.
1984… భారతీయ తొలి వ్యోమగామి వింగ్ కమాండర్ రాకేష్ శర్మకి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఓ ప్రశ్న వేసింది… అంతరిక్షం నుంచి ఇండియా ఎలా కనిపిస్తోంది అని… దానికి రాకేష్ శర్మ ఇచ్చిన స్ట్రెయిట్, సింపుల్ సమాధానం…
‘సారే జహాఁసే అచ్చా’… ఇది మొహమ్మద్ ఇక్బాల్ రాసిన ఓ దేశభక్తి కవితా శీర్షిక… ఆ మాట అనడానికి ప్రేరణ ఏమిటి..? దేశంపై ప్రేమ..! అంత బలంగా, గాఢంగా ఉంది కాబట్టే దేశం అంతరిక్షం నుంచి కూడా అందంగా కనిపించింది…
Ads
ఇదెందుకు గుర్తొచ్చిందీ అంటే..? ఈమధ్య అనుకోకుండా 9 నెలలపాటు అంతరిక్షంలో చిక్కుపడిపోయి, ఎలన్ మస్క్ సహకారంతో భూమికి తిరిగివచ్చింది కదా సునీతా విలియమ్స్… నిన్న మీడియా ముందుకు వచ్చింది….
ఆమెకు నలభై ఏళ్ల క్రితం రాకేష్ శర్మకు ఎదురైన ప్రశ్నే ఎదురైంది..? ఆమె ఒకేమాటలో చెప్పింది… ‘అద్భుతం’… అంతేకాదు… ‘‘హిమాలయాలు అత్యద్భుతం… వాటి మీదుగా వెళ్తున్న ప్రతిసారీ బోలెడు ఫోటోలు తీశాం… గుజరాత్, ముంబై మీదుగా వెళ్తున్నప్పుడు మత్స్యకారుల చేపలు మాకు సిగ్నల్స్‌గా కనిపించేవి… పెద్ద నగరాల లైట్ల నెట్‌వర్క్ ఏదో చిన్న నగరాలవైపు ప్రవహిస్తున్నట్టుగా అనిపించేది…’’
రాకేష్ శర్మ ఇండియన్… తన ప్రేమ వ్యక్తీకరణ సహజం… మరి సునీతా విలియమ్స్… ఆమె ఇండియాలో పుట్టలేదు… జన్మతః అమెరికన్… తండ్రి దీపక్ పాండ్యా అప్పుడెప్పుడో అమెరికా వెళ్లాడు, స్లొవేనియా రూట్స్ ఉన్న ఉర్సులిన్ బోనీని పెళ్లి చేసుకున్నాడు… సునీత పెళ్లి చేసుకుంది కూడా ఓ అమెరికన్‌ను… ఇండియా, స్లొవేనియా, అమెరికన్ సాంస్కృతిక మేళవింపు ఆ కుటుంబం…
ఐనా సునీత ఇండియా అద్భుతంగా కనిపించింది అంటోంది… ఆమెకు ఈ దేశం పట్ల గాఢంగా ఉన్న అనురక్తి అది… అదే పలికించింది అలా… తను అంతరిక్షంలోకి గణపతి ప్రతిమను, భగవద్గీతను తీసుకెళ్లిందనే వార్తలు చదివాం కదా… అవును, ఆమె ప్రాక్టీసింగ్ హిందూ…
ఇండియాను త్వరలో సందర్శించాలని ఉంది అంటున్నదామె… ఆమె వయస్సు అరవై ఏళ్లు… తండ్రి కూడా ఇండియాకు తిరిగి వచ్చేయాలని ఉందని వెల్లడించాడు… ఆమె ఎప్పుడూ తన ఇండియన్ రూట్స్ మీద ప్రేమను వ్యక్తీకరించేది కాబట్టే ఆమె అంతరిక్షంలో చిక్కుపడిపోతే, తిరిగి వస్తున్నప్పుడు దేశమంతా ప్రార్థనలు చేసింది…
తమ బిడ్డ అనే మమకారం అది, అభిమాన ప్రకటన అది… అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ రాకేష్ శర్మను అడిగినట్టుగానే… మోడీ కూడా సునీత విలియమ్స్‌కు ఓ ఖగోళ కాల్ చేసి అదే ప్రశ్న వేస్తాడేమో, మంచి ప్రచారం వచ్చేది కదానే కొన్ని జోకులు వినవచ్చినా, అది జరగలేదు..!!
Share this Article