ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా!
బుల్లెట్ దిగిందా లేదా అన్నది లెక్క!………… By….. పమిడికాల్వ మధుసూదన్
తెలంగాణాలో గన్ లైసెన్సులు తొమ్మిది వేలే ఉన్నాయని ఒక వార్త. వెనకటికి శివ ధనుస్సు విరిగిన సందర్భాన్ని చెబుతూ కరుణశ్రీ ఒక పద్యంలో…ఒక్క నిముషంలో నయము; జయము; భయము, విస్మయము కదురా! అన్నాడు.
Ads
అలా ఈ తుపాకుల వార్తను మనం కూడా క్రమాలంకారంలో పూరించుకుందాం.
నయం:-
నాలుగు కోట్ల తెలంగాణ జనాభాకు ఒక శాతం లెక్క వేసినా నాలుగు లక్షల తుపాకి లైసెన్సులు ఉండాలి. ఇప్పుడు 0.022 శాతంలోనే ఉండడం నయమే. అయితే ఈ వార్తలో లెక్క పోలీసు పద్దుల్లో ఉన్న ప్రకారం. అనధికారికంగా ఎంతమంది దగ్గర ఉన్నాయో- వారు వాడితే గానీ పోలీసులకు కూడా తెలియదు. వాడిన తరువాత చింతించి పెద్దగా ప్రయోజనం కూడా ఉండదు కాబట్టి- అనధికారికంగా ఇబ్బడి ముబ్బడిగా తుపాకులు ఉండకపోవచ్చు అని భ్రమపడడమే పిరికివారికి శ్రీరామరక్ష!
జయం:-
నిజానికి పోలీసులు, మిలటరీ దగ్గరే తుపాకులు ఉండాలి. సామాన్యుల దగ్గర కూడా తుపాకులు ఉండడం సమాజ పురోగతిలో దానికదిగా ఒక జయం. ఒకరకంగా పోలీసుల మీద పౌర సమాజం సాధించిన జయం కూడా.
భయం:-
తుపాకి ఎప్పుడయినా ప్రాణం తీయాలి. అది దాని వృత్తి. దాని ధర్మం. దాని హక్కు. భయపెట్టడానికి తుపాకి కొంతవరకు ఉపయోగపడే మాట నిజమే. భయపెట్టడంలో విఫలమయినప్పుడు తుపాకి తూటాను బయటికి తీసి ప్రాణాలను మింగేస్తుంది. భయపడేవాడు ఆత్మరక్షణకు తుపాకి దగ్గర పెట్టుకోవాలి. భయపెట్టేవారు పరభక్షణకోసం తుపాకి దగ్గర పెట్టుకోవాలి. రెండు సందర్భాల్లో భయం కామన్.
విస్మయం:-
జనసామాన్యం దగ్గర దాదాపు పదివేల లైసెన్స్ ఉన్న తుపాకులు ప్రాణాలు తీయడానికి పొగలుగక్కుతూ సిద్ధంగా ఉండడం సున్నిత మనస్కులకు విస్మయం.
నయం- జయం- భయం- విస్మయం అన్న నాలుగు భావనలను కరుణశ్రీ ప్రకారం అన్వయించుకోగా వచ్చినవి. ఆయన రాసిన సందర్భం వేరు. కాబట్టి అక్కడికే పరిమితమయ్యాడు. ఇప్పుడు మనం మరికొన్ని కలుపుకుంటే ఆయనేమీ కాదనడు.
హోదా
ఈరోజుల్లో తుపాకి, తుపాకి సహిత గన్ మెన్ ఉండడం ఒక హోదా. ఒక గొప్ప విజిటింగ్ కార్డు లాంటిది. విమానాశ్రయాల్లో, రైల్వే స్టేషన్లలో ఇంకా అనేక చోట్ల తుపాకులున్నవారినే ముందు పంపుతుంటారు. అది వారికిచ్చే మర్యాద, గౌరవంగా మనం అసూయ పడాల్సిన పనిలేదు. తుపాకికి ఇచ్చే గౌరవ మర్యాదలవి. చుట్టూ ఎన్ని గన్నులుంటే అంత గొప్ప. అందులో నల్ల పిల్లులు, తెల్లపిల్లులు పట్టుకున్న బ్లాక్ క్యాట్ కమాండోస్ ఉంటే ఇక తిరుగులేదు. పిల్లికి బిచ్చం పెట్టని నాయకుడికి పిల్లులెలా రక్షణ కల్పిస్తాయి? అని సహజ న్యాయ సూత్రాలను ఇక్కడ మనం ప్రస్తావించి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే పిల్లి కళ్లు మూసుకుని పాలను రక్షిస్తూ సేవిస్తూ ఉంటుంది కాబట్టి.
సెటిల్మెంట్ ఫ్రెండ్లి
రియల్ ఎస్టేట్, ఇండస్ట్రీ, సినీ తారలు, ఇతర రంగాల సెలెబ్రిటీలు ఇలా ఎవరయినా తమకు తాము చాలా పెద్దవాళ్లం అయ్యాం అనుకున్న క్షణంలో- వెంటనే వారి ప్రాణాలు మిగతావారి ప్రాణాలకంటే చాలా విలువయినవిగా అనిపిస్తుంది. పోలీసులమీద నమ్మకం పోతుంది. తమదగ్గరే తుపాకి ఉండాలనిపిస్తుంది. వెంటనే వారికున్న పరిచయాలతో పైరవీలు చేసుకుని తుపాకిని ఒక దుర్ముహూర్తాన ఇంటికి తెచ్చుకుంటారు. తుపాకి చేతిలో ఉంటే ఎప్పుడో ఒకప్పుడు దాన్ని వాడాలనిపించి ఎవరి ప్రాణమో తీసిపెడుతూ ఉంటారు. నిజానికి ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇతర సెటిల్మెంట్లలో ఒక తుపాకి చేతిలో ఉంటే పని చిటికెలో అయిపోతుంది. హీనపక్షం బొమ్మ తుపాకీ వాడినా ఒక్కోసారి ఫలితముంటుంది.
క్రిమినల్ ఫ్రెండ్లి
పది నెలలు దాటి అప్పుడే తడబడుతూ నడక నేర్చుకునే పిల్లలకు మనం కొనిచ్చే ఆటబొమ్మల్లో తుపాకి ఉండి తీరాలి. ఈ బొమ్మ తుపాకి రేపు నువ్ పెరిగి పెద్దయ్యాక నిజమయిన తుపాకి అగుగాక! అని మనం ఆశీర్వదించి పసిపిల్లల చేతిలో పెడుతున్నాం. పిల్లలు ఆడుకునే యానిమేషన్ గేమ్స్ లో ఎన్ని తుపాకులు పేలితే అంత గొప్ప. తుపాకి క్రైమ్ ను ఉసిగొల్పుతుంది. క్రైమ్ కు సహకరిస్తుంది. చివరకు క్రిమినల్ గా మారుస్తుంది. గోటితో పొయ్యేదానికి గొడ్డలి ఎందుకు? అన్నది సామెత. మాటతో పొయ్యేదానికి తూటా ఎందుకు? అని సామెతను తిరగరాసుకుని సంయమనం పాటించే మంచికాలం ఉంటుందా? ఉంటే మనకు కనబడుతుందా?
Share this Article