థాన్ మొత్తం సియాచిన్ ప్రాంతాన్ని కబళించబోతోంది…
అది వ్యూహాత్మకంగా కీలకప్రాంతం… రెండు దేశాల హద్దులు ఏమిటో ఎవడూ చెప్పేవాడు ఉండడు… 5400 మీటర్ల ఎత్తులో ఎప్పుడూ మంచు… పాకిస్థాన్ ప్రణాళిక అర్థమైన ఇండియా అవేతరహా ‘‘అత్యంత శీతల వాతావరణ దుస్తులు, పరికరాల’’కు రెట్టింపు సంఖ్యలో అదే సప్లయర్‌కు ఆర్డర్ ఇచ్చింది… పాకిస్థాన్‌కన్నా ముందే రంగంలోకి దిగింది… కీలకమైన చోట్ల సైనిక పోస్టులు పెడుతూ, పాకిస్థాన్‌కు చెక్ పెట్టింది… 1984లో జరిగిన ఈ ఆపరేషన్ పేరు మేఘదూత్…
Ads
ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తయిన, అత్యంత ప్రతికూల యుద్ధక్షేత్రం అది… అదొక మిలిటరీ మార్చురీ… జవాన్లు బుల్లెట్లతో కాల్చుకుని మరణించడం చాలా తక్కువ… ముంచెత్తే అవలాంచీలు, మంచు తుఫాన్లలో ప్రాణాలు కోల్పోతుంటారు… నీళ్లు తాగడం దగ్గర నుంచి ప్రతిదీ సమస్యే అక్కడ… కొన్నిసార్లు ప్రకృతి ఆగ్రహిస్తే సైనిక పోస్టులు కొన్ని మీటర్ల ఎత్తులో కప్పబడిపోతుంటయ్… మనుషులు మాయం… ఆపరేషన్ మేఘదూత్ ఆరంభమయ్యాక రెండు దేశాల వైపు నుంచి 2000 మంది సైనికులు మరణించి ఉంటారని అంచనా…
ఇంగ్లిషోడు పోతూ పోతూ… దేశాన్ని రెండుగా చీల్చే పనిని రాడ్‌క్లిఫ్ అనే పెద్దమనిషికి అప్పగించాడు… ఆయనకేమో ఈ దేశ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రూపస్వభావాలు ఏమీ తెలియవు… 2900 కిలోమీటర్ల పొడవైన ఓ గీత గీశాడు… అక్కడ ఎగిసిన రావణకాష్టం మంటలు ఇప్పటికీ చల్లారలేదు… సియాచిన్ అలాంటి మంటే… ‘‘అంత ఎత్తున యుద్ధం దేనికిరా..? రెండు వైపులా నష్టమే కదా అంటారా..?’’ భలేవారే… ఇండియా- పాకిస్థాన్ నడుమ విజ్ఞతలు, పరిపక్వతలు పనికిరావు… ఇప్పటికీ అక్కడ యుద్ధమే…
ఇండియాకు రోజుకు అయిదారు కోట్ల వ్యయం… వెనక్కి రాలేం, పాకిస్థాన్‌ను పూర్తిగా ఖాళీచేయించలేం… ‘‘నిర్యుద్ధ ప్రాంతం’’గా ఏ అమెరికానో, ఏ రష్యానో మధ్యవర్తిగా పెట్టి, సంతకాలు చేసుకోవచ్చు… కానీ పాకిస్థాన్‌ను కలలోనైనా నమ్మగలమా..? విశ్వసనీయత అనే పదమే తెలియని రోగ్ కంట్రీ అది… సో, సియాచిన్ యుద్ధం జరుగుతూనే ఉంటుంది… మరి ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే… నిన్న అనుకోకుండా కనిపించిన ఓ మృతదేహం… అది 38 ఏళ్ల క్రితం ఆపరేషన్ మేఘదూత్ కోసం వెళ్లిన సైనికుడి మృతదేహం…
మంచు పర్వతాల్లో ఆరోహకులకు, సియాచిన్ సైనిక విభాగాలకు అప్పుడప్పుడూ ఇలా శవాలు కనిపించడం మామూలే… ప్రకృతి అరేంజ్ చేసిన మంచుపెట్టె కదా… శవాలు ఏమాత్రం కుళ్లిపోవు… కాకపోతే మంచు లోయల్లో కప్పబడిపోయి, అలాగే ఉండిపోతాయి… అనుకోకుండా ఇలా బయట పడుతుంటయ్… మంచు ధాటికి కనిపించకుండా పోయిన ఓ మిలిటరీ షెల్టర్/బంకర్ ఇలాగే బయటపడింది… అందులో 19కుమావో రెజిమెంట్‌కు చెందిన చంద్రశేఖర్ హర్‌బోలా అనే జవాన్ మృతదేహం కనిపించింది…
అప్పట్లో మంచు తుఫాన్‌లో చిక్కుకుని గల్లంతైన బంకర్ అది… 20 మంది టీమ్‌లో 15 మంది ఆనవాళ్లు, అవశేషాలు మాత్రమే దొరికాయి… మిగతా అయిదుగురి మళ్లీ జాడలేదు… అదుగో ఆ అయిదుగురిలో ఈ చంద్రశేఖర్ కూడా… కొన్నాళ్లు చూసి అమరులుగా ప్రకటించారు… ఆయన భార్య శాంతిదేవి ఉత్తరాఖండ్‌లోని హల్ద్‌వానిలో ఉంటుంది… ఇప్పుడు ఆ మృతదేహాన్ని అక్కడికే తీసుకొస్తున్నారు… సంప్రదాయిక పద్ధతుల్లో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు… 38 ఏళ్ల క్రితం మరణించిన వ్యక్తికి ఇప్పుడు ప్రపంచం నుంచి తుది వీడ్కోలు… అన్నట్లు అదే బంకర్‌లో మరో జవాను మృతదేహం కూడా దొరికింది… తన వివరాలు ఇంకా ధ్రువీకరించలేదు… ఇదీ వార్త… కాదు… కథ… అత్యంత ఎత్తయిన ఆ మిలిటరీ మార్చురీలో ఇలాంటి కథలెన్నో..!!
Share this Article